ఒక ఇరువయేండ్ల కిందటి వరకూ
ఒగాది మొదలు రాకీట్లపున్నమ దాకా
కూరగాయలు కరువు. వొరుగులతోనే వంటలు.
పప్పంటే మా దగ్గర తొంభైపాళ్లు పెసరుపప్పే.
ఏదోవోసారి పప్పుచారుకు మాత్రమె కందిపప్పు.
చెరిగి..కోడి.. నాపలు-బుడ్డుపెసళ్లు ఏరేసి
మంచి గట్టిపెసళ్లు ఎండవోసి పొతంగ విసిరి
మల్లోసారి చెరిగి పరంగిరం లేకుంట తీసేసి
మూడునాలుగు కుంచాలంత పొట్టుపప్పు
ఈతచాపల రాశివోసి గానుగపల్లినూనెకు
పసుపుగలిపి,ఆ చమరు పప్పుకు పట్టించి
అద్దగంటసేపు మంచిగ పప్పంత కలెగలిపి
ఎత్తి, అర్రల గడంచెమీద ఓరకు వెడుదురు.
Ads
పదిహేను రోజులైనంక వాడుకానికి తీద్దురు.
ఒక్కసారి కుదురువెట్టి రోట్లె పోటువెట్టిండ్రంటె
ఏడాది పొడువున్నా సరే పురుగువట్టుడు లేదు.
చమరుపసుపు రాసిన పప్పుకు పోటు శాత్రానికే,
చాట్లవోసి నలిపి చెరుగుతెనే పొట్టంత కొట్టుకపోద్ది.
ఇగ ఎండకాలం పొడువూత పప్పూపప్పూపప్పూ
ఏదోతీరుగ పప్పుతోటే పూటగడుపుడు ఉంటుండే.
ఇప్పటితీరుగ చల్లటితనాబ్బిపెట్టెలు ఆనాడేడియి
నీళ్లకుండ దాపునవెట్టినా, ఉట్టిమీద గాలికి పెట్టినా
పొద్దటీలి వండినపప్పు మాపటికి బుడ్డుబుడ్డు అవుడే.
కొత్తకారం ఎక్కవగవేస్తే కారపుపప్పు
ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తే ఉల్లిగడ్డపప్పు
ధనియాలపొడి ఎక్కువ వేస్తే మసాలపప్పు
ఎసరు ఎక్కువపెట్ఠి పలుచగజేస్తే నీళ్లపప్పు
జిలుకరెల్లిపాయ వేసి గట్టిగరుద్దుతె ముద్దపప్పు
ఉప్పురవ్వగూడ లేకుంట సప్పగవండుతె ఉత్తపప్పు.
పలుకుపలుకుగ ముద్దముద్దగ పలుచపలుచగ
ఎట్ల వండినాసరే, పోలికనే లేదు. దేనికదే కమ్మదనం.
పచ్చిపులుసు, మసలవెట్టిన పులుసు ఏదైనా సరిజోడే.
ఇంత సల్లబొట్టు, అంచుకు సన్నముక్క తొక్కుంటే ఐపాయె.
శ్రావణం ఇంకెప్పుడొస్తదా అన్న రంధిరాపాటమే లేకపోతుండే.
అలువాటైన పానం అంగడంగడి అని, ఇపుడు అన్ని తిప్పలే.
కూరగాయలు అగ్గువధరకు దొరుకుతె, ఖదరూ రుచీ తక్కువ.
పిరమైనంక వందలువోసికొంటే అరుకతిబరుకతి ఉండదాయే.
సంపాదన పెరిగిందేమోగని, సగంముప్పావు తృప్తి ఖతమైంది !! …. ~ డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article