(వీవీ రమణమూర్తి… ఎండీ, లీడర్ పత్రిక) నిరుపేదల కళ్ళల్లో వెలుగును చూడాలని తమ యావదాస్తినీ భర్తతో పాటు ధారపోసి రోడ్డున పడ్డ వృద్ధురాలి కథ ఇది. 90 ఏళ్ళ వయసులోనూ ఒంటరి పోరాటం చేస్తూ న్యాయం కోసం కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్న త్యాగమూర్తి కన్నీటి గాథ ఇది. కొంత మంది కుట్రలకు, కుతంత్రాలకు, బలయి పోయిన ఓ మానవతావాది యదార్ధ వ్యధ ఇది.
విశాఖ నగరంలోనే కాదు తెలుగు ప్రజలందరికీ చిరకాలంగా కంటికి రెప్ప లాంటి సంస్థ శంకర్ ఫౌండేషన్. 1984 లో ఆత్మకూరి శంకరరావు నిరుపేదలకు సేవ చేయడం కోసం ఈ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. వీరితో ప్రముఖ నాయవాది డి.వి.సుబ్బారావు, ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్ కంభంపాటి పార్వతీ కుమార్ కూడా చేతులు కలిపారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, చవిచూసి నగరంలో ప్రముఖ వ్యక్తి గా కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన శంకరరావు ఫౌండింగ్ మేనేజింగ్ ట్రస్టీ గా పేదల కంటి చూపు కోసం అహర్నిశలూ కృషి చేశారు.
భర్త శంకరరావుతో పాటు యశోద కూడా అడుగులు వేశారు. తన వాటా ఇస్తి నంతా ట్రస్టు ఇచ్చేసారు. ఈ ప్రాంతంలోని కంటి సమస్యల పరిష్కారానికి ఒక మంచి ఆసుపత్రి వుండాలని వీరు సంకల్పించారు. అనుకున్నట్టుగానే ఆసుపత్రి – ప్రారంభమై పేద ప్రజల కంటి చూపునకు దిక్సూచిగా నిలబడింది. శంకర్ ఫౌండేషన్ పేరు ఊరూరా మారుమ్రోగిపోయింది. కంటి వైద్యం అంటే అందరికీ శంకర్ ఫౌండేషన్ మాత్రమే గుర్తుకు వచ్చేది. తమ కల నెలవేరిందని, పేదల కళ్ళల్లో తెలుగులు నింపామని, జీవిత పరమార్ధానికి అర్ధం చెప్పగలిగామని శంకరరావు, యశోద దంపతులు ఎంతో సంబర పడ్డారు.
Ads
దీనికి తోడు 2005లో బ్రిటన్ మాజీ ప్రధాని జూన్ మేజర్, స్టాండర్డ్ చాప్టర్ గ్రూప్ చీప్ ఎగ్జిక్యూటివ్ మెర్విన్ డేవిస్ స్వయంగా వచ్చి శంకర్ ఫౌండేషన్ నిరుపేదల కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. దీంతో శంకర్ ఫౌండేషన్ ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. ఇక్కడి వరకూ బాగానే వుంది. అయితే 2003లో రిసోర్స్ మొలలైజేషన్ ఎగ్జిక్యూటివ్ గా చిరు ఉద్యోగిగా చేరిన కె. మణిమాల ట్రస్టును తన చేతుల్లోకి తీసుకోడానికి పావులు కదపడంతో ఫౌండర్ ట్రస్టీల కష్టాలు మొదలయ్యాయి.
సమాజ సేవ కోసం సొంత ఆస్తులను దారపోసిన శంకరరావు, యశోదల నుంచి శంకర్ ఫౌండేషన్ ను తన చేతుల్లోకి తీసుకోవాలని -మణిమాల పన్నాగం పన్నారు. ఇదే సమయంలో కాన్సర్తో శంకరరావు అనారోగ్యానికి గురయ్యారు. ఈ కారణంగా 2009లో ట్రస్ట్ బోర్డు శంకరరావు అనారోగ్యం కారణంగా విధి నిర్వహణ చేయలేని పక్షంలో ఆయన తదనంతరం ఆయన స్థానంలో ఫౌండర్ ట్రస్టీ అయిన యశోదను మేనేజింగ్ ట్రస్టీగా వుండాలని తీర్మానం చేసింది.
అయితే శంకరరావు వెంటిలేటర్ మీద ఉండగానే 2012లో తప్పుడు పత్రాలను సృష్టించి యశోదను శాశ్వతంగా ట్రస్ట్ నుంచి దూరం చేసేందుకు కుట్ర మొదలయింది. ట్రస్ట్ డీడ్ ను మార్చడానికి తనకు అధికారాలు ఉన్నట్టు రిజిస్ట్రార్‌కు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి యశోదను మేనేజింగ్ ట్రస్టీగా కాకుండా చేయడంలో మణిమాల కీలక పాత్ర పోషించింది.
అంతే కాదు, ఈ ట్రస్ట్‌కు ఏ మాత్రం సంబంధం లేని తన పాత బాస్ తోటకూర విజయకుమార్‌ను శంకర్ ఫౌండేషస్ కు చైర్మన్ గా చేసేసింది. చివరకు తన సొంత ఆస్తిని ధారబోసిన యశోదను బయటకు పంపించే ప్రయత్నాలు ముమ్మరం చేసే దిశగా పావులు కదిపింది. ట్రస్టులో ఏమి జరుగుతున్నా యశోదకు తెలియనివ్వకుండా చేశారు. ఆమె కారును తీసేసుకున్నారు. ఆమె డ్రైవరును తొలగించారు. మిగిలిన ట్రస్టీలు మాత్రం ట్రస్టులో పెత్తనం చలాయిస్తున్నారు. మణిమాల అయితే తాను రాజీనామా చేసి వెళ్లి పోతున్నానంటూ పాత బకాయిల కింద దాదాపు 75 లక్షలు పట్టుకొని వెళ్ళిపోయింది. అయినా ట్రస్టీలు మాట్లాడలేదు.. ఇప్పుడు ట్రస్ట్ చైర్మన్ గా న్యాయవాది రామదాసును కూర్చోబెట్టారు, ఒకప్పుడు విశాఖలో ప్రఖ్యాతి పొందిన గ్రాండ్ బే హోటల్ యజమాని ఆయన.
శంకరరావు సతీమణి యశోద ఇప్పుడు అద్దె ప్లాట్లో జీవనం గడుపుతున్నారంటే ఆమె దయనీయ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు, శంకరరావు, యశోదలు ఏ ఉద్దేశంతో తమ ఆస్తుల్ని ధారబోసి ట్రస్ట్ ద్వారా సేవ చేయాలనుకున్నారో ఆ ఆశలు నెరవేరకుండా పోయాయి. ఉచితంగా చేయాలనుకున్న సేవలకు రేటు కట్టి డిస్కౌంట్లు ఇస్తామంటూ ప్రకటనలు చేసే స్థాయికి ఫౌండేషన్ దిగజారింది. అందరికీ కంటి చూపు కావాలనుకున్న వీరి కంట్లోనే సేవ పేరుతో కొంతమంది కారం కొట్టి ట్రస్టును కాజేసి తమ చేతుల్లో పెట్టుకున్నారు. అయితే ట్రస్టు ఏ ఆశయాలతో స్థాపించబడిందో ఆ ఆశయసాధన కోసం యశోద ఇప్పటికీ 90 ఏళ్ల వయసులో న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఇది యశోద కధ…
(వైజాగ్ నుంచి వెలువడే ఓ చిన్న పత్రిక లీడర్… అలాంటి పత్రికలూ పరిశోధనాత్మక కథనాలను ధైర్యంగా పబ్లిష్ చేస్తున్నాయి… మెయిన్ స్ట్రీమ్ పూర్తిగా అధికార పార్టీలు, ప్రధాన పార్టీల భజనలకే అంకితం అవుతున్న స్థితిలో చిన్న పత్రికలే కాస్త నయం అనిపిస్తున్నాయి… అందుకే ఈ స్టోరీని ఉదాహరణగా తీసుకుని ఈ కథనం పబ్లిష్ చేస్తున్నాను…)
Share this Article