హిడింబ… అంటే అర్థమేంటి..? అదొక పేరు… మహాభారతంలో హిడింబాసురుడు… అడవుల్లోకి పారిపోయిన పాండవులను హతమార్చి తినాలని ప్రయత్నిస్తాడు… చివరకు భీముడి చేతుల్లో హతమవుతాడు… ఆ హిడింబాసురుడి చెల్లె హిడింబి… భీముడినే పెళ్లి చేసుకుంటుంది… వాళ్ల కొడుకే ఘటోత్కచుడు… ఇదీ భారతంలోని కథ… మరి హిడింబ అనే సినిమా కథకూ ఈ భారత కథకూ లింక్ ఏమిటి..? ఏమీ లేదు…
ఈ సినిమా కథలోనూ నరమాంస భక్షకులుంటారు… ఆ హిడింబ కథలోనూ నరమాంస భక్షకులుంటారు… అదొక్కటే పోలిక… మరి ఈ హిడింబ అనే టైటిల్ ఎలా ఆప్ట్ అవుతుంది అంటారా..? భలేవారే… సినిమా టైటిల్‌కూ కథకూ లింక్ లేకపోవడమే కదా ప్రజెంట్ ట్రెండ్… నోరు తిరగని తమిళ పేర్లను యథాతథంగా తెలుగు వెర్షన్లకు ఉంచేయడం లేదా ఏం..? జనం చూడటం లేదా…?
మన దేశ పరిధిలోని దీవుల్లో నరమాంస భక్షకులున్నట్టు పెద్దగా చారిత్రిక ఆధారాలు, అంటే నిరూపిత ఆధారాలు లేవంటారు… చివరకు ఆమధ్య వార్తల్లో నిలిచిన సెంటినలీస్ కూడా నరమాంస భక్షకులు కాదు… సరే, ఈ దర్శకుడు ఏదో చెప్పి నరభక్షకులున్నట్టు నిరూపించే ప్రయత్నం ఏదో చేయబోయాడు… సరే, కథ అంటే కథే… కల్పనే కదా… కానీ ఈ కథను కూడా స్ట్రెయిట్‌గా చెప్పకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో… అంటే ఒక సీన్ ఫ్లాష్ బ్యాకులో, మరో సీన్ వర్తమానంలో నడుస్తూ ఉంటుంది… అది ప్రేక్షకులకు సులభంగా ఎక్కదు… ఈ హిడింబ సినిమాకు అదే పెద్ద మైనస్…
Ads
నిజానికి కొత్త ప్రయోగాలు, కొత్త కథలు, కొత్త ట్రీట్‌మెంట్‌తో ఏదైనా సినిమా వస్తే స్వాగతించాలి… రొటీన్, ఇమేజి బిల్డప్పులకు భిన్నంగా చిన్న ప్రయోగమైనా సరే ఆహ్వానించాలి… కానీ ఇందులో పాటలు మైనస్… ఒక్క బీజీఎం మినహా మిగతాది ఏదీ ఎక్కదు సరిగ్గా… ప్రత్యేకించి కథనమే బోరింగ్… అన్నింటికీ మించి జాంబీ తరహా రక్తాలు, హింస అధికంగా, బీభత్సంగా ఉంటే ప్రేక్షకుడు పెద్దగా ఇష్టపడటం లేదు… ట్రీట్‌మెంట్ సమయంలో ఇది గుర్తించనట్టున్నాడు దర్శకుడు…
ఈ సినిమాలో చెప్పుకోదగింది హీరో గురించి కూడా కాదు… కేవలం హీరోయిన్ గురించే..! నందిత శ్వేత… తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు, చివరకు అదేదో ఈటీవీ షోలో కూడా జడ్జిగా చేసింది… ఎప్పుడూ ఏదో కొత్త విషయంతో యూట్యూబర్లు ఆమెను వార్తల్లో ఉంచుతుంటారు… రీసెంటుగా కూడా ఈ సినిమా ప్రమోషన్లలో తనకు సమంతలాగా ఏదో వ్యాధి ఉన్నట్టు చెప్పుకుంది… కానీ ఏమాటకామాట… ఈ బెంగుళూరుకు చెందిన నటి అందగత్తె, నటన తెలుసు… ఈ సినిమాలో ఆమే హైలైట్…
మన తెలుగు టీవీ సీరియళ్లన్నింటిలోనూ కన్నడ తారలే ప్రధాన పాత్రల్లో కనిపిస్తుంటారు… కానీ ఈ కన్నడ నటికి మాత్రం తెలుగు సినిమాల్లో పెద్దగా చాన్సులు రావడం లేదు ఎందుకో మరి…! సినిమా కథ విషయానికి వస్తే… హీరోయిన్ ఐపీఎస్, హీరో డీఎస్పీ… పూర్వాశ్రమంలో లవర్స్, తరువాత బ్రేకప్… ప్రత్యేకించి ఎర్ర దుస్తులు వేసుకున్న అమ్మాయిలు వరుసగా మాయమవుతున్న కేసులో దర్యాప్తుకు మళ్లీ ఈ ఇద్దరూ కలుస్తారు… తరువాత కేసులో ట్విస్టులు, ఇక్కడి నుంచి నరభక్షుకులున్నచోటకు పరుగు తీస్తుంది కథ… అదీ లేటుగా… ప్చ్, ఇంకాస్త ఎడిటింగ్ బాగా జరిగి, ఇంకాస్త గ్రిప్పింగుగా ఉంటే… హింస తగ్గించి ఉంటే… సినిమా ప్రేక్షకులను రప్పించేదేమో…
Share this Article