Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అస్సాం కొండల్లోంచి గుండెల్లోకి జాలువారిన సంగీత జలపాతం…

July 12, 2023 by M S R

Artist Mohan’s love letter to Begum Parveen sultana… ఈ అస్సాం హంసధ్వని పేరు బేగం పర్వీన్ సుల్తానా. పటియాలా ఘరానా క్వీన్ పద్మభూషణ్ పర్వీన్ పుట్టినరోజు నేడు. అస్సాం కొండల్లోంచి గుండెల్లోకి జాలువారే ఈ హిందూస్తానీ సంగీత జలపాతానికి జన్మదిన శుభాకాంక్షలు. 1980లో విడుదలైన ఖుద్రత్ సినిమాలో “ హమేతుమ్ సే ప్యార్ కితనా” పాట గుర్తుందా? ఈ దేశాన్ని అంతటినీ ఒక ప్రేమ పూలతోటగా మార్చిన ఆ పాట పర్వీన్ పాడిందే!

33 సంవత్సరాల క్రితం… మోహన్ రాసిన ఈ వ్యాసం 1990 మే 4వ తేదీన ఉదయం దినపత్రిక ఆదివారం మ్యాగజైన్ లో వచ్చింది…. Taadi Prakash

………………………………..

Ads

పాట పలకరించింది

పర్వీన్ సుల్తానా కావాలంటే పదమూడో ఎక్కం అప్పజెప్పాలనీ, రాచ్చసుడితో ఫైటింగ్ చేయాల్సొస్తుందనీ భయం. తీరా ఫోన్ చేస్తే అటు నుంచి తీగలాటి గొంతు, ఇటు గుండెల్లో గ్రెనేడ్ పేలిన చప్పుడు. ‘సాయంత్రం ఆరింటికి రండి. అరగంట మీతో మాట్లాడగలను. తర్వాత పనుంది వెళ్లాలి’ అని ఫోన్ కచేరీ ముగించింది.

మృణాళినీ, శివాజీ, రాధాకృష్ణా వస్తామంటూ చంకలెగరేశారు. వీళ్ళు ముగ్గురూ కథలూ నవలలూ రాస్తారు. పాటలు వింటారు, పాడతారు కూడా. ఆ మధ్య అందరం ఒ.పి.నయ్యర్ని ఇంటర్వ్యూ చేశాం. అప్పుడు మృణాళిని సంగీత జ్ఞానం చూసి నయ్యర్ కిందపడ్డాడు. ఇప్పటికీ బొంబాయి నుండి ఈవిడకి ప్రేమలేఖలు రాస్తున్నాడు. రాధాకృష్ణగారయితే కర్ణాటక సంగీతం చక్కగా వినిపిస్తాడు. ఇటు అన్నమాచార్య, అటు బడేగులాం అలీ ఖాన్ మా తాతయ్యలంటాడు శివాజీ.

హడావుడిగా పర్వీన్ కలర్ పోర్ట్రైట్ వేశాను. అలాటి గొప్ప ఆర్టిస్టు దగ్గరకి కాస్త గ్లామరస్ గా స్ప్రే కొట్టుకు వెల్దామంటే కుదిరింది కాదు. ఆరింటి వరకూ రాళ్ళు కొట్టి పన్జేసి, జిడ్డు మొహాల్తో బయల్దేరాం. మా ఫొటోగ్రాఫర్ రమేష్ తో సహా అందరం గడ్డాలు మీసాలూ పెంచి (మృణాళిని మినహా) విలన్ డెన్ లో ‘ఎస్ బాస్’ అనే ఎక్స్‌ట్రాల్లాగా ఉన్నాం..

కమిన్ అంటూ తలుపు తీసింది ఆవిడ. అరోరా బోరియాలిస్ గా జిగేల్మంది. మా బ్రహ్మజెముడు గడ్డాలు గోక్కుంటూ కూచున్నాం. టీ కాఫీ మర్యాదల గురించి మాట్లాడుతూంటే వింటున్నట్లు నటిస్తూ… కళ్ళప్పగించి చూస్తున్నాం. ఆవిడ మార్బుల్ మేజిక్, ఫ్లోరెన్స్ శివార్ల నుంచి తవ్వితీసిన పాలరాయి ఒళ్ళు, పైన నల్లటి సల్వార్ కమీజ్ మీద తెల్ల తీగల డిజైన్. ముందుకి దూసుకొచ్చే ముక్కు, వెనక్కి అలల్లా కదిలి తెరల్లో కరిగిపోయే జుట్టు. భగవంతుడు ఈవిణ్ణి చెక్కడానికి నానా కష్టాలూ పడి ఉండాలి.

ఈవిడ ఎంతో మంది కుర్రసన్నాసుల్ని అష్టకష్టాలూ పెట్టి ఉండాలి.

మా ప్రశ్నలు ఆమె ఆన్సర్లు, ఈజీగా, మామూలుగా, ఆడవేషాలు లేకుండా, సూపర్ స్టార్ టాన్ ట్రమ్స్ కాకుండా, సాదా మనిషిలాగే…

అచ్చం ఆర్టిస్టు అన్నట్టే చెప్తోంది.

మాది అస్సాం. మా నాన్న జమీందారు. తాతలు కాబూల్ నుంచి వచ్చారు. నాన్నగారికి సంగీతం ప్రాణం. నాలుగేళ్ళ వయసు నుండే పాటలు మొదలెట్టాను. నాన్నగారే ట్రైనింగ్ ఇచ్చారు.

మరి ఆయన పాతకాలం వాడు గదా! మోడరన్ సినిమా సంగీతం, వెస్ట్రన్ కల్చర్ ప్రభావం మీమీద పడలేదా? అంటే

“ఇంట్లో సినిమా పత్రికలుగానీ, ఆ సంగీతం గానీ ఉంటానికి వీల్లేదు. వేరే బయటి ప్రభావం లేకుండా చూశారు నాన్న. పన్నెండేళ్ళ వయసుకే నా ట్రైనింగ్ పూర్తయింది. అప్పుడే కలకత్తాలో నా కచేరీ సక్సెస్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పాడుతూనే ఉన్నా”.

గజల్స్ పేరుతో వచ్చే నకిలీపాటల్ని తిట్టింది. హిందుస్తానీ సంగీతంలో రాజకీయాలూ, డబ్బుగల ప్రతిభలేని వారి ప్రవేశాన్ని తిట్టింది. కర్ణాటక సంగీతంలో కొత్త వారికి తగిన సాధన లేదని కంప్లెయింట్ చేసింది.

ఏఏదేశాలలో తిరిగారూ? అంటే ఏమో ఏఏ దేశాల్లో తిరగలేదో చెప్పగలను అంది.

ఎన్ని కచేరీలిచ్చారంటే.. ఎపాలజిటిక్ గా నవ్వి

అదీ గుర్తులేదంది.

నా రంగుల బొమ్మ తీసిచ్చా.

ముచ్చటగా బొమ్మనిండా ఆ ముత్యాలొలికిస్తూ నవ్వింది. సంతకం చేస్తుంటే మా రమేష్ కెమెరా మెరిసింది.

గలగలా, గడగడా మాట్లాడుతుంది గదా… మనల్ని బాగా ప్రేమించినట్టుందని గాట్టి అనుమానమొచ్చేసింది. ఓ అస్సామీ జానపదం పాడరాదూ అంటూ శివాజీ నోరుజారేశాడు.

నా పాట రేటు పాతికవేలురా పాకీవాడులారా

గెటౌట్ అంటుందని నేను గడగడలాడిపోయా.

sultana(1990: మోహన్ డ్రాయింగ్ మీద సంతకం చేస్తున్న పర్వీన్)

ఒక్క క్షణం…పాజ్ లో పర్వీన్ పాట మొదలయింది.

చల్లని గదిలో గాలి గడ్డకట్టింది. పాలరాతి చేతుల్ని కుర్చీమీద చాచి డబుల్ చిన్ పైకెత్తి నవ్వుతూ ఆవిడ పాడుతోంది. వెనక పాలనురుగు తెరలమీద నీలిపూలలోకి పర్వీన్ జుత్తు, గొంతూ పోటీ పడి కలిసి పోతున్నాయి. ఇలా చూస్తూ పాటవింటే లాభంలేదని కళ్ళు మూసుకుంటే… చుట్టూ అస్సాం టీ తోటలూ, కొండలూ, వెదురుపొదలూ మొలుచుకొచ్చాయి. మధ్యలో సన్నని తీగలాటి, జలపాతం లాటి, గొంతులాటి, వెలుగులాటి రొద. ఆ లోయల్లోంచీ, కొండల్లోంచీ వేగంగా, మంద్రంగా మెలికలుచుడుతూ వచ్చి గదినిండా, మా నిండా కమ్ముకుంది.

ట్రాజడీ….పాట అయిపోయింది. నిద్రలేచాం. శివాజీ ఆ మైకంలో కుర్చీ దగ్గర కెళ్ళి ఆవిడ పాదాలకి నమస్కారం చేశాడు. పొట్టికాళ్ళు వెనక్కు లాక్కుంది అంతలావు ఆర్టిస్టూ ఆనందంగా సిగ్గుపడింది.

మళ్ళీ కబుర్లు… చాలా కబుర్లు, టీలు. ఆవిడ అరగంట అందిగదా గంటన్నర అయిపోయింది. ఎవ్వరం కదలం…ఆవిడా వదలదు.

ఇప్పటికీ నేను రోజుకి ఆరుగంటలు సాధన చేస్తాను అని పర్వీన్ చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఇంకా చాలా గంటలు సాధన చేసేదట. ఆవిడ అందంగా ఉందా లేదా మనకనవసరం. గొప్ప ఆర్టిస్టు చిన్నప్పటినుండీ ఉన్న డబ్బూ దస్కాన్ని వెలగబెడుతూ ఊరికే జులాయిగా బతికేసినా బెంగలేదు. కానీ గంటల తరబడి భీకరమైన సాధనతో, సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకుంది. బతుకులో సంపదలిచ్చే ఆనందానికి చాలా వరకూ దూరంగానే ఉంది. కళతో పుట్టి శ్రమించి కళతోనే చావడానికి సిద్ధంగా ఉంది.

మరి మీరు? నేను?

మీరు రచయిత, కవి, చిత్రకారుడు, గాయకుడు, డాన్సర్… ఏదైనా కండి. సాధన ఎంత చేస్తున్నారు? రోజు వారి బతుక్కి ఎంతకాలం కేటాయిస్తున్నారు. అనార్టిస్టుల (కళాకారులు కానివారు) సాదారొటీన్కి మీ రొటీన్కి తేడా ఏమన్నా ఉందా? ఉద్యోగాలూ, జీతాలూ, ఇల్లూ, తిండీ తిప్పలూ అన్నీ మిమ్మల్ని తినకముందే మేల్కొండి, ప్రాక్టీస్ చేయండి, ఆర్టిస్టు కావాలనుకుంటే!……… మోహన్ ఆర్టిస్ట్, 4.5.1990

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions