Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చప్పట్లు ఓ మత్తు… జనంలోకి ఏ సంకేతాలు వెళ్తున్నాయనే సోయి అవసరం…

July 13, 2023 by M S R

తానా సభల్లో ఆటా వర్గీయులకు చప్పట్లు… స్టార్ హోటల్ లో, అమెరికాలో చప్పట్ల మత్తు … జర్నలిస్ట్ జ్ఞాపకాలు –

—————————————-

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్నప్పుడు తెలంగాణను వ్యతిరేకించడంతో పాటు వై యస్ రాజశేఖర్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేసే నాగం జనార్దన్ రెడ్డి లాంటి నాయకులకు టిడిపిలో విశేష గౌరవం లభించేది . తానాకు నాయకత్వం వహించిన వారిలో ఎక్కువ మంది టీడీపీ అభిమానులు , వీరిలో కొందరు ఆంధ్రాలో టీడీపీ టికెట్ల కోసం గట్టిగా ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు . వీరిలో ఎక్కువ మంది సమైక్యాంధ్ర కోరుకున్న వారు . తానా సభలకు తరుచుగా టీడీపీ మంత్రులను , నాయకులను పిలిచేవారు .

Ads

ఓసారి ఎన్టీఆర్ భవన్ లో కింద ఆవరణలో నాగం జనార్ధన రెడ్డి తో మాట్లాడుతుంటే .. పై అంతస్తు నుంచి టీడీపీ శాసన సభ్యులు పయ్యావుల కేశవ్ నాగంను చూసి .. అన్న నడిచొస్తే మాస్ .. మమ్మా మాస్ అంటూ పాట పాడి అభినందించారు . నాగం మురిసిపోయి … తానా సభకు వెళ్ళాను , నా ఉపన్యాసానికి చప్పట్లతో హాలు మారుమ్రోగిపోయింది తెలుసా . నేను మాట్లాడిన ప్రతి మాటకు చప్పట్లు కొట్టారు అంటూ నాగం చెబుతుంటే .. తానా సభలో మీకు చప్పట్లు సహజమే , ఇదే ఉపన్యాసం ఆటా సభల్లో ఇచ్చి చూడండి తెలుస్తుంది అని అనగానే నవ్వుతూనే ఒక్కసారిగా గాలి తీసినట్టుగా ఉండి పోయారు .
తానాలో ఎక్కువ మంది టీడీపీ అనుకూలం , ఆటాలో ఎక్కువ మంది కాంగ్రెస్ అనుకూలం .. తానానే ప్రపంచం అనుకున్నట్టున్నారు నాగం . తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర వాళ్ళు నాగంకు ప్రాధాన్యత ఇచ్చినా , తెలంగాణ ఏర్పడిన తరువాత తానా వాళ్ళు నాగంను పట్టించుకోలేదు . సొంత సంస్థ , టీడీపీ , కాంగ్రెస్ , బిజెపిల మధ్య తిరిగి …. ఒకప్పుడు బాబు తరువాత తెలంగాణకు సంబంధించి నంబర్ టూ నాయకుడు అని ప్రచారం పొందిన నాగం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెంటనే చెప్పలేని పరిస్థితి . తన కార్యక్షేత్రం తానా కాదు , తానా పార్టీ కాదు .. తెలంగాణనే తన కార్య క్షేత్రం అని ముందే గుర్తిస్తే ఇలా ఉండేది కాదేమో …
********
2004 ఎన్నికలకు ముందు వైస్రాయ్ హోటల్ లో ఏదో సమావేశం . స్టార్ హోటల్ స్థాయి వారే ఆ సమావేశానికి వచ్చారు . ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉపన్యాసం . ఆయన మీడియాను చూస్తూ ఉచిత విద్యుత్ సాధ్యం కాదు . నేను అదే చెబుతుంటే మీడియా వారికి అర్థం కావడం లేదు . మీరంతా గట్టిగా చప్పట్లు కొట్టి మీడియా వారికి అర్థం అయ్యేట్టు చెప్పండి అని చంద్రబాబు చెప్పగానే హాజరైన వారు చప్పట్లతో హోరెత్తించారు . బాబు గారు ఎంత సంతోష పడ్డారో …. తాను చేస్తున్నది అంతా మంచే అని మీడియా వారే అర్థం చేసుకోవడం లేదు అనేది చంద్రబాబు ఉపన్యాస సారాంశం . చప్పట్లతో మీడియాకు జ్ఞానం ప్రసాదించండి అన్నట్టుగా ఆయన పిలుపు . వైస్ రాయ్ హోటల్ సమావేశ మందిరంలో ఆ పిలుపు బాగా పని చేసింది . వచ్చిన వారంతా మీడియా వైపు చూస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు చెప్పిన దానికి మద్దతు పలికారు .
*****
తానా సభలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన ఉపన్యాసంలో ఒక ఎన్ఆర్ఐ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మీద అడిగిన ప్రశ్నకు ‘‘ఒక ఎకరానికి గంట సమయం విద్యుత్ సరిపోతుంది . మూడు ఎకరాలకు మూడు గంటలు సరిపోతుంది’’ అని చెప్పారు . ఈ వీడియో అందరూ విన్నదే నేను కొత్తగా చెప్పనవసరం లేదు . కానీ అక్కడ గమనించాల్సిన విషయం రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలు అనగానే అందరూ చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు . అసలే అమెరికా , తానా సభ , వారంతా యువకులు … ఉచిత విద్యుత్ అంటే వారికి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది ఆ చప్పట్లతో తెలిసిపోతుంది .
********
1996-97 ప్రాంతంలో వారాసిగూడలో ఉండేవాళ్ళం . సెల్ ఫోన్ లేదు ల్యాండ్ లైన్ ఫోన్ . మనల్ని ఉత్తమ జంటగా ఎంపిక చేశారు . హోటల్ కు వచ్చి బహుమతి తీసుకొమ్మన్నారు అని వార్త . అప్పుడప్పుడే ఇలాంటి మోసాలకు శ్రీకారం చుట్టిన కాలం అది . వాడి బొంద అదేదో బోగస్ అయి ఉంటుంది , జర్నలిస్ట్ అనే వాడు ఉత్తమ భర్త ఏమిటీ ? ఉదయం బయటకు వెళ్ళాడు అంటే అర్ధరాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు ఉత్తమ భర్తనా ? .. ఇలాంటివి నమ్మొద్దు అని చెబితే .. ఒకసారి వెళ్లి వద్దాం, మోసం ఐతే తెలుస్తుంది కదా ? అంటే సరే అని వెళ్ళాం .
ఇది బోగస్ నేను ముందే చెప్పాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు . కానీ చాలా మంది తమకేదో గొప్ప అవార్డు వచ్చినట్టు కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చారు . రియల్ ఎస్టేట్ వ్యాపారాలు , ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రకాల వాళ్ళు .. వాడి బోగస్ స్కీమ్ అంటగట్టడానికి ఒక్కో టేబుల్ లో ఒకడు వివరాలు చెబుతున్నాడు . ఓ కుర్రాడు నాకు అలా చెబుతుంటే , . ఇదంతా బోగస్ నాకు తెలుసు , ఇక్కడ పని చేసే బదులు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా చేరు మంచి సంపాదన ఉంటుంది అని ఆ కుర్రాడికి సలహా ఇచ్చాను . ఎవరైనా వాడి స్కీములో చేరగానే అందరితో చప్పట్లు కొట్టించేవారు . సకుటుంబ సపరివారంగా వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యుల ముందు పరువు పోతుంది అని స్కీమ్ లో చేరడం చూశా . నిర్వాహకుడిది మోసం అని తెలుసు, చప్పట్లు కొట్టించడం ద్వారా మిగిలిన వారిపై ఒత్తిడి తీసుకు వచ్చే అతని ఐడియా భలే ఉంది అనిపించింది .

********

మన ముందున్న వారే ప్రపంచం అనుకుంటే చావు దెబ్బ తింటాం . బోగస్ స్కీముల వాడి లక్ష్యం హోటల్ లో ఉన్న ఆ కొద్ది మందే కాబట్టి వారి ముందు చప్పట్లు కొట్టించి బోల్తా కొట్టించవచ్చు . కానీ కోట్లమందిని పాలించాలి అనుకునే వాళ్ళు కొద్ది మంది చప్పట్లనే అందరి చప్పట్లు అనుకుంటే దెబ్బ తింటారు . వైస్ రాయ్ హోటల్ సమావేశంలో కొద్ది మంది చప్పట్లనే ప్రజలందరి చప్పట్లుగా నమ్మించాలి అని చూసిన బాబుకు 2004 ఎన్నికల ఫలితాలతో విషయం తెలిసి వచ్చింది . తానా సభలో చప్పట్లకు మురిసిపోయిన నాగంకు తెలంగాణ వచ్చాక విషయం అర్ధమైంది . తానాలో కుర్రాళ్ళ చప్పట్లకు రేవంత్ కు అప్పటికప్పుడు సంతోషం కలిగినా … కాలం సమాధానం చెబుతుంది …. – బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions