Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఐనవాడే అందరికీ… చందమామ మీద నాలుగో వెన్నెల సంతకం…

July 14, 2023 by M S R

Moon Light: భూమికి చంద్రుడు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా…చాలా దగ్గరివాడు. భూలోకవాసులందరికీ చంద్రుడు మామ- చందమామ. దేవదానవులు అమృతం కోసం వాసుకి మహా సర్పాన్ని తాడుగా చుట్టి…మంథర పర్వతాన్ని చిలికినప్పుడు…అమృతం కంటే ముందు లక్ష్మీ దేవి…ఆమెతో పాటు చంద్రుడు వచ్చారు. అమ్మ సోదరుడు కాబట్టి అలా మనకు చంద్రుడు మేనమామ అయి…జగతికి చందమామ అయ్యాడు.

“పల్లవి:-
చందమామను చూచి వద్దామా?
సదానందా!

చరణం-1
తల్లడించే తామసులను వెళ్ళవేసి వేవేగ ఒళ్ళుమరచి తారకమున తెల్లవారేదనక మనము…
||చందమామను…||

Ads

చరణం-2
పంచబాణుని పారద్రోలి కుంజరమ్ముల కూలవేసి మంటి మింటి రెంటి నడుమ ఒంటి స్తంభపు మేడ మీద… ||చందమామను…||

చరణం-3
శత్రులార్గురి చెంతచేరక ఇంద్రియాదుల వెంటబోక మట్టు తెలిసి మేలుకోట పట్టణంబున చేరి ఇపుడు… ||చందమామను…||

చరణం-4
చదువులన్నీ చదివిచదివీ చచ్చిపోయేదింతె గానీ గుట్టు తెలిపే గురుడు గల్గితే చూడవచ్చును సులభమున్నదీ… ||చందమామను…||

చరణం-5
అమర నారేయణ స్వామి ఆదిగురుని బోధచేత తలచినప్పుడె తనువులోన తప్పకుండా చూడవచ్చును… ||చందమామను…||”

కర్ణాటక- ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో కర్ణాటకలో మేలుకోట (కైవారం) అమరనారాయణస్వామి యోగి. కర్ణాటకలో కైవార తాతయ్య అంటే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి భవిష్యత్తు చెప్పిన కాలజ్ఞాని. ఆ ఊళ్లో వెలసిన అమరనారాయణ స్వామిని ఉద్దేశిస్తూ తాతయ్య ఏకకాలంలో సంస్కృతం, తెలుగు, కన్నడలో కీర్తనలు రచించి, గానం చేసిన వాగ్గేయకారుడు. ఈయన దాదాపు 300 సంవత్సరాల కిందట పుట్టినవాడు. తాత, తాతయ్య అన్న పేర్లు ఆయన ముసలి వయసులో స్థిరపడి ఉండాలి. నూట పదేళ్లు బతికిన యోగి. చివరి వరకు తత్వాలు అల్లుతూ, పాడుతూ లోకాన్ని మేల్కొల్పినవాడు. ఆయన సమాధి పొందిన తరువాత తాతయ్య పేరు స్థానంలో అమరనారాయణస్వామి వచ్చి చేరినట్లు ఉంది. ఆయన అసలు పేరేమిటో తెలియలేదు. దాంతో వ్యవహార నామాలు, గౌణ నామాలు ఎక్కువైనట్లున్నాయి.

ఆయన రచనలు ఎక్కువగా వెలుగులోకి రాక కాలగర్భంలో కలిసిపోయినట్లు సంగీతజ్ఞులు బాధపడుతూ ఉంటారు. మూడు భాషల్లో సమాన ప్రజ్ఞతో కావ్యాలు, కీర్తనలు, తత్వాలు రాసి లోకం మెప్పు పొందడం చిన్న విషయం కాదు. కర్ణాటకవాడని మనం, మనవాడని కర్ణాటకవారు ఇద్దరూ ఆయనకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదేమో అని వాగ్గేయకారుల మీద పరిశోధనలు చేసినవారు అంటుంటారు.  తెలుగువారు పట్టించుకోని మాట నిజం. కర్ణాటకలో ఆయన కాలజ్ఞాన విషయాలకు, తత్వాలకు తగిన ప్రచారం, గుర్తింపు ఉన్నట్లే ఉంది.

ఒకప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కైవార తాతయ్య కీర్తనలను అధ్యయనం చేసి విస్తృతంగా కచేరీల్లో గానం చేసి ప్రచారం కలిగించారు. ఇప్పుడు స్వాతి తిరునాళ్ రాజ వంశం వాడయిన ప్రిన్స్ రామ వర్మ ఆ పని చేస్తున్నారు. ఆయన పాడిన ఈ తత్వం లింక్ ఇది.

తత్వం కాబట్టి ఇందులో ప్రతీకలు ఎక్కువగా ఉంటాయి. చెప్పే మాటల వాచ్యార్థం(లిటరల్ మీనింగ్) కాకుండా…ఉద్దేశించిన(లక్ష్యార్థం) అర్థాన్ని వెతికి పట్టుకోవాలి.

సదానందా! అంటే మనసా! లాంటి పిలుపు. సదా ఆనందంగా ఉండేవాడిని లేదా ఆ సాధనలో ఉన్నవాడిని ఉద్దేశించిన సంబోధన.
పద చందమామను చూసి వద్దాం. మనలో తామస గుణాలన్నింటినీ తరిమేసి…తార పథంలో తెల్లవారే దాకా ఒళ్లు మరిచి ఉందాం. ఇది యోగవిద్యకు సంబంధించిన సంకేతం. కుండలినీ శక్తిని తట్టి లేపి ఒక్కో నాడి దాటుతూ పైపైకి ఎలా వెళ్లాలో చెబుతున్నాడు.

పంచబాణుడు అంటే మన్మథుడు. కుంజరమ్ములు అంటే మధించిన ఏనుగులు. మన్మథుడిని పారదోలాలి. ఐరావతంలా మధించిన అహంకారాదులను జయించాలి. మంటి- మింటి- రెంటి నడుమ ఒంటి స్తంభపు మేడగట్టి…అంటే  కఠోరమయిన దీక్ష.

1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యం- ఆరుగురు శత్రువులు. వీళ్ల జోలికి వెళ్లకుండా…ఇంద్రియాలకు లొంగిపోకుండా…మేలుకోట(రెండర్థాలు…ఒకటి-ఆయన ఊరి పేరు; రెండు- సాధకుడు చేరుకోవాల్సిన భద్రమయిన చోటు) చేరాలి.

నానా వేదాలు, పురాణాలు, శాస్త్రాలు చదివి చదివి తల బరువెక్కడమే కానీ…ఇట్టే గుట్టు విప్పి చెప్పే గురుడు దొరికితే పరమార్థం తెలియడం చిటికెలో పని( కానీ…అదంత సులభం కాదు అని ధ్వని)

అమరనారాయణస్వామి అనుజ్ఞ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనలోనే చందమామను చూడవచ్చు. అంటే సాధనకు సిద్ధి దశ అది.

చందమామను చూసి వద్దామా?నాయనా! సదానందా!
అని మొదలు పెట్టి…నాలుగు లక్షల కిలోమీటర్ల ప్రయాణమెందుకు?
యోగమార్గంలో వెళితే నీలోనే చందమామను పట్టుకోవచ్చు అని ముగించాడు తాతయ్య. చివర ఆ మాటకు ఒక డిస్ క్లైమర్ పెట్టాడు తాతయ్య. “ఆది గురుని బోధ చేత” అన్నది ఆ షరతు.

చందమామను చూడ్డానికి వెళ్లడం అంటే- మనసును ఒడిదుడుకులు లేని నిలకడయిన ఆనంద స్థితికి తీసుకెళ్లడం. తలచినప్పుడే తనువులోనే చందమామను చూడ్డం అంటే- మనసుతో మనలో మనమే చందమామను సృష్టించుకోవడం లేదా ఆ అనుభూతిని మానసికంగా అనుభవంలోకి తెచ్చుకోవడం.

యోగసాధనలో ఒక్కొక్క మెట్టును ఒక్కో చరణంలో ఎలా బంధించాడు? అసలు చందమామను ఎందుకు చూసి రావాలి? అన్నవి ఇంకా లోతుగా చర్చించాల్సిన విషయాలు. ఇక్కడ అనవసరం. మనలోనే చందమామను ఎందుకు పట్టుకోమన్నాడు అన్న విషయానికే పరిమితమవుదాం.

“చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత
ముఖా దింద్రశ్చాగ్నిశ్చ ప్రాణా ద్వాయు రజాయత”

అని అంటుంది పురుష సూక్తం. మనసుకు చంద్రుడు అధిపతి. కంటికి సూర్యుడు అధిపతి. విరాట్ పురుషుడి మనస్సు నుండి చంద్రుడు, కళ్ల నుండి సూర్యుడు, ప్రాణం నుండి ప్రాణవాయువు పుట్టాయట.

అందుకే అమావాస్యకు, పౌర్ణమికి మనసు సముద్రంలా ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది. కొంచెం మానసిక సమస్యలున్నవారిలో ఈ సమస్య మరీ కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది.

ప్రేయసీ ప్రియులకు వెన్నెల మరింత మనోరంజకం.

పిండి వెన్నెల, పండు వెన్నెల, వెండి వెన్నెల కవులకు వర్ణనీయ వస్తువు.

వెన్నెల భోజనం- మూన్ లైట్ డిన్నర్ ఒక భోగం.

చకోర పక్షులు వెన్నెలను మాత్రమే తిని బతుకుతూ ఉంటాయి. వెన్నెల లేని రాత్రుళ్ళలో నిరాహార దీక్షలు చేస్తూ నిండు పున్నమి కోసం నిరీక్షిస్తూ ఉంటాయి. ఆ నిరీక్షణే- “చకోర పక్షుల్లా ఎదురు చూడడం” అన్న సామెత అయ్యింది.

“భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశాః శిరోద్యౌర్ముఖమపి …”

అంటుంది విష్ణు సహస్రనామం. విష్ణువు ఒక కన్ను చంద్రుడు; మరొక కన్ను సూర్యుడు. “సృష్టి అగ్నిసోమాత్మకం” అంది వేదం. అంటే వేడి- చలువల కలయికలతోనే సృష్టి ఏర్పడింది.

సూర్యుడి వెలుగు, వెచ్చదనంతో కిరణజన్య సంయోగ క్రియగా చెట్ల ఆకులు పత్రహరితం పచ్చదనాన్ని తయారు చేసుకున్నట్లే…
చంద్రుడి వెన్నెల కిరణాల చల్లదనం ధాన్యానికి ఔషధ గుణాలను అద్దుతుంది. పంట బాగా పండాలంటే సూర్యుడెంత ముఖ్యమో…చంద్రుడూ అంతే ముఖ్యం.

మనసు నెమ్మది కావడానికి వెన్నెల టానిక్.
మనసు మరులుగొనడానికి వెన్నెల ఉత్ప్రేరకం.

జగతి చల్లబడి హాయి నిండడానికి,
రేయి పండడానికి వెన్నెల అవసరం.

(ఈరోజు- 14-07-2023- శ్రీహరికోట నుండి చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగడానికి చంద్రయాన్-3 రాకెట్ బయలుదేరుతోంది. ఈ ప్రయోగం సఫలమయితే- అమెరికా, రష్యా, చైనాల తరువాత చంద్రుడిని చేరిన నాలుగో దేశంగా భారత్ చంద్రుడిపై చెరగని వెన్నెల సంతకం చేస్తుంది. ఈ సందర్భంగా పాత వ్యాసంలో వెన్నెల్లో ఆడుకున్న అక్షరాల వెలికితీత)

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions