మేం అధికారంలోకి రాగానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తాం అని 2004 ఎన్నికల ఫలితాల తరువాత ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ప్రకటించగానే అంతా అవాక్కయ్యారు . విలేకరుల కన్నా ముందు టీడీపీ ముఖ్యనాయకులంతా బాబు నోటి నుంచి ఈ మాట విని ఆ మాట అంటున్నది బాబేనా ? అని ఆశ్చర్య పోయారు . ఎందుకంటే అంతకన్నా ముందు వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు పెంచవద్దు అని ఉద్యమిస్తే కాల్పులు జరిపి ముగ్గురి మరణానికి కారణం అయ్యారు . ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయని బాబు చాలా గట్టిగా వాదించారు . ఈ వాదనను పెద్ద సంఖ్యలో నమ్మినవారు కూడా ఉన్నారు .
2004 ఎన్నికల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఎన్నికల ప్రధాన అంశంగా మారింది . ఏదైనా ఒక బలమైన విమర్శ చేసేప్పుడు ముందు చంద్రబాబు నేరుగా తను చేయరు . నన్నపనేని రాజకుమారి లేదా మరో నేతతో ఆ మాట చెప్పించి , ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూశాక చంద్రబాబు చెబుతారు . అదే విధంగా ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికి వస్తాయని తొలుత రాజకుమారి విమర్శించారు . తరువాత బాబు , పార్టీ మొత్తం ఆ మాటను బాగా ప్రచారంలోకి తీసుకు వచ్చారు . చాలా మంది ఆ మాటలు నమ్మారు కూడా .
ఫలితాలు వచ్చి టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రంగారెడ్డి జిల్లాలో ఓ గ్రామంలో రాజకీయ ప్రచారం కోసం విద్యుత్ తీగలపై నిజంగానే బట్టలు ఆరేసి ఈనాడులో మంచి ప్రచారం లభించేట్టు చేశారు .వాస్తవం తెలిసి తరువాత మౌనంగా ఉన్నారు . అలాంటి రోజుల్లో ఉచిత విద్యుత మేమూ ఇస్తామని బాబు ప్రకటించడం మీడియాకే కాదు సొంత పార్టీ వారికి సైతం ఆశ్చర్యం కలిగించింది .
Ads
*****
2004 ఎన్నికల్లో ఓడిపోయిన దాదాపు మూడు నాలుగు నెలల తరువాత ఎన్టీఆర్ భవన్ లో పార్టీ కీలక సమావేశం . టీడీపీ మాజీ శాసన సభ్యురాలు శోభానాగిరెడ్డిని ఎన్టీఆర్ భవన్ లో పలకరించి మాట్లాడితే పార్టీ కీలక సమావేశంలో మేం వివిధ పథకాలకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆమె సలహా అడిగారు . సమాచారం అనేది వన్ సైడ్ గా ఉండదు . నాయకులు , రిపోర్టర్లు పరస్పరం , అభిప్రాయాలు, సమాచారం పంచుకుంటారు . వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మేమూ ఇస్తాం అని బాబును చెప్పమని మీటింగ్ లో సలహా ఇవ్వండి అని శోభానాగిరెడ్డికి చెప్పాను .
ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది , ఉచిత హామీలు ఇప్పుడు ఇస్తే వచ్చేదేముంది అని ఆమె అడిగారు . .. ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలి అని మీరు అంత బలంగా ప్రచారం చేశారు కాబట్టి ఉచిత విద్యుత్ అంశంలో మీ పార్టీ ఏం చేసినా , ఏం చెప్పినా మీకు మైలేజ్ రాదు … ఐతే మేమూ ఇస్తాం అని మీరు ప్రకటిస్తే 2009 కు విద్యుత్ అనేది ప్రచార అంశం కాదు … మీరు బట్టలు ఆరేసుకోవడానికి విద్యుత్ తీగలు అనే మాట ఎంత కాలం అంటే అంత కాలం మీ ప్రత్యర్థులకు విద్యుత్ ప్రచార అస్త్రం అవుతుంది అన్నాను . మీటింగ్ లో శోభా నాగిరెడ్డి బాబుకు ఇదే మాట చెప్పారు . చాలాసేపు చర్చ .. ఇవే సందేహాలు , ఇదే సమాధానం …
******
పార్టీ సమావేశం ముగిశాక అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ మేమూ ఇస్తామని టీడీపీ ప్రకటన… యూ టర్న్ తీసుకున్న బాబు అని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు . సంస్కరణల నుంచి వెనక్కి వెళుతూ యూ టర్న్ తీసుకున్నారని ఇంగ్లీష్ పత్రికల్లో మరింత పెద్ద వార్తలు . మీరు బాబును తప్పుదారి పట్టించారు అని అప్పుడు జ్యోతి టీడీపీ రిపోర్టర్ శోభానాగిరెడ్డి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు . ఆ రోజు పత్రికలో వార్త చూసి అప్పటికప్పుడు లాభనష్టాలు అంచనా వేయవద్దు . ఒక్కరోజు నెగిటివ్ వార్త వస్తుంది అని నేను మీకు ముందే చెప్పాను , కానీ తరువాత ఉచిత విద్యుత్ ఎన్నికల ప్రచార అంశమే కాకుండా పోతుంది అని శోభానాగిరెడ్డికి చెప్పాను .. టీడీపీ ప్రకటన తరువాత ఉచిత విద్యుత్ పెద్దగా ప్రచార అంశమే కాకుండా పోయింది .
*****
మేము తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల వల్లనే ఇప్పుడు వైయస్ఆర్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నారు . విద్యుత్ రంగంలో వైయస్ఆర్ చేసిందేమి లేదు, మేము అధికారంలోకి వచ్చాక మేమూ ఉచిత విద్యుత్ ఇస్తాం అని బాబు ప్రకటించారు . ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా తట్టుకొని బాబు విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చారు . కానీ ప్రతిపక్షంలో ఉన్న వైయస్ఆర్ ఉచిత విద్యుత్ సాధ్యమే అని నమ్మితే అధికారంలో ఉండి , వ్యవస్థ మొత్తం తన చేతిలో ఉన్నా ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చు అనే నమ్మకం బాబుకు కలుగలేదు .
విద్యుత్ బోర్డును విడదీసి సంస్కరణలు తెచ్చిన బాబు హయాంలో ఉన్న అధికారులే వైయస్ఆర్ హయాంలో కూడా ఉన్నారు . బాబు గొప్ప విజనరీ , కంప్యూటర్ కనిపెట్టారు , సెల్ ఫోన్ తెచ్చారు అనే ప్రచారమే తప్ప విద్యుత్ గురించి తన అవసరం ఏమిటో ఎలా సాధించాలో అధికారులకు చెప్పలేక పోయారు , వారి నుంచి సలహాలు పొందలేక పోయారు . వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకుంటున్నాను , ఎలా ఇవ్వవచ్చో చెప్పండి అంటే వాళ్ళే మార్గం చూపేవారు . అలా చేయక పోవడం వల్ల ఎన్నికల్లో బాబును విద్యుత్ కాటేసింది . టీడీపీ కూడా ఉచిత విద్యుత్ ప్రకటించేసరికి ఆ తరువాత ఎన్నికల అంశమే కాకుండా పోయింది .
***********
ఇప్పుడు తెలిసో తెలియకో కాంగ్రెస్ తెలంగాణలో విద్యుత్ ను ఎన్నికల అంశంగా మార్చింది . మరో మూడు నెలల్లో ఎన్నికలు అనగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ కు కాంగ్రెస్ మంచి ప్రచార అస్త్రాన్ని అందించింది . మూడు గంటల విద్యుత్ కావాలా ? మూడు పంటల విద్యుత్ కావాలా ? అని మంత్రులు టి.హరీష్ రావు , కె. రక రామారావు మంచి క్యాచీగా ఉన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు . సామాన్య ప్రజలకు , జిడిపిలు , గ్రోత్ రేట్ లు , కేంద్ర సంస్థలు ఇచ్చే అవార్డుల గురించి తెలియక పోవచ్చు కానీ కరెంట్ గురించి బాగా తెలుసు . ఉచిత విద్యుత్ వల్ల టీడీపీ హయం కన్నా కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కాంగ్రెస్ కు మేలు చేసింది . 24 గంటల విద్యుత్ వల్ల టీడీపీ , కాంగ్రెస్ హయాంలో కన్నా తెరాస హయాంలో విద్యుత్ పరిస్థితి బాగుంది అని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది .
అర్ధరాత్రి వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ కష్టాలను రైతులు చూశారు . ఇందిరా పార్క్ వద్ద విద్యుత్ కోసం పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారు . పరిశ్రమలకు వారానికి మూడు రోజులు విద్యుత్ హాలిడే అమలు చేశారు . ఉమ్మడి రాష్ట్రం చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ( కాంగ్రెస్ ) హయాంలో సచివాలయం వద్ద భారీ హోర్డింగ్ లు ఉండేవి ఏసీలను వాడకండి , విద్యుత్ పొదుపు పాటించండి అని . జెరాక్స్ సెంటర్ వంటి చిన్న వ్యాపారాలు సైతం రోజుకు కొన్ని గంటల పాటు విద్యుత్ కోత చూశారు . స్వయం గా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శాసన సభలో ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి చనిపోతే బోరింగ్ వద్ద స్నానానికి వెళితే కరెంట్ లేదని ఆనాటి పరిస్థితి వివరించారు . కరెంట్ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందో నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు . ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉంది . విద్యుత్ ఎన్నికల ప్రచార అంశం అయినప్పుడు అందరికీ ఆనాటి రోజులు , ఈనాటి రోజులు వద్దన్నా గుర్తుకు వస్తాయి …. – బుద్దా మురళి
Share this Article