మొత్తానికి ఆదిపురుష్ భారీ వ్యయం, భారీ ఫ్లాప్ దేశంలోని సినిమా నిర్మాతలందరికీ ఓ పాఠం నేర్పింది… తలాతోకా లేని పిచ్చి డైలాగులతో, సీన్లతో, వేషధారణలతో ఓ చెత్తా గ్రాఫిక్ సినిమాను ప్రజెంట్ చేస్తే ఈ దేశ ప్రేక్షకులు ఎలా రియాక్టవుతారో స్పష్టంగా చెప్పింది… కొందరు జాతీయవాదులు అనవసర ప్రేమతో సినిమాను చూడండీ, చూడండీ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసినా సరే ప్రేక్షకులు పట్టించుకోలేదు… చివరకు అలా అభిమాన ప్రచారాన్ని చేసిన ప్రేక్షకులు సైతం ఛీకొట్టేశారు అంతిమంగా…
ఐతే అన్నింటికన్నా ఘోరం సదరు సినిమా డైలాగులు రచయిత ప్రేలాపనలు… ఏం వాగుతున్నాడో తనకే తెలియని స్థితి… కావాలనే ఆ మాస్ డైలాగులు రాశానంటాడు ఓసారి, అసలు హనుమంతుడు దేవుడే కాదంటాడు మరోసారి, దేశవ్యాప్తంగా హిందువులు, రామభక్తులు నెట్‌లో బండబూతులు తిట్టేసరికి… సోనీ కూడా తనను ఏదో ప్రోగ్రాం నుంచి పీకిపారేసేసరికి తత్వం బోధపడి, చివరకు బేషరుతుగా క్షమాపణ చెప్పి, చేతులు జోడించాడు…
తిరుమలలో హీరోయిన్ కృతిని పబ్లిక్‌గా ముద్దుపెట్టి మరింత రచ్చకు కారకుడైన దర్శకుడు ఓం రౌత్ మీద సినిమా ప్రేక్షకుల్లో ఓ అయిష్టత కాదు, వెగటు పుట్టింది… అంత దరిద్రంగా తీశాడు… ఫాఫం, ఈ మొత్తం వ్యవహారంలో బాధితుడిగా మిగిలిపోయాడు ప్రభాస్… సినిమా ఎలా వస్తోందో ఓసారి చూసుకోవాలనే సోయి లేనందుకు ఫలితం అనుభవించాడు… ఇదంతా ఒకెత్తు, సినిమా ప్రేక్షకులు సెన్సార్ వాళ్లను తిట్టడం మరో ఎత్తు…
Ads
‘మీకేం పుట్టిందిరా..? ఇలాంటి చెత్తకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు..? హనుమంతుడికి రాసిన డైలాగుల్ని వినలేదా..? ఈ దేశ పవిత్రగ్రంథం రామాయణాన్ని ఓ డస్ట్ బిన్ డైరెక్టర్ భ్రష్టుపట్టిస్తే ఎలా ఆమోదించారు…’ ఇలా ట్రోలింగ్ బాగా సాగింది… ఈ దెబ్బ సెన్సారోళ్ల మీద బాగానే పడింది… ఇప్పుడు కళ్లు తెరుచుకుని మరీ సినిమాల్ని చూస్తున్నారు… అక్షయ్ కుమార్ కొత్త సినిమా ఓఎంజీ-2 రాబోతోంది కదా… అదీ దేవుళ్లు, పూజారుల మీదే ఉంటుందట…
ఆదిపురుష్‌తో బండబూతులు తిన్నందుకు థూ మనజీవితం పాడుగాను అనుకున్న సెన్సార్ ఈ సినిమాకు నేరుగా సర్టిఫికెట్ ఇవ్వకుండా రివిజన్ కమిటీకి పంపించింది… కొన్ని డైలాగుల్ని మ్యూట్ చేయడం లేదా కట్ చేయడం అవసరమని ప్రాథమికంగా సెన్సార్ ఫీలైందట… కానీ అదేదో రివిజన్ కమిటీ చెబుతుందిలే అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నారట… ఏమోలెండి, సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరిస్తే కోర్టులు లేవా..? అవునూ… దీన్ని కూడా పవన్ కల్యాణ్, వెంకటేష్ గోవింద గోవింద అనే పేరుతో రీమేక్ చేస్తారంటారా..? అప్పట్లో గోపాల గోపాల తీశారు కదా… ఇప్పుడు తెలుగులో రీమేక్ శకం నడుస్తోంది కదా…!!
Share this Article