Taadi Prakash………… చాలా ఏళ్ళ క్రితం….. మౌనం ఒక యుధ్ధ నేరం అంటూ వరవరరావు గారు రాసిన దీర్ఘ కవితకి ఆర్టిస్ట్ మోహన్ రాసిన ముందుమాట ఇది … వరవరరావు కవితల ఆంగ్ల అనువాద సంపుటి జూన్ 13 న హైదరాబాద్ లో ఆవిష్కరణ సందర్భంగా….
త్యాగం నిలుస్తుందా?
దురాక్రమణ నిలుస్తుందా ?
Ads
…… artist Mohan
ఇరాక్ మన పత్రికల మొదటిపేజీల నుంచీ, ప్రత్యేక పేజీలనుంచీ మెల్లగా తప్పుకుని ఎక్కడో ఏడో పేజీలో మూడోకాలంలోకి సెటిల్ అవుతోంది. మనం కూడా సవాలక్ష పనుల్లో వెరీబిజీ గనక మన మనస్సులో మొదటిపేజీనుంచి ఇరాక్ ని చల్లగా తప్పిస్తున్నాం. యుద్ధవ్యతిరేక ప్రదర్శనలు సద్దుమణిగాయి. మొదట్లో యుద్ధానికి పరమ తీవ్ర, అతి తీవ్ర, సాదా తీవ్ర నిరసనలు చేసిన ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనాలు ఇప్పుడు తలగోక్కుంటూ, గొణుగుతూ, మరి మా కంపెనీల కాంట్రాక్టుల సంగతేంటని ప్లేటు ఫిరాయిస్తున్నాయి. ఐరాస చిన్న రబ్బరుస్టాంపు గుద్దితే చాలు ఇరాక్ ని అర్జెంట్గా “పునర్నిర్మించడానికి” ఇండియన్ కంపెనీలన్నీ సర్వసన్నద్ధంగా ఉన్నాయి.
అమెరికా బ్రిటన్లు చేసిన యుద్ధం చట్టబద్దమైందేననీ, మిగిలిందల్లా బుష్ అక్కడో గవర్నమెంట్ లాంటిదాన్ని పెట్టి, ఇరాక్ నూనె పండించే బంగారాన్ని ఏఏ కంపెనీలు పంచుకోవాలో చెప్పడమేననీ తీర్మానం చేయడానికి భద్రతా సంఘమూ, ఐరాస, కోఫీ అన్నన్ అంతా ఆత్రంగా ఉన్నారు. పాలస్తీనా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ శరీరాలమీద ఈ గాయాలూ, రక్తస్రావం, రోదనా యాభైఏళ్ళ నించీ ఉన్న గొడవే గదా. కొత్తేముంది. మరో యాభైయ్యేళ్ళు ఇలా గడిచినా సరే బెంగేముంది?
అమెరికా కోరుకున్న అచ్చమైన ‘శాంతి’ వచ్చింది. అంతే చాలు. పశ్చిమాసియా ఎడారి మ్యాప్ మీద బుష్ ఇప్పుడు కొత్త సరిహద్దుల్ని గీస్తాడు. ఇజ్రాయిల్ చెప్పిన చోట ఎర్రపెన్సిలూ నీలం పెన్సిల్తో ఇసకమీద గీసే ఈ చాళ్ళలో నెత్తురు కాల్వలు కడుతుంది. డాలర్ల పంట ఏపుగా ఎదుగుతుంది. ‘అనాగరికులైన’ అరబ్బులకు ప్రజాస్వామ్యం, ఎన్నికలు, పార్లమెంటు, శాంతి అంటే ఏంటో పూర్తిగా తెలిసొస్తుంది.
శతాబ్దాలుగా వలసవాదం వందలసార్లు చేసిన ఈ మురికి పనులు ఇరవయ్యొకటో శతాబ్దంలో కూడా జిరాక్శ్ కాపీల్లాగా రిపీట్ అవుతాయా?భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన కూడా నిత్యమూ సత్యమూ అని నమ్మిన కాలం ఉంది. కానీ అలా కాలేదు. ఇరాక్ కూడా అలాటి నమ్మకాలని కాదంటుందని నమ్మొచ్చు. ఇరాక్ సాంప్రదాయం, అంటే విప్లవ వారసత్వం – ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ చరిత్ర గురించి మనకున్న అతి తక్కువ సమాచారం నుంచి సంక్షిప్తంగా :
పశ్చిమాసియా దేశాల కమ్యూనిస్టు పార్టీలన్నిటికంటే పెద్దది ఇరాక్ పార్టీ. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత నానాజాతి సమితి ఈ దేశాన్ని బ్రిటన్ కు రాసిచ్చేసింది (మేండేట్). 1920ల నుండి 32 వరకూ ఈ పాలన సాగింది. మన దేశంలో లాగే ఆ కాలంలో దేశమంతటా రైల్వేలైన్లు వేశారు. కొత్త కార్మికవర్గం పుట్టింది. ’27లో మొదటి రైల్వే కార్మిక సమ్మె జరిగింది. ’29లో మొదటి యూనియన్ స్థాపించారు. ఇండియాకీ ఇరాక్కీ చాల పోలికలున్నాయి. రెండూ బ్రిటన్ వలసలే. రెండు దేశాల కమ్యూనిస్టులూ సోవియట్ అక్టోబర్ విప్లవ ఉత్తేజంతోనే పుట్టారు.
నిజానికి మొట్టమొదట మార్క్సిస్టు ప్రభావంలో కొచ్చిన వ్యక్తి మన భారతదేశంలో తిరిగి తనలాటి వారిని కలుసుకున్నాడు. ఆయన హుస్సేన్ ఆల్హాల్, యూరప్ లో చదువుల కోసం తల్లిదండ్రులు పంపగా బస్రాలో ఓడ ఎక్కి కరాచీలో దిగి ఇండియాలో ఏడాది ఉన్నాడు. ఇక్కడి కమ్యూనిస్టుల్ని కలిశాడు. యూరప్లో ఆనాటి మన విద్యార్థులందరి లాగే కమ్యూనిజాన్ని మరింత చదువుకున్నాడు. తిరిగి వచ్చాక బాగ్దాద్లో 1924లో మొదటి మార్క్సిస్ట్ స్టడీసర్కిల్ ‘జమాతి’ ప్రారంభించాడు.
ఇరాక్ తొలి నవలా రచయిత మహమ్మద్ అహ్మద్ సయీద్ అందులో సభ్యుడు, ఇరాక్ కమ్యూనిస్టు పార్టీ 1934లో ఏర్పడింది. బస్రా లాంటి పట్టణాల్లో ఉద్యమాల నుండి యూసుఫ్ సల్మాన్ యూసుఫ్ లాంటి వీరుడు నాయకుడయ్యాడు. ఆయన్ని జనం “ఫాద్” (చిరుతపులి) అని పిలిచేవారు. రష్యాలో కమ్యూనిస్టు యూనివర్సిటీలో చదువుకునేందుకు కొమింటర్న్ ఆయన్ని ఎంపిక చేసింది. 1933లో ‘ఫాద్ అరెస్టయాడు. కోర్టులో మొట్టమొదటిసారిగా తన తరపున వాదించుకున్న కమ్యూనిస్టు ఆయనే,
1935లో పార్టీ కార్యదర్శి ఆసిన్ ఫ్లాయేని అరెస్ట్ చేశారు. ప్రింటింగ్ ప్రెస్ ని సీల్ చేశారు. కమ్యూనిజం చట్టవిరుద్ధమని పార్లమెంటు 1937లో ప్రకటించింది. 1941లో ఫాద్ పార్టీ నేత అయ్యాడు. పార్టీ బలమూ ప్రతిష్టా ఎంతో పెరిగాయి. నాజీలపై సోవియట్ పోరాటం ఆనాడు అందరికీ ఉత్తేజం.
అప్పుడు పార్టీలో షియాలు, సున్నీలు, కుర్దులూ ఉండేవారు. పార్టీ నాయకత్వంలో క్రిస్టియన్లూ యూదులూ ఉండేవారు. నిజానికి “ఫాద్” క్రిస్టియన్ పూర్వరంగం గలవాడు. 1944-46 మధ్యకాలంలో ట్రేడ్ యూనియన్లలో పార్టీ అతి పెద్దశక్తిగా ముందుకొచ్చింది. కుర్దిస్తాన్లో శాఖలు పెట్టి స్వయంనిర్ణయాధికారం, స్వయంప్రతిపత్తి కోసం పోరాడింది. 1947లో అర్బాత్ గ్రామంలో భూస్వాములకు వ్యతిరేకంగా మొదటి రైతాంగ తిరుగుబాటు జరిగింది. బ్రిటిష్ వాళ్ల గుండెల్లో రైళ్ళు! 1947 జనవరిలో “ఫాద్”తో పాటు అనేకమంది పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేశారు . ఫాద్ తో పాటు పాలిట్ బ్యూరో సభ్యుడు జాకిబాసిన్ కి మరణశిక్ష వేశారు. దీనికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఉద్యమానికి తలొగ్గి శిక్షలను యావజ్జీవంగా మార్చారు.
ఈ కాలంలో పార్టీ ఎంతో విస్తరించి, దేశంలో కీలకశక్తి అయింది. ఇరాకు బ్రిటన్ కు ఎల్లకాలం బందీగా ఉంచే “పోర్ట్స్ మౌత్” ఒప్పందానికి నిరసనగా జాతి మొత్తం “అల్-వతా” తిరుగుబాటు చేసింది. వేనకు వేలుగా ఎంర్రజెండాలతో నగరాలూ, పట్నాల్లో ప్రదర్శనలు చేశారు. ఒక్క బాగ్దాద్ ఉరేగింపులోనే 400 మందిని మెషీన్ గన్లతో కాల్చి చంపారు.
దేశం అల్లకల్లోలమయింది. ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోయాడు, పోర్ట్ మౌత్ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత కార్మిక సమ్మెలూ, హదితా ఆయిల్ పంప్ స్టేషన్ నుంచి 3 వేలమంది కార్మికులు 250 కిలోమీటర్లు నడిచి బాగ్దాద్ చేరడం గవర్నమెంట్ ని గడగడలాడించింది.
అయినా ప్రభుత్వం ఎమర్జెన్సీ పెట్టి వందలాది కమ్యూనిస్టులను చంపింది. జైల్లో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి ‘ఫాద్’ పాలిట్ బ్యూరో సభ్యులు అలబీబీలపై కేసులు తిరగదోడి అర్ధరాత్రి మరణశిక్షలు అమలుచేసింది. ఉరికంబం ఎక్కుతూ ఫాద్ నిర్భీతిగా చెప్పిన మాటలు “మాకు శరీరాలున్నాయి. ఆలోచనలున్నాయి. మీరు మా శరీరాల్ని నాశనం చేయొచ్చు. మా ఆలోచనల్ని కాదు”
మర్నాడు ముగ్గురు నాయకుల శవాల్నీ బాగ్దాద్లో మూడుచోట్ల వేలాడదీసి జనాన్ని భీతావహుల్ని చేసింది ప్రభుత్వం. కానీ ప్రజలు “అమర వీరుల పార్టీ”గా కమ్యూనిస్టుపార్టీని గుర్తు పెట్టుకున్నారు. పార్టీమీద ప్రేమ, ఆదరం వెయ్యిరెట్లయింది. పార్టీ మరింత పెరిగింది. 1950వ దశకం భూస్వాములపై రైతాంగ తిరుగుబాటు “ఇంతిఫాదా” ఉధృతమయింది. సైనికులు, సైనికాధికారులూ ఎంతోమంది పార్టీలో చేరారు. 1958 జులైలో జరిగిన విప్లవ తిరుగుబాటుకు అగ్రభాగాన పార్టీ నిలిచింది. కీలుబొమ్మ ప్రభుత్వం కుప్పకూలింది.
జనరల్ కాశిం నాయకత్వంలో జాతీయ సైన్యం అధికారంలోకొచ్చింది. అంకెలు విసుగ్గా ఉంటాయి. అయినా కమ్యూనిస్టుల బలం చూడండి. 1959 నాటికి ట్రేడ్ యూనియన్లలో 2 లక్షల 50 వేల మంది కార్మికులు చేరారు. గ్రామాల్లో రెండులక్షల మందికి ప్రాతినిధ్యం వహించే 3 వేల రైతుసంఘాలున్నాయి. ఇరాకీ మహిళాలీగ్ లో 20వేల మంది , యువజనసంఘంలో 84 వేల మంది ఉన్నారు. ఆర్మీ ఆఫీసర్లు, సైనికులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు.
ఈ బలం చూసి గవర్నమెంటు జడుసుకుంది. 1959 మేడేన బాగ్దాద్లో మూడు లక్షల మంది ప్రదర్శన చేశారు. ప్రభుత్వంలో కమ్యూనిస్టులకు పాత్ర ఉండాలని డిమాండ్ చేశారు. 1958 నుండి కాశిం ప్రభుత్వం స్వతంత్ర ఇరాక్ ఆవిర్భావానికి కొత్తచర్యలు తీసుకుంది. బ్రిటిష్ వాళ్ళని సైనిక స్థావరాల నుండి వెళ్ళగొట్టింది. ఆంగ్లో అమెరికన్ ఆయిల్ కంపెనీల తోకలు కత్తిరించింది. కానీ తనను బలపరిచే కమ్యూనిస్టు పార్టీ మీదే కత్తి దూసి బలహీనపడింది ప్రభుత్వం. సైన్యంలో కొంతమంది బాత్ పార్టీతో చేతులు కలిపి 1963లో కాశింను కూలదోసి ఉరితీశారు. దీనికి నిరసనగా కమ్యూనిస్టులు బాగ్దాద్ పేదవాడల నుండి వేలాదిమందిని వీధుల్లోకి తెచ్చారు. టాంకులు, మరతుపాకులతో ఈ నిరసన నోరు నొక్కేసింది కొత్తప్రభుత్వం.
తర్వాతి కాలమంతా చీకటే. మూడువేల మంది కమ్యూనిస్టుల్ని ఊచకోత కోసి చంపారు. వేలాది మందిని జైళ్ళలో కుక్కారు. కాశిం ప్రభుత్వంపై కుట్రకు ముందే కమ్యూనిస్టుల లిస్టుల్ని బాత్ పార్టీకి సిఐఎ సప్లై చేసిందట. పార్టీ ప్రధమ కార్యదర్శి హర్రాదీని అరెస్ట్ చేసి నాలుగురోజులు ఘోరంగా చిత్రహింసలు పెట్టి చంపారు. ఆయన ఒక్క రహస్యమూ చెప్పలేదు. కాశిం ప్రభుత్వం జైళ్ళలో పెట్టిన కమ్యూనిస్టులను, బాత్ పార్టీ నేషనల్ గార్డ్ రోడ్ల మీదికి ఈడ్చుకొచ్చారు. పబ్లిక్ గా కాల్చిచంపారు. కాశింపై కుట్ర జరిగిన మొదటి మూడురోజుల్లో బాత్ పార్టీ వాళ్ళు చంపిన కమ్యూనిస్టుల సంఖ్య 5000 అని కమ్యూనిస్టు పార్టీ చెప్పింది. ఆటస్థలాలు, స్కూళ్ళు అన్నీ కాన్సెన్ట్రేషన్ కేంపులయ్యాయి. చిత్రహింసలపర్వం. పార్టీ కుర్ద్ ప్రాంతానికి ఉపసంహరించుకుంది.
కొత్తప్రభుత్వం ఎంతోకాలం లేదు. 1963 నవంబర్లోనే కూలిపోయింది. కొత్త సైనిక ప్రభుత్వాన్ని 1968లో బాత్ పార్టీ కూల్చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ మీద ఘోరమైన నిర్బంధం 1971 వరకూ సాగింది. 1972 ఒప్పందం మేరకు ఇద్దరు కమ్యూనిస్టులు మంత్రివర్గంలో చేరారు. ’78 నాటికి బాత్ పార్టీ కమ్యూనిస్టులపై విరుచుకుపడింది. ఇద్దరు మంత్రుల్ని అరెస్ట్ చేసింది. వారితోపాటు దేశభక్తియుత సంఘటనలోని కమ్యూనిస్టులందర్నీ కాల్చిచంపింది. 1979లో సద్దాం హుసేన్ పూర్తి అధికారంలోకొచ్చే సమయానికి, ప్రభుత్వాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నామని పార్టీ ప్రకటించింది. మళ్ళీ కుర్ద్ ప్రాంతానికి పార్టీ వెళ్ళిపోయింది. 1980లో కుర్దిష్ డెమొక్రటిక్ పార్టీ, కుర్దిష్ సోషలిస్ట్ పార్టీలతో ఒప్పందం చేసుకుంది. అప్పటి నుంచీ సద్దాం ఏకపార్టీ పాలనపై సాయుధపోరాటం చేస్తోంది.
ఈ మధ్య ఇరాక్ పై దాడికి ముందు సద్దాం వ్యతిరేకుల సమావేశాలను అమెరికా, లండన్లో (2002) జరిపింది. పార్టీ ఆ మీటింగ్ లను బహిష్కరించింది. అమెరికా దురాక్రమణ ముగిశాక బాగ్దాద్ లో మొట్టమొదటి పత్రికను తీసుకొచ్చింది పార్టీయే. చరిత్రలో ఇంతమంది వీరపుత్రుల్ని పోగొట్టుకున్నది ఇండోనేషియన్ కమ్యూనిస్టు పార్టీ తర్వాత ఇరాక్ పార్టీయే. ఇంత తెంపరిగా పోరాడిందీ, ఇన్ని హింసల పాలయిందీ ఇరాక్ పార్టీయే. పశ్చిమాసియా దేశాలన్నిటిలోకీ లక్షలాదిమందిని వీధుల్లోకి తెచ్చిందీ, సాయుధం చేసిందీ ఇరాక్ పార్టీయే. విభేదాలూ, తప్పులూ, వ్యూహమూ, ఎత్తుగడలూ, సోవియట్ పంథా, చైనాదారి, మరోదారి లాంటి మన ఇండియన్ పార్టీలకున్న తలనెప్పులన్నీ ఈ పార్టీకీ ఉన్నాయి. ప్రాణాలు పణం పెట్టింది. కానీ బతికే ఉంది. బలంగా ఉంది. పోరాడుతోంది.
త్యాగం నిలుస్తుందా? దురాక్రమణ నిలుస్తుందా? జనం చూస్తారు. ఇప్పటికిమాత్రం ఇది ఓటమి. రక్తసిక్తమైన మరో పరాజయం. ఇరాక్ మీద దాడికి సన్నాహాలు జరుగుతున్నపుడే ఇక్కడ నిరసన ప్రదర్శనలు జరిగాయి. దాడికాలంలో ఇంకా ఉధృతమయాయి. ఇందిరాపార్క్ సుందరయ్య పార్క్ లో నినాదాలిస్తే ఏమౌతుంది? వరవరరావు కవిత్వం రాస్తే, మైక్ లో చదివితే ఏమవుతుంది?
కానీ తప్పదు. దారీతెన్నూ లేని ఎడారి మధ్య ఇసుక తుపాన్లో గావుకేక. నిస్సహాయంగా, క్రోధంతో, అరిచి ఉండొచ్చు. ఎవరున్నా విన్నారో లేదో ఏమో తెలీదు. వింటారనీ కాదు. తప్పనిసరిగా కడుపుచించుకు వచ్చిన కక్ష. కోపం. ఏడుపు. ఇలాంటివి కవిత్వాలవుతాయా అంటే ఏమో. లాక్షణికులకి వదలండి. పండితులని తూకాలు వేయమనండి.
వరవరరావుని మాత్రం కన్నీళ్ళు పెట్టుకోనీయండి. బొంగురు గొంతుతో రోడ్లకడ్డంపడి నినాదాలివ్వనీండి. అల్లంత దూరాన ఉన్న అమెరికా మీద కసిగా రాళ్ళు రువ్వనీండి. ఆయన గావుకేకలన్నీ మనం వినాలని రూలేం లేదు. ఈ కవిత్వాల్ని పట్టించుకోవాల్సిన పని అంతకన్నా లేదు. పేవ్మెంట్ మీంచి పక్కకి తప్పుకోండి. వరవరరావు తన దారిన తానే పోతాడు….. – మోహన్, హైద్రాబాద్
Share this Article