Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాసిరకం సర్వీసుకు ఇండిగో… నాణ్యమైన ‘పద్ధతికి’ టాటా… ఇవే బలమైన ఎయిర్ గ్రూప్స్…

July 16, 2023 by M S R

Costly Tour: ఆ మధ్య ఎయిరిండియాను టాటా వారు కొన్న తరువాత దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల విలువ చేసే కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇండిగో కూడా పోటీలో వెనుకపడకూడదని నాలుగు లక్షల కోట్ల విలువ చేసే కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. 1903లో రైట్ సోదరులు విమానాన్ని కలగని…తయారు చేయించి… తొలిసారి గాలిలో ఎగిరినప్పటినుండి ఇప్పటివరకు ప్రపంచ విమానయాన చరిత్రలో ఇవే అత్యంత భారీ ఆర్డర్లు అని అంతర్జాతీయ వ్యాపార మీడియా పొంగిపోయి కథలు కథలుగా రాస్తోంది.

ఈ విమానాల కొనుగోళ్ల వల్ల అమెరికాలో బోయింగ్, ఫ్రాన్స్ లో ఎయిర్ బస్ పంట పండినట్లే ఉంది. 2030 వరకు ఈ రెండు పేరు మోసిన అంతర్జాతీయ విమాన తయారీ కంపెనీలకు రాత్రీ పగలు చేతి నిండా పని దొరికింది.

దాదాపు లక్షమంది సాంకేతిక నిపుణులు ఈ పదిన్నర లక్షల కోట్ల రూపాయల ఆర్డర్ల మీదే పనిచేస్తూ ఉండాలట. అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్… ఎయిరిండియాకు, ఇండిగోకు; ప్రత్యేకించి భారత ప్రధాని మోడీకి కృతఙ్ఞతలు తెలిపారంటే…ఈ విమానాల కొనుగోలు వ్యాపార పరిధులు దాటి…ద్వైపాక్షిక బంధాల స్థాయి దాకా ఎలా బలపడిందో తెలుసుకోవచ్చు. ఆ విషయాన్ని భారత ప్రధాని మోడీ స్వయంగా ట్విట్టర్ వేదిక మీదే ప్రకటించారు.

Ads

లెక్కకు మిక్కిలి విమానాలు భారత్ రన్ వేల మీద దిగుతూ, ఎగురుతూ ఉంటే మంచిదే కదా? పాత డొక్కు విమానాలు పోయి…వందల కొద్దీ సరికొత్త బోయింగులు, ఎయిర్ బస్సులు రెక్కలు విప్పి తళతళలాడుతూ నీలాకాశంలో ఎగురుతూ ఉంటే మంచిదే కదా? అని ఎవరికయినా అనిపిస్తుంది. కానీ భారత విమానయాన రంగం గంపగుత్తగా రెండే రెండు కంపెనీల గుప్పిట్లోకి వెళ్లిపోవడం వల్ల విమాన ప్రయాణికులకు నష్టమే తప్ప…ఏ రకంగానూ లాభం ఉండదని ఈ రంగం లోతులు తెలిసిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ సాంకేతిక, ఆర్థిక విషయాల లోతుల్లోకి వెళ్లకుండా వారి ఆందోళనలో ముఖ్యమయిన విషయాలేమిటో చూద్దాం.

భారత్ లో విమానయాన వ్యాపారం వాటా శాతాల్లో:-
ఇండిగో – 57.3
ఎయిరిండియా(టాటా)- 9
విస్తారా(టాటా)- 8 .8
ఎయిర్ ఏషియా(టాటా)- 7 .5
స్పైస్ జెట్- 6 .4
గో ఫస్ట్- 6
ఆకాశా ఎయిర్- 3 .6
అలయెన్స్ ఎయిర్- 1 .2
(గో ఫస్ట్ ప్రస్తుతం మూత పడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇండిగో- టాటా కంపెనీల చేతుల్లో 88 శాతం భారత విమానయాన వ్యాపారం ఉంది)

దేశంలో విమానాశ్రయాలు- 148
2030 నాటికి దేశంలో విమానాశ్రయాల సంఖ్య- 230

దేశంలో ప్రస్తుతం ఉన్న విమానాలు- 700
2030 నాటికి- 1400

ప్రస్తుతం దేశంలో ఏటా విమాన ప్రయాణికుల సంఖ్య- పద్నాలుగున్నర కోట్లు
2030 నాటికి- నలభై కోట్లు

వసతుల లేమి
దేశంలో ఢిల్లీ, బాంబే, కలకత్తా, చెన్నయ్, హైదరాబాద్ విమానాశ్రయాలదే సింహభాగం. ఇప్పటికే మహా నగరాల విమానాశ్రయాల మీద విపరీతమయిన ఒత్తిడి ఉంది. బాంబే, ఢిల్లీలో ఆమధ్య తెల్లవారుజామున గంటల తరబడి విమాన ప్రయాణికుల చెకింగ్ ఆలస్యమై చాలా మంది విమానాలు మిస్సయ్యారు. చివరకు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. గంట విమాన ప్రయాణానికి మూడు గంటలకు పైగా లగేజీ ఇవ్వడానికి, సెక్యూరిటీ చెకింగులకు సమయం పట్టే సందర్భాలు ఇప్పటికీ ఉన్నాయి.

అలాంటప్పుడు 700 విమానాలు 1400 అయితే, 15 కోట్ల ప్రయాణికులు 40 కోట్లు అయితే…అందుకు తగ్గట్లు విమానాశ్రయాల్లో వసతులు ఉన్నాయా? ఉంటాయా? అన్నది పెద్ద ప్రశ్న. భూమ్మీద వసతులను గాలికి వదిలి…కేంద్రం గాల్లో విమానాల కలలకు రెక్కలు తొడుగుతోందని నిపుణులు భయపడుతున్నారు.

విమాన చార్జీలు తగ్గవు
దాదాపు పదిన్నర లక్షల కోట్ల రూపాయల కొత్త పెట్టుబడి మీద వడ్డీ, ఏటేటా తరుగు (డిప్రిసియేషన్), రోజువారీ నిర్వహణ ఖర్చులు పోను ఆపై లాభం….ఇలా విమానయాన వ్యాపారం లెక్కలు వేస్తే… కనీసం ఇరవై లక్షల కోట్ల వ్యాపారం జరగాలి. అంటే ఇరవై లక్షల కోట్లు ఇవ్వాల్సింది విమాన ప్రయాణికులే.

ఇబ్బడి ముబ్బడిగా విమానాల సంఖ్య పెరగడం వల్ల…జిల్లాకో విమానాశ్రయం రావడం వల్ల…ప్రయాణికులకు విమానాలు అందుబాటులోకి వస్తే రావచ్చు కానీ…విమాన ప్రయాణ చార్జీలు తగ్గే సూచనలు లేవు.

ఇప్పటికే వారాంతం సెలవుల్లో, పండగ సెలవుల్లో, వేసవి సెలవుల్లో 5 వేల టికెట్ 20 వేల వరకు వెళుతోంది. డిమాండు ఎక్కువున్న రూట్లలో చార్జీలు పెంచి పిండుకుంటున్న విమానయాన సంస్థలను నియంత్రించడంలో కేంద్రానిది ప్రేక్షక పాత్ర.

సెల్ ఫోన్ వచ్చిన కొత్తల్లో ఇన్ కమింగ్ అయినా…అవుట్ గోయింగ్ అయినా చార్జీల మోత మోగిపోయేది. ఇప్పుడు దాదాపు నామమాత్రం అయ్యింది. అలా విమానాలు సిటీ బస్సుల్లా, ఊళ్లో ఆటోల్లా పెరిగినప్పుడు…చార్జీలు గణనీయంగా తగ్గిపోవాలి. కానీ అలా జరగడం లేదు. మరో పక్క వేగం పెరిగిన వందే భారత్ రైలు టికెట్ ధర విమానం టికెట్ ధరతో పరుగులు పెడుతోంది. దీనితో పరిస్థితి ఎలా తయారయ్యిందంటే…విమానంలో వెళుతున్నవారు...”ఇంత ఖర్చు పెట్టి గాల్లో ఎగరాలా? రైలులో వెళితే బాగుండేది” అనుకునేలా; వందే భారత్ ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్లో వెళుతున్నవారు…”3500 పెట్టాము…ఇంకో 500 పెడితే విమానంలోనే వెళ్ళేవాళ్ళం కదా” అని బాధపడేలా ఉంది.

భూమ్మీది వారు ఆకాశం చూస్తూ…ఆకాశం వారు నేల చూపులు చూస్తూ…ఏకకాలంలో వేదాంత వైరాగ్యం పొందడానికి ఇందులో ఏమయినా దీర్ఘకాలిక ఆత్మ నిర్భర భారత్ వ్యూహం ఉందేమో!

ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(UDAN) అని…దేశంలో సాధారణ పౌరుడు సద్ది మూట కట్టుకుని, చంకన మూట పెట్టుకుని బోయింగుల్లో, ఎయిర్ బస్సుల్లో ఎగురుతూ ఉండాలన్నది అక్షరాలా హిందీ “ఉడాన్” మాట అర్థం, ఆదర్శం. చూడబోతే…2030 తరువాత దేశంలో సంపన్నులకు కూడా విమానయానం చుక్కలు చూపేలా ఉంది!

ఏ వ్యాపారంలో అయినా టాటా వారు మిగతావారి కంటే భిన్నంగా, ధర్మంగా ఉంటారు కాబట్టి…వారి ఎయిరిండియా దేశ విమాన ప్రయాణికుల మీద భారం మోపకపోవచ్చు…వారి నిర్వహణ సామర్థ్యంతో విమానయానం సామాన్యులకు మరింత అందుబాటులోకి రావచ్చు…అన్నది మరొక వాదన. ఈ వాదనే నిజం కావాలని కోరుకుందాం.

(ఇందులో గణాంకాలు, ప్రధానమయిన విషయం “Can India’s aviation infrastructure accommodate the aspiration of these airlines?” అన్న ప్రశ్నతో ఇంగ్లీష్ వ్యాపార దినపత్రిక ఎకనమిక్ టైమ్స్ లో శంతను నందన్ శర్మ రాసిన సుదీర్ఘ వ్యాసం నుండి తీసుకున్నవి)

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions