ఆయన పేరు ముక్తవరం పార్థసారథి… Loneliness of a long distance runner
———————————————————–
గుడిపాటి వెంకట చలం, వరవరరావుకి రాసిన ఒక ఉత్తరంలో “హైదరాబాదులో కోటీకి దగ్గరే ఎక్కడో పార్థసారథి గారిని ఒకాయన ఉంటారు.
Ads
కష్టాల్లో ఉన్నాడు. వీలైతే వెళ్లి కలవండి” అని కోరారు. చలం మాట కదా.. వెతుక్కుంటూ వెళ్లిన వరవరరావు, పార్థసారధిని కలిశారు.
అది 1961లో. నిన్నటికి సరిగ్గా 60 ఏళ్ళ క్రితం. అప్పుడు ముక్తవరం వయసు 17 ఏళ్లు!
“పార్థసారథి నాకు చలం గారిచ్చిన మిత్రులు” అని రాశారు వరవరరావు, ముక్తవరం నవల ‘శూన్యం’కి ముందు మాటలో.
Brilliant writer from Bhuvanagiri.
రచయిత, అనువాదకుడిగా మంచి పేరున్న ముక్తవరం పార్థసారథి నల్గొండ జిల్లా భువనగిరిలో పుట్టారు. పదో క్లాసు దాకా అక్కడే చదువు.
పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చారు.
చలం ‘మైదానం’ నవల మొదటిసారి చదివినపుడు ఆయనకేమీ అర్థం కాలేదు. జేబులో ఉన్న కొద్దిపాటి డబ్బు లో 16 రూపాయలు పెట్టి టికెట్ కొని, మద్రాసు రైలు ఎక్కాడు. వాళ్లనీ వీళ్ళనీ కనుక్కుని, తిరువన్నామలై వెళ్ళాడు. చలం వుండే చోటది.
అక్కడికి ఎవరు వెళ్ళినా ఆదరించి, అన్నం పెడతారు. ముక్తవరం పార్థసారథి అనే కుర్రాడికి, నర్తకి టవల్ ఇచ్చి, స్నానం చేసి రండి అనింది. వచ్చాక, పొద్దున్న మిగిలిన మూడు ఇడ్లీలు పెట్టింది. అక్కడ ఐదు రోజులున్నాడు పార్థసారథి. తిరుగు ప్రయాణానికి డబ్బుల్లేవు. ఎలాగో తిప్పలుపడి చలమే పంపించారు. అక్కడ వాళ్లదీ పేదరికమే.
*** *** ***
తొమ్మిది పదేళ్ల క్రితం కావొచ్చు. ఆర్టిస్ట్ మోహన్, వేలుపిళ్లై రామచంద్రరావు, నేనూ హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని పార్థసారథి ఇంటికి వెళ్ళాం. చాలా కబుర్లు. “శ్రీశ్రీవి కాపీ కవితలు. ఒరిజినల్ కావు. విదేశీ కవుల పద్యాల్నీ, ఇమేజిలనీ కొట్టేసి, రాసేశాడు” అని చాలా గట్టిగా చెప్పారు పార్థసారథి. మన సాహిత్యానికి శ్రీశ్రీ కంట్రిబ్యూషన్ ని మొత్తంగా చూడకుండా ఈ చిన్న ఏరియాని భూతద్దంలో చూపెట్టి, శ్రీశ్రీని దొంగ అనటం నాకు నచ్చలేదు. అప్పుడే పార్థసారథి మీద కక్ష పెట్టుకున్నాను.
కే సదాశివరావు కూడా అచ్చూ ఈయన లాగే శ్రీశ్రీని తీసిపారేసేవాడు. పార్థసారథి కథలూ, కొన్ని అనువాదాలూ చదివాక ఆయన మీద ఇష్టం కలిగింది. ముఖ్యంగా అనువాదం చేయడానికి ఆయన ఎంచుకున్న కథలు – గొప్ప టేస్ట్ ఉన్నవాడే చేయగలిగిన పని!
*** *** ***
1944 జూలై 7 వ తేదీన పుట్టిన పార్థసారథికి నేటికి 79 ఏళ్ళు నిండుతున్నాయి.
ఆయన బర్త్ డే అని తెలిసి ఫోన్ చేశాను. మొన్నాదివారం – 2021 జూలై 4న – ఇంటికెళ్లి కలిశాను.
జీవితం, రచనలు, చలం, రావిశాస్త్రి, త్రిపుర, వరవరరావు లాంటి వాళ్ళ పరిచయం గురించి అయిదారు గంటలు దాదాపు నాన్ స్టాప్ గా మాట్లాడారు. ప్రపంచ సాహిత్యమూ, సినిమా గురించి సూటిగా, ఘాటుగా, నిర్మమకారంగా చెబుతుంటే ఎంతో బాగా అనిపించింది. కొన్నిసార్లు చేదుగా, నిర్దయగా మాట్లాడినట్లనిపించినా అందులోని వాస్తవాన్ని కాదనలేం. ఆయన కథల్లో, నవలల్లో అలా merciless గా బ్రూటల్ గా చెప్పడాన్ని చూస్తాం. సన్నగా, అతి మామూలుగా (unimpresive గా అని) పొట్టిగా పిట్టలా ఉండే మనిషి.
పిట్ట అని కొట్టిపారేయడానికీ వీల్లేదు. సప్త కవితా సముద్రాలూ దాటి, రెక్కలల్లార్చుతూ సాహిత్య ముల్లోకాల్లోనూ ఎగిరి, మంచి ముత్యాల్లాంటి కథలన్నిటినీ మన కోసం ఏరితెచ్చిన బాధ్యత గల బంగారు పిట్ట యిది. ఊరు తెలంగాణా..
దీని అసలు సిసలు పేరు ‘జ్ఞాని’.
అణకువతోను, మెలకువతోనూ ఉంటారు పార్థసారథి. నా కథలు కలకలం రేపాయనీ, నవలలు సాటి రచయితలనే షాక్ చేశాయనీ, అనువాదాలు చదివి మూర్ఛపోయిన వాళ్ళు ఇంకా ఇప్పటికీ లేవలేకపోయారనీ అస్సలు చెప్పరు. “ఏవో రాశాను. మామూలువీ, అంత బాగా లేనివీ, కొంత చెత్త కూడా రాశాను. అవికూడా ఎంతో బాగున్నాయన్నారు చాలామంది” ఇలా ఉంటుంది ఆయన మాట వరస.
ఎంత లోతుగా అధ్యయనం చేశారో, అంత విస్తృతంగానూ రాశారు. శూన్యం, రంగుల వల, నువ్వూ నేనూ చిన్నారావూ, పరువు, కౌగిలి, మనసులోని చలి, కించిద్విషాదం… లాంటి పది నవలలు రాశారు.
పార్థసారథి కథా సంకలనం పేరు : మిణుగుర్లు. ప్రపంచ ప్రసిద్ధ పుస్తకాలనీ, రచయితలనీ పరిచయం చేస్తూ కొన్ని డజన్ల వ్యాసాలు ప్రభ, నవ్య వార పత్రికల్లో రాశారు. అవన్నీ ఆరు పుస్తకాలుగా వచ్చాయి. జాక్ లండన్ ఐరన్ హీల్ (ఉక్కుపాదం)ని అనువాదం చేశారు. అంతర్జాతీయ కథని తెలుగువాడికి అందించడానికి ఆయన పడిన శ్రమ అంతాఇంతా కాదు. చైనా జానపద కథలు, చెహోవ్ కథలు, షేక్స్పియర్ కథలు, నెల్సన్ మండేలా మెచ్చిన ఆఫ్రికన్ జానపద కథలు, నోబెల్ బహుమతి పొందిన రచయితలు, కవుల పరిచయం…
యిలా 30 పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి.
పార్థసారథి రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగి కావడం వల్లా, ఇద్దరు కొడుకులు అమెరికాలో బాగా సెటిల్ అవడం వల్లా జీవితం సుఖంగా, సాఫీగా సాగిపోతోంది.
ఆయన రచనలన్నీ దిన, వార, మాస పత్రికల్లో రావడం వల్ల, ప్రముఖులు అందరితోనూ పరిచయాలు ఉన్నాయి. ఏబీకె, కొమ్మినేని వాసుదేవరావు, పతంజలి, జగన్నాథశర్మ, చలసాని ప్రసాదరావు, యార్లగడ్డ రాఘవేంద్రరావు.. అని ఆయన చెబుతుంటే, వాళ్లందరూ నాకు బాగా తెలుసు గనక రుచి, ప్రాధాన్యం అర్థమైంది. ఈయన ఉద్యోగం, బ్యాంకు వాళ్ల సర్కిల్ అయినందువల్ల ఈ పరిచయాలు స్నేహాలు గా విరబూయలేదు. పాతకాలం పార్థసారథికి ప్రచారం పట్టకపోవడమూ ఒక కారణం.
మోహనూ, ఈయనా సాయంకాలం పార్టీ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. మోహన్ గురించి… అన్నాను.
మంచి కార్టూనిస్టుగా అందరికీ తెలుసు. ఐనా,
I’m blind to art and deaf to music అన్నాడు కొంచెం కూడా నవ్వకుండా!
మీరు బ్రాహ్మలు కాదు కదా, బీసీలా? అన్నాను. అవునన్నట్టు తల ఊపి, “ప్రత్యామ్నాయ విలువలు లేకపోవడం, మేం ఇలానే ఉంటాం అని బీసీలు చెప్పుకోలేకపోవడం విషాదం. సబాల్టర్న్ అని కబుర్లు చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ని గర్వంగా ఫీలవ్వకపోవడం, బ్రాహ్మణీయతకు ఎంత దగ్గరగా ఉంటే అంత గొప్ప అనుకోవడం, పోనీ డబ్బు వల్ల వచ్చిన సంస్కృతీ కాదు” అన్నారు కొంచెం కటువుగా!
ఏడేళ్ల వయసు నుంచే చదివే అలవాటు. USIS, అఫ్జల్ గంజ్ స్టేట్ లైబ్రరీ, అబిడ్స్ పాత పుస్తకాల షాపులు – పార్థసారథిని ఎత్తుకుని పెంచాయి. 1959లో ‘గోల్కొండ పత్రిక’లో ఆయన తొలి కథ ‘స్వయంకృతాపరాధం’ వచ్చింది. “1959 చాలా ముఖ్యమైన సంవత్సరం. ఆంధ్రపత్రిక దీపావళి సంచికలో సి రామచంద్రరావు గారి ‘వేలుపిళ్లై’ కథ వచ్చింది. దానికి పూర్తి నలుపు మీద తెల్లగీతలతో బాపు వేసిన బొమ్మ, ఆర్ట్ ని అప్రిషియేట్ చేయలేని వాళ్ళనీ ఆకర్షిస్తుంది. ఆ Exotic వాతావరణం, టీ తోటలూ.. నాకైతే తెలీవు” అన్నారు.
బుచ్చిబాబు, చలం, చాలామంది విదేశీ రచయితల పేర్లు చెబుతారు. ఆ పుస్తకాల్ని ముట్టుకోవడమే electrifying గా వుండేది. అప్పుడే సోమర్ సెట్ మామ్ of human bondage చదివాను. సరళంగా రాస్తాడు. ఆల్బర్టో మొరావియా నీ చదివాను. Art కి ఒక magnetism వుంటుంది, అది నిన్ను లోపలికి లాక్కుంటుంది. సెక్స్ అంటే in search of that experiance గురించి రాయగలగాలి. Porno is about the act and experiance.
Anticipation… anxiety… How they create it, అనేది పాయింట్. చలం చేసింది అదే.
D.H. Lawrence అంతే.
1963లో ‘అభిసారిక’ కి కథ పంపించాను. రాంషా ఉత్తరం రాసి, 25 రూపాయలు పంపించారు. నాకో నెల గడిచింది. నా బ్రైటెస్ట్ అండ్ డార్కస్ట్ పీరియడ్ 1963. ఆకలితో గింజుకున్నా ను గానీ పస్తులుండలేదు. తిరువణ్ణామలై వెళ్ళినపుడు చలం నాకు టాగూర్ ‘గీతాంజలి’ ఇచ్చారు. లిరికల్ గా ఉంటుంది. బావుంటుంది. అయితే భక్తి నాకు పడదు. దగ్గర్లోనే వజీర్ రెహ్మాన్ ఉండేవాడు. పుస్తకాలు చదవడమే ఆయన పని. అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆరుగురో, పదిమందో కూడబలుక్కుని చలాన్ని కలవడానికి మద్రాస్ వెళుతుండే వాళ్లు. ‘చలం యాత్రా స్పెషల్’ అనేవాళ్ళం. చలం లాంటి గొప్ప మనుషులు దొరకరు. స్వేచ్ఛ ఎంత అందమైనదైనా – బాధలుంటాయి. పంజరం తలుపు తెరిచి, స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపొమ్మని చిలకకి చెబుతారు. అప్పుడు చిలక అడుగుతుంది, మరి అక్కడ
చువ్వలుంటాయా? అని!”.
*** *** ***
“ఎంత గొప్ప గ్రంథం అయినా షాపులో పోర్నో బుక్ పక్కనే ఉంటుంది. విప్లవం పుస్తకం వల్ల రాదన్నాడు లూషన్. గోర్కి ‘అమ్మ’ నవల వల్ల రష్యాలో విప్లవం వచ్చిందని ఒక కమ్యూనిస్టు నాయకుడు చెప్పడం విన్నాను. ‘అమ్మ’ మీద నిషేధం ఉంది. 1917 నాటికి మహా అయితే అందులో కొన్ని చాప్టర్లు రహస్యంగా పంచి ఉండొచ్చు. రష్యా విప్లవం ‘అమ్మ’ వల్ల రాలేదు. 1917లో లెనిన్ అధికారంలోకి వచ్చాక, గోర్కీ ముందే తెలుసు, అభిమానం గనక ‘అమ్మ’ని పబ్లిష్ చేయించాడు.
*** *** ***
నా ‘రంగులవల’ నవల థీమ్ family, unhappyness అనేది నా permanent theme. ‘నా కోసం నేను రాసుకుంటాను’ అనేవాడు ఎవడైనా ఒకే థీమ్ రాస్తాడు. గొప్పవాళ్ళ రచనల్లో basic theme chasing a mistery.
మార్క్ ట్వయిన్ – chasing childhood,
డి హెచ్ లారెన్స్ chasing man and woman relationship వాళ్ళలా రాశారు. హెమింగ్వే, ఫాక్నర్, మిల్లర్… అందరూ అంతే, రైటరంటే కుటుంబరావు, చలమే. ‘fight your own war’ రాసిన విలియం సరయాన్, writer writes in winter, summer and spring అన్నారు. ఒక పాప నిద్రపోతోంది. నల్లగా ఉందా? తెల్లగానా? అందంగా ఉందా?
అన్నది కాదు ప్రశ్న. ప్రాణంతో ఉందా, లేదా అని కదా… ప్రాణంతో ఉంది, అది లేనపుడు మీరెన్ని (రచనకి) షోకులు చేసినా అనవసరం.
*** *** ***
విప్లవమూ, కమ్యూనిజం అంటే ఎనార్మస్ ఫాసినేషన్ వుండేది. Hope ఇప్పటికీ వుంది, but you should see the real life. నాటి వేదరుషులకీ, మనకీ ఎంత దూరం ఉందో, కారల్ మార్క్స్ తోనూ అంతే దూరం ఉంది. వందేళ్ల తర్వాత ఎలా జడ్జ్ చేయడం?
ఐజక్ బాచెల్ గొప్ప రచయిత. కాల్చి చంపేశారు. ట్రాట్ స్కీ అమెరికాలో anti stalin clubs ఆర్గనైజ్ చేశాడు. ఏం చేయాలి మరి ట్రాట్ స్కీని? సొంత కొడుకు ప్రాణం పోతుందన్నా, firm గా ఉన్న స్టాలిన్ ని ఎలా తప్పుపట్టగలం? ఇప్పటి చరిత్రే ఇంత కన్ఫ్యూజింగ్ గా ఉన్నపుడు perogatives ఏంటో ఎలా చెప్పగలం?
మార్క్స్ కి మార్కులు వేయడానికి మనవెవరం? జర్మన్ ఐడియాలజీ లో మొదటి పేజీ చదివినా చాలు. పాతికేళ్ళ అ మార్క్స్ రాసిన paris manuscripts చదివినా చాలు!
ఇసబెల్లా అలెండీ రాసిన ‘డాలర్ ఆఫ్ ఫార్చ్యూన్’ని ‘అపరాజిత’ (ఆడదాని సాహసం) అని తర్జుమా చేశాను. ‘విపుల’లో వచ్చింది. exploring life …
శ్రీశ్రీ అనంతంలో రాసిందానికే ఇప్పటికీ గింజుకుంటున్నారు. వాళ్లు రాసినవి ఏం కథలు! ఎంత నిజాయితీ!
ఎనీ రిగ్రెట్స్? అని అడిగాను.
‘లేవు. ఏమీ లేవు. ఇంకాముందే మార్క్స్ ని చదువు కోవాల్సింది’ అన్నారు పార్థసారథి.
మీ magnum opus?
‘శూన్యం’ మంచి నవల… కావచ్చుననే అనుకుంటున్నా. అందరూ అన్నారు చాలా బావుందని!
శ్రీశ్రీ, శివసాగర్, అజంతా కవిత్వం నచ్చుతుంది. మహాప్రస్థానాన్ని చలం యోగ్యతాపత్రంతో సహా రిసైట్ చేసేవాణ్ణి. చలం తర్వాత, నాకు తెలిసి… లేరండీ. ఆయన రాశాడు. మరొకడు రాయలేక పోయాడు. రైటింగ్… పార్ట్ ఆఫ్ యువర్ కేరక్టర్ కావాలి. ఆ పేషన్ లేకపోతే రాయలేరు.
In india everything has become a taboo. తాగని వాడు తాగేవాడికన్నా గొప్ప. మాంసం తిననివాడు తినేవాడికన్నా మహానుభావుడు.
ఇవీ మన పారామీటర్స్! ఇక మజ్జిగ తాగి బతకాలి.
మన ఠాగూర్, జైనేంద్రకుమార్, ప్రేమ్ చంద్, మాస్తి వెంకటేశ అయ్యంగార్, మహాశ్వేతాదేవి బాగా రాశారు. తెలుగులో నించి మాత్రం ఇతర భాషల్లోకి పోవడం లేదు. సార్వజనీనత, సార్వకాలీనత లేకపోవడమే కారణం.
నేను కొన్ని రాయాలనుకుంటున్నాను. ‘డాన్ కియోటి’ తర్జుమా చేయాలి. తెలుగులో చేసేవాడు లేడు. అది తెలుగులో తప్పక రావాల్సిన పుస్తకం. నండూరి రామ్మోహనరావు Abridge చేశారు. మన సాహిత్యం అంతా యండమూరి వీరేంద్రనాథ్ చుట్టే తిరుగుతూ ఉంటుంది.
Solidness in western books
Shallowness in our books … అని ప్రేమగా విసుక్కున్నారు పార్థసారథి.
*** *** ***
ప్రపంచ సినిమాకి విజువల్ వ్యాకరణం రాసిన రష్యన్ దర్శకుడు సెర్గీ ఐజెన్ స్టీన్ గురించి చెప్పారు.
Battle ship potemkin, october అనే all time great films తీసిన ఐజెన్ స్టీన్ కి హాలీవుడ్ మహా సంస్థ MGM, ఒక ఆఫర్ ఇచ్చింది. మెక్సికో మీద ఒక సినిమా మా తీయమని కోరింది. చార్లీ చాప్లిన్ మాట్లాడాడు. ఐజెన్ స్టీన్, చాప్లిన్ మెక్సికో అంతా తిరిగి ఫోటోలు తీయించారు. సినిమా పేరు VIVA LA MEXICO. డబ్బు మంచినీళ్లలా ఖర్చయింది. 60 గంటల ఫుటేజీ వచ్చింది అప్పటికే. ఐజెన్ స్టీన్ ప్రవర్తన MGM కి చికాకు తెప్పించింది. ఇంతలో, వెంటనే బయల్దేరి రమ్మని స్టాలిన్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఐజెన్ స్టీన్ మాస్కో వెళ్ళిపోయాడు.
వాళ్లే ఫుటేజీని ఎడిట్ చేసి, అసంపూర్ణమైన వివా లా మెక్సికో రిలీజ్ చేశారు. సినిమా ఆడలేదు. అసలు విషయం : ఐజెన్ స్టీన్ ఏమయ్యాడో, తర్వాత ఎవరికీ తెలీదు. “అప్పట్లో ఏమైనా జరిగుండొచ్చు” అన్నారు పార్థసారథి.
Bury my heart at wounded knee
అమెరికా అనే దేశ నిర్మాణం కోసం అక్కడి మూలవాసులైన రెడ్ ఇండియన్లను కొన్ని శతాబ్దాల పాటు వెన్నాడి, వేటాడి దారుణంగా హతమార్చారు. ఆ మహా మానవ విషాదాన్ని అమెరికన్ రచయిత, చరిత్రకారుడు డీ అలెగ్జాండర్ బ్రౌన్ (1908 – 2002) పుస్తకంగా రాశారు. 1970లో అచ్చయిన wounded knee ఇప్పటికీ బెస్ట్ సెల్లర్ గానే ఉంది. ఈ నవలని 17 భాషల్లోకి అనువదించారు. 2007లో HBO ఫిలిమ్స్ వాళ్ళు దీన్ని సినిమాగా తీశారు.
ముక్తవరం పార్థసారథి దీన్ని తెలుగు చేశారు.
“ఇది సరదాగా చదువుకోదగిన పుస్తకం కాదు. ‘సంస్కారవంతులైన’ తెల్లవాళ్ళు – ఒక జాతిని వందల, వేల తెగలను నామరూపాల్లేకుండా నాశనం చేసిన విషాద గాథ. ఈ మూడు వందల పేజీల పుస్తకాన్ని ‘ప్రజాశక్తి’ బుక్ హౌజ్ ప్రచురించింది.
కొన్ని వందల అంతర్జాతీయ కథల్నీ, ఐరన్ హీల్, వూండెడ్ నీ లాంటి అద్భుతమైన నవలల్నీ తెలుగులోకి తర్జుమా చేయగలగడం ఆషామాషీ వ్యవహారం కాదు. నిరంతర అధ్యయనమూ, నాన్ స్టాప్ అనువాదమూ, పుస్తక ప్రచురణ –
ఒక్క చేత్తో సాధించగలిగారు పార్థసారథి.
మన రచయితలకి long distance running కుదరదని అంటారు. ఒంటరి రాత్రులూ, ఒంటరి పగళ్ళూ… అవిశ్రాంతంగా పరిశ్రమించి, పరితపించి, పరుగు ఆపడానికి అంగీకరించని ఒక బ్రిలియంట్ రైటర్, ఒక అపురూపమైన అనువాదకుడు, ఒక సాటిలేని తెలుగు సాహిత్య సేవకుడు మన ముక్తవరం పార్థసారథి.
79 ఏళ్ల ఈ మహానుభావుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు… కాస్త లేటుగా…
Punch of Patanjali
పార్థసారథి గారి ‘పరువు’ నవలకి ప్రసిద్ధ రచయిత కె.ఎన్.వై.పతంజలి రాసిన ముందుమాటలో –
“ఇదొక చిన్న కన్నీటి చుక్క. అది చాలు మనల్ని ముంచెయ్యడానికి. జీవితానికీ పాఠకునికీ మధ్య, రచయిత పనికిమాలిన తెరలాగా ఉండకూడదని ఎరిగిన రచయితలు గొప్పవాళ్ళ కోవలోకి వస్తారు. అట్టి గొప్పదనం పార్థసారథికి కూడా ఉంది”అని రాశారు. TADI PRAKASH 97045 41559
Share this Article