ఓ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గున్న ఏనుగులా ఉన్న పిల్లాడిని చూసి వీడెవడో మినీ మహానాడులా ఉన్నాడంటాడు . రిపోర్టర్ గా ఎన్నో మహానాడులు , మినీ మహానాడులు కవర్ చేసిన నాకు ఈ డైలాగ్ చాలా బాగా నచ్చింది . ఎన్ని సార్లు విన్నా నవ్వు వస్తుంది . మహా అంటే భారీ . మినీ అంటే చిన్నది . మినీ మహానాడు ఏంటో ? చిన్న పెద్ద నాడు అన్నట్టు .
ఆంధ్రభూమిలో ఎడిటర్ ఇంట్లో పెళ్లి అంటే అచ్చం మహానాడు తలపించేది . మహానాడులా వేలమంది కాకపోయినా వందల మందికి మహానాడు స్థాయిలోనే అట్టహాసంగా ఉండేది . మినీ మహానాడును తలపించేది . కళ్ళకు కనిపించేది దగ్గరగా చూసినప్పుడు విషాదంగా కనిపించింది కొన్ని రోజులు గడిచిన తరువాత ( అంటే దూరంగా )… అది గుర్తు చేసుకుంటే మన మీద మనకే నవ్వు వస్తుంది అంటారు .
ఎడిటర్ ఇంట్లో మినీ మహానాడప్పుడు కంటికి నిద్ర లేకుండా కష్టపడిన మిత్రులు ఇప్పుడు పడీ పడీ నవ్వుతూ ఆ రోజులు గుర్తు చేసుకున్నారు . రాజకీయ నాయకులను మించి నీతులు చెప్పిన , ఇంకా చెబుతున్న విశ్రాంత ఎడిటర్లు తాము ఎడిటర్లుగా ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో పెళ్ళికి కూడా అదేదో సీతారాముల కళ్యాణం, ఊళ్ళో వాళ్లంతా తలో బాధ్యత తీసుకోవాలి అన్నట్టు, పత్రికలో పని చేసే వారందరికీ బాధ్యతలు అప్పగించడాన్ని తమ హోదాను దుర్వినియోగం చేయడం అనుకోలేదు . అదేదో దైవ కార్యంలో మీ అందరికీ భాగస్వామ్యం కల్పిస్తున్నాను , మీ జీవితం ధన్యమైందిపో అన్నట్టు వ్యవహరించారు . ఈ దైవ కార్యంలో నేను ఎలాంటి బాధ్యత చేపట్టలేదు కానీ అందరికీ అప్పగించిన బాధ్యతలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎంజాయ్ చేశాను . అచ్చం టీడీపీ మహానాడు ఏర్పాట్లను తలపిస్తోంది అనుకున్నాను .
Ads
****
డక్కన్ క్రానికల్ , ఆంధ్రభూమి ( 1938లో డక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రిక , అదే సమయంలో తెలంగాణ పేరుతో తెలుగు పత్రిక పెట్టారు . నిజాంకు భయపడి తెలంగాణ పత్రిక మూసివేసి 1960లో ఆంధ్రభూమి తెచ్చారు . ) పత్రికలు పెట్టిన మొదలియార్ అంతగా ప్రయోజనం పొందింది లేదు . రోజూ నిజాం రాజుకు భయపడుతూ పత్రిక నడిపారు . తరువాత ఇద్దరు కొడుకులు కీచులాడుకొని టి.చంద్రశేఖర్ రెడ్డికి అమ్మేశారు . చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు డిసి లోన్ ఫ్రాడ్ కేసులో జైలులో ఉన్నారు . ఎనిమిదిన్నర దశాబ్దాల డీసీ చరిత్రలో అత్యధికంగా ఆర్థికంగా , మానసికంగా , అన్ని రకాలుగా ప్రయోజనం పొందిన వారు ఎవరైనా ఉన్నారా ? అంటే 23 సంవత్సరాల పాటు ఎడిటర్ గా ఉండి పత్రిక పెట్టిన వారికన్నా , కొన్న వారికన్నా ఎక్కువ ప్రయోజనం పొందింది, బాధ్యత లేని అధికారం అనుభవించింది ఎడిటర్ . ( బాధ్యత లేని అధికారం అనే మాట డీసీ మిత్రుడు ఇచ్చిన కితాబు ) ఆర్ధిక ప్రయోజనాలు ఒక వైపు ఐతే చివరకు యాజమాన్యం సైతం ఉపయోగించుకోని విధంగా ఇంట్లో పెళ్ళికి ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకున్నారు .
*********
టీడీపీని విధానాల పరంగా ఎంతైనా విమర్శించవచ్చు , పాలనను తప్పు పట్టవచ్చు కానీ ఆ పార్టీ నిర్వహించే మహానాడు ఏర్పాట్లను శత్రువు సైతం మెచ్చుకొని తీరుతాడు . అంత అద్భుతంగా ఉంటాయి . మంత్రి వర్గంలో ఎన్ని శాఖలు ఉంటాయో , అదే రీతిలో మహానాడుకు కమిటీలు ఉంటాయి . అంటే నగరాన్ని అలంకరించే కమిటీ మొదలు కొని , వాహనాల కమిటీ, భోజన కమిటీ , వసతి కమిటీ ఇలా అన్ని పనులకు కమిటీలు ఉంటాయి . అంటే ఎండా కాలం కాబట్టి ఐదు నిమిషాలకోసారి మజ్జిగ , మంచి నీళ్లు అందించే కమిటీ కూడా ఉంటుంది . మంత్రి పదవి అప్పగిస్తే ఎలా మురిసిపోయి పని చేస్తారో ఈ కమిటీల్లో కూడా అలా పని చేసేవారు . ఆతిధ్యంలో ఎక్కడా లోటు రాదు . వేల మంది వచ్చినా భోజనం , వసతి వంటి సౌకర్యాలకు లోటు ఉండేది కాదు .
2004లో మహానాడు భారీ సభ జరిపి ప్రపంచ చరిత్రలో ఇంత భారీ ఏర్పాట్లు , సభ జరగలేదు . దీని బ్లూ బుక్ తరయారు చేస్తున్నాం అని సభ తరువాత బాబు ప్రకటించారు . ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది, అది వేరే విషయం . జనరంజకంగా ఎలా పాలించాలి , అద్భుతంగా మహానాడు ఎలా నిర్వహించాలి అనేవి రెండూ వేరు వేరు విషయాలు .. అచ్చం ఎడిటర్ కూడా అంతే.. పత్రికను ఎలా నడపాలి అనే దాని కన్నా ఎలా సొంతంగా ఉపయోగించుకోవాలి అనే దానికి ప్రాధాన్యత ఇచ్చారు .
*******
ఎడిటర్ ఇంట్లో పెళ్లి అంటే ఆఫీస్ లో నెల రోజులు అదే హడావుడి . కొత్త బంధువులు వచ్చి క్యాబిన్ లో కూర్చుంటే, అకారణంగా ఎవరైనా రిపోర్టర్ ను పిలిచి, ఏమయ్యా గాడిదలను కాస్తున్నావా ? అని తిట్లు . అమ్మో, ఈయన చాలా పవర్ ఫుల్ అని బంధువులు ఆశ్చర్య పోవడం . నెల రోజులు ఇదో వినోదంగా సాగేది . కాంగ్రెస్ అగ్రనాయకులంతా పెళ్ళికి వచ్చేట్టు చేయడం కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ బాధ్యత, నన్ను టీడీపీ బాస్ వద్దకు తీసుకువెళ్లడం అంటే పిల్లిని సంకలో పెట్టుకొని వెళ్లడమే . పెళ్ళికి రావాలి అనుకున్న బాబు కూడా నా రాతలు – వాతలు గుర్తుకువచ్చి రాడు అని తెలుసు, అందుకే ఆ బాధ్యత మరో రిపోర్టర్ కు అప్పగించారు .
విద్యా సంస్థలతో సంబంధాలు ఉండే రిపోర్టర్ విద్యా సంస్థల బస్సులు ఉచితంగా తీసుకురావాలి . ట్రాన్స్ కో వార్తల రిపోర్టర్ ట్రాన్స్ కో కార్లు , ఇలా ప్రతివారు తమ తమ బీట్ల నుంచి లభించే సౌకర్యాలు కల్పించాలి . కల్పించారు . స్ట్రింగర్స్ కు వచ్చే పారితోషకం అంతంత మాత్రమే . వారు సేవలు అందించాలి , ఆ సేవలకు సొంత డబ్బు చెల్లించాలి . చెల్లించారు . వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ బీట్ చూసిన రిపోర్టర్ కాస్త చలాకీగా ఉండేవాడు . పరిచయాలు ఎక్కువ .దీనితో ఎక్కువ భారం పడింది.
వైయస్సార్ తో పాటు మంత్రులు కూడా ఆ రిపోర్టర్ పరిచయం వల్ల వచ్చి పెళ్ళిలో అతన్నే పలకరిస్తుండడంతో , ఇదేదో తన ఉద్యోగానికి ఎసరు వచ్చేట్టుగా ఉంది అని భయపడి, అతను కాస్త దూరం వెళ్లి నిలబడ్డాడు. మా సిస్టర్స్ పెళ్లిళ్లు చేశాను , కూతురు పెళ్లి చేశాను కానీ ఎప్పుడూ ఇంత కష్టపడలేదు , పంక్షన్ హాలులో పడుకోలేదు . ఎడిటర్ కోసం ఆ పని చేయాల్సి వచ్చింది అని అప్పుడు బాధగా , ఇప్పుడు జోకులేస్తూ జ్ఞాపకాలను పంచుకున్నాడు ఓ మిత్రుడు .
ఒకాయన ఓవైవు రిపోర్టర్ గా ఉండి పవర్ ప్రాజెక్ట్ , తరువాత ఆ పేపరే కొనేసి, ఛానల్ కూడా పెట్టి ఎక్కడికో వెళ్లిపోతే, మనవాడు ఈ ముష్టి పనులు చేసి, చివరకు చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది . చేస్తే ఆయనలా చేయాలి. పవర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవడానికి ఎంత గొప్పగా ఉంటుంది అని జోకులేసుకునే వాళ్ళం . తెలంగాణ ఏర్పడిన తరువాత ఇలాంటి వైభోగానికి బ్రేక్ పడింది .
***************
యజమాని తన ఇంట్లో పెళ్లి జరిగితే కనీసం ఫలానా వారికి ఇన్విటేషన్ ఇచ్చిరా అనే చిన్న పని కూడా ఎవ్వరికీ చెప్ప లేదు . కానీ తన ఉద్యోగి ఆఫీస్ ను వాడుకున్నా పట్టించుకోక పోవడం అనేది ఆశ్చర్యమే . ఈ నిర్లక్ష్యవైఖరే యజమానిని జైలుకు పంపితే, ఉద్యోగి మాత్రం తరతరాలకు సరిపోయేట్టు సంపాదించుకునేట్టు చేసింది … – బుద్దా మురళి .
Share this Article