దుర్మార్గ బీజేపీని గద్దె దింపాలనే సంకల్పం, ప్రయత్నం విపక్షాల కోణంలో అవసరమే, రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమే… అయితే ప్రస్తుతం ఓ నంబర్లాట నడుస్తోంది అధికార, విపక్షాల నడుమ… 26 పార్టీలు కలిసి మోడీపై యుద్ధభేరీ మోగిస్తాయని కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న దండు… ఎహె, మేం 38 పార్టీలతో మీటింగ్ పెడుతున్నాం అంటున్నాడు బీజేపీ నడ్డా…
అసలు కూటమి అని పిలిచే దగ్గరే వస్తోంది చిక్కు… ఉదాహరణకు, విపక్ష కూటమినే తీసుకుందాం… పేరుకు 26 పార్టీలు… వీటిలో టీఎంసీ, డీఎంకే, జేడీయూ తప్ప మిగతావి సోసో పార్టీలు… 10 పార్టీలకు అసలు పార్లమెంటులో ప్రాతినిధ్యమే లేదు… ఈ కూటమికి పేరు, ఎజెండా త్వరలో ఫిక్స్ చేస్తారట… అయితే రెండు చిన్న ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే జనం నమ్ముతారు… అవేమిటంటే..?
- కాంగ్రెస్‌తో పొత్తు, అవగాహన ఉండదని సీతారాం ఏచూరి నిన్న తోసిపుచ్చాడు… మరి బెంగాల్‌లో మమత కాంగ్రెస్‌కు, సీపీఎంకు ఎన్నేసి సీట్లు ఇస్తుంది..? మరి విస్తృత కూటమి అంటే… బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలి కదా… లేకపోతే సరైన పోటీ ఎలా సాధ్యం..? అసలు కాంగ్రెస్‌తో మాకు దోస్తీ ఏమిటని సీపీఎం అంటోంది కదా… మరిక ఉమ్మడి అభ్యర్థి ఎలా సాధ్యం..? మొత్తం విపక్ష కూటమిలో సీపీఎం, కాంగ్రెస్ కలిసి ఎలా సర్దుకుంటాయి… మమత కాంగ్రెస్, సీపీఎంలను మళ్లీ లేవనిస్తుందా..?
- కేరళలో ఒకవైపు లెఫ్ట్, మరోవైపు కాంగ్రెస్… ఇక్కడా రెండు కూటమిలే… యాంటీ బీజేపీ కూటమి పేరిట ఒక్క బ్యానర్ కిందకు లెఫ్ట్, కాంగ్రెస్ నిజంగా జట్టు కట్టే మాటే నిజమైతే కేరళలో లోకసభ స్థానాల్లో పోటీ మాటేమిటి..? ఓహో, బెంగాల్, కేరళ తప్ప మిగతా అన్నిచోట్లా యాంటీ- బీజేపీ కూటమితో దోస్తీ అంటుందా లెఫ్ట్..?
మిగతా రాష్ట్రాల్లోనూ విపక్షకూటమి సభ్యులకు ఇలాంటి చిక్కులే… అసలు లెఫ్ట్ యూపీయే కూటమిలో ఎప్పుడూ లేదు… ఇప్పుడు యాంటీ-బీజేపీ చర్చ దేశప్రజల్లో బాగా జరగడానికి ఉపయోగపడుతుందనే భావనతో విపక్ష కూటమి మీటింగులకు వస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు… అంతేతప్ప లెఫ్ట్ స్థూలంగా కాంగ్రెస్ వెంట నడవటానికి చాలా అడ్డంకులున్నయ్… స్టాలిన్, నితిశ్, ఠాక్రేలకు కాంగ్రెస్‌తో కలిసి నడవటానికి పెద్ద ఇబ్బంది లేదు… ఆల్‌రెడీ డీఎంకే, జేడీయూ వెంట అధికారం పంచుకుంటున్నవే… ఠాక్రే కూటమిని బీజేపీ అడ్డంగా కోసేసింది, అది వేరే సంగతి…
Ads
జేడీయూ నితిశ్ మళ్లీ ఎన్‌డీఏలో చేరినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు… శరద్ పవార్ డోలాయమానంలో ఉన్నాడు ఆల్‌రెడీ… హిందుత్వను వదిలేసిన ఠాక్రే ప్రస్తుత అవసరాలు, యాంటీ బీజేపీ మోడ్‌లో ఈ విపక్ష కూటమి పాటపాడుతున్నాడు గానీ తన బేస్ బలమైన హిందుత్వను వదిలేసి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఎన్నికలకు వెళ్తే నష్టమేమిటో తనకు అర్థమైతే… తరువాత పరిణామాలు వేచిచూడాలి… అఖిలేష్ మొన్నమొన్న కేసీయార్‌ను కలిసి వెళ్లాడు… అఖిలేష్ అంటేనే అత్యంత సందేహాస్పద కేరక్టర్…
అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన వైసీపీ, బీఆర్ఎస్, టీడీపీలు ఏ కూటమిలోనూ లేవు… కేసీయార్‌ను ఎవరూ నమ్మరు… మహా అయితే బీజేపీ తనను ఇన్‌డైరెక్టుగా వాడుకోగలదు… బీఆర్ఎస్ ప్రస్తుతానికి పూర్తిగా ఒంటరి… టీడీపీకి ఇంకా ఎన్డీయే ద్వారాలు తెరుచుకోలేదు… జనసేనకు ఇచ్చిన విలువను కూడా చంద్రబాబుకు ఇవ్వడం లేదు మోడీ… వైసీపీ కూడా అధికారిక కూటమిలో లేకపోయినా అదీ ఎన్డీయే భాగస్వామే ఒకరకంగా… ఢిల్లీ ఆర్డినెన్స్ మీద బీజేపీతో పోరాటానికి విపక్ష మద్దతు కోసం ఆప్ ఈ కూటమి మీటింగుల్లోకి వస్తోంది తప్ప ఎన్నికలవేళ దాని వ్యూహాలు దానికుంటయ్… అదెలాగూ నమ్మదగిన కూటమి భాగస్వామి కాబోదు…
తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్‌తో కలిసే చాన్సేమీ లేదు… తనకు అదే ప్రధాన ప్రత్యర్థి… ఒకవేళ కలిస్తే బీజేపీ నెత్తిన పాలుపోసినట్టే… కానీ బీజేపీకి బీటీం అనే విమర్శలూ ఉన్నాయి కదా… సో, ఇక్కడ సిట్యుయేషన్ క్లారిటీ లేని పిక్చర్… యూపీలో అఖిలేష్ వర్సెస్ మాయావతి… ఈ రెండు విపక్షాలు కలవడం అసాధ్యం… ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వాసనే ఆప్‌కు గిట్టదు… అవి రెండూ ప్రత్యర్థి పార్టీలు… ఒక ఒరలో ఆ రెండూ ఇమడవు… సేమ్, కాశ్మీర్‌లో పీడీపీ, ఎన్‌సీ రెండూ విపక్షాలే… కానీ పరస్పరం పొడగిట్టదు…
బీజేపీ యవ్వారం కూడా ఏమీ సక్కగా లేదు… ఒంటరిగానే కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తామనే ధీమా తనలో ఏమీ లేదు… పేరుకు నంబర్లాటలో 38 పార్టీలు తమ కూటమిలో ఉన్నాయని చెప్పుకోవడమే తప్ప ఒక్కటీ ప్రభావశీల పార్టీ తనతో లేదు… తనే చీల్చిన షిండే శివసేన గ్రూపు తప్ప… పేరుకు 38 కదా, అందులో 25 పార్టీలకు అసలు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు… తన నుంచి విడిపోయిన అకాలీదళ్ వంటి పార్టీలేవీ ఇటువైపు చూడటం లేదు… సో, వెరసి మళ్లీ బీజేపీ పేరుకు 38 పార్టీలు అని చెప్పుకున్నా సరే, దాదాపు బీజేపీ సొంతంగా పోరాడటమే…
చివరగా… బీజేపీ చెప్పినా చెప్పకపోయినా… మోడీయే దాని ప్రధాని అభ్యర్థి… మళ్లీ ప్రధాన ప్రచారకర్త తనే… మరి విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు..? ఈ ప్రశ్నకు సూటిగా ‘రాహుల్ గాంధీ’ మా ప్రధాని అభ్యర్థి అని చెప్పగలదా ఈ కూటమి..? మమత, నితిశ్, శరద్ పవార్ తదితరులు వోకే అంటారా..? ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే కోరికలూ ఇప్పుడు బలంగానే వ్యక్తమవుతున్నయ్… తన అభ్యర్థిత్వం పట్ల ఈ కూటమి సభ్య పార్టీలన్నీ అంగీకారం వ్యక్తం చేస్తాయా..? ప్రత్యేకించి నితిశ్, మమత, పవార్ వోకే అంటారా..?
Share this Article