ఇందాకే ఎవరో చెప్తుంటే విన్నాను … చిరంజీవి మగమహారాజు సినిమా విడుదలై నలభై ఏళ్లు అయ్యిందట. ఆ సినిమా విడుదలైనప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. అప్పటి పీపుల్స్ వార్ లో పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలో ఉన్నాను. విశాఖ నుంచీ నెల్లూరు వరకూ బెంగుళూరు మద్రాసు అప్పుడప్పుడు నాగపూర్ …
నాగపూర్ లో సరోజ్ థియేటర్ బాగా గుర్తు.
ఇలా దాదాపు రైళ్లల్లోనో బస్సుల్లోనో లారీల్లోనో బతికేస్తున్న రోజులవి.
Ads
అలాంటి సమయంలో ఈ మగమహారాజు విడుదలైంది.
నేను నెల్లూరు నుంచీ రైల్లో విజయవాడ వస్తున్నా …. విజయవాడలో దిగితే ఈ సినిమా చూడలేను.
రైల్లో కూర్చుని ఆలోచిస్తున్నా …. రైలు తెనాలి స్టేషన్ సమీపిస్తోంది.
రైల్వే ట్రాక్ పక్కనే అలంకార్ థియేటర్ ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే …. థియేటర్ వెనుక ట్రాక్ ఉంటుంది.
రైల్లో ప్రయాణించే నాలాంటి సినిమా పిచ్చోళ్ల కోసం వెనక వైపు కూడా ఓ పెద్ద సిక్స్ షీట్ పోస్టర్ అంటించేవాళ్లు ఆ రోజుల్లో ….
అలా కిటికీలోంచీ బయటకు చూస్తున్న నాకు మగమహారాజు పోస్టర్ కనిపించింది.
తెనాలిలో దిగిపోయా …
స్టేషన్ బయటకు వచ్చి టీ తాగి మారీస్ పేట వైపు నడవసాగాను.
అప్పట్లో స్టేషన్ టూ మారీస్ పేట్ వైపు నడుస్తుంటే ఓ పోలీస్ స్టేషన్ ఉండేది.
దాన్ని పట్టించుకోకుండా …. అలా నడుచుకుంటూ అలంకార్ థియేటర్ దగ్గరకు పోయా …
రిలీజ్ రోజు … నేను వెళ్లింది మ్యాట్నీకి.
నిజానికి మార్నింగ్ షో నెల్లూరులోనే చూసి బయల్దేరదామనుకున్నా …
కానీ ఒంగోలులో ఓ అర్జంట్ డెలివరీ ఉండడంతో తప్పలేదు.
ఒంగోలులో డెలివరీ అయిపోయాక …
మార్నింగ్ షో మొదలైపోయి ఉందనుకుని రైలెక్కా ….
అలా అలంకార్ థియేటర్ దగ్గరకు వచ్చేసరికి హిట్ టాక్ వచ్చేసింది …
కోలాహలంగా ఉంది ….
టిక్కెట్లు అప్పటికే అయిపోయాయి …
నాకు ఈ విషయంలో దారుణమైన అవగాహన ఉంది …
ఆ రోజు రాత్రికి వైజాగ్ వెళ్లే ఛాన్స్ ఉండడంతో …. తెనాలిలో మ్యాట్నీ చూడ్డం తప్ప గత్యంతరం కనిపించలేదు.
దీంతో బ్లాక్ లో కొనేసి లోపలికి దూసుకువెళ్లిపోయా …
సాయంత్రం ఐదున్నరకల్లా సినిమా అయిపోయి బయటపడిపోయా.
టీ తాగి రైలెక్కేసి చలో బెజవాడ అనేశా …
అప్పటికి చట్టానికి కళ్లు లేవు లాంటి సినిమాలతో యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్నదశలో … చిరంజీవిని పెట్టి ఫ్యామ్లీ సబ్జక్టుతో డైరెక్టర్ గా డెబ్యూ మూవీ చేసేశారు పాపం విజయబాపినీడు.
విజయ, నీలిమ పత్రికల ద్వారానూ …. బొమ్మరిల్లు, బొట్టూ కాటుక లాంటి సినిమాల ద్వారానూ బాపినీడుతో బోల్డు స్నేహం ఉండేదప్పట్లో.
బాపినీడు సినిమాల్లో శృంగార రసానికి కాస్త ప్రత్యేక స్తానం ఉంటుంది..
ఆయన జర్నలిజం జీవితంలోలాగానే …
మరి ఆ రోజుల్లో రాధిక, రమణి లాంటి పత్రికలు కూడా వారి నుంచే వచ్చేవి.
మగమహారాజులో కూడా ఆ ధోరణి బలంగా కనిపిస్తుంది.
అనూరాధ అనే నర్తకికి కూడా చిరంజీవితో పాటుగా పేరు తెచ్చిన సినిమా మగమహారాజు.
అప్పుచేసి మహారాజులవ్వాలనుకునే తరం మారాలి. కష్టపడి పనిచేయాలి అని మగమహారాజులు వర్ధిల్లాలి అనే నినాదంతో నడుస్తుంది సినిమా …
నిజానికి ఇందులో వాస్తవం లేదనే విషయం బాపినీడుగారికీ తెలియనిది కాదనుకోండి … ఏదో అలా పెట్టేశారంతే పాపం …
అలా మగమహారాజు అనగానే తెనాలి అలంకార్ థియేటర్ గుర్తొస్తుంది ….
అలా అప్పట్లో భలే ఉండేది అన్ని ఊళ్ల సిన్మా హాళ్లు మనవే అన్నట్టుండేది….
Share this Article