నంబర్ టూలు అలా తెరమరుగయ్యారు… కనిపించని దేవేందర్ గౌడ్ … వినిపించని నాగం … జర్నలిస్ట్ జ్ఞాపకాలు –
——————————————-
ఆఁ చెప్పండి సార్, నాగం జనార్దన్ రెడ్డిని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా పావుగా వాడుకుంటున్నాడు, వాళ్ళ వ్యూహం ఏమిటీ ? నాగం , జగన్ మోహన్ రెడ్డి కలిసి బాబును ఎలా దెబ్బ తీయబోతున్నారు అంటూ ఆ జర్నలిస్ట్ ఫోన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించేసరికి వామ్మో అని మనసులోనే అనుకుని .. చదువుల సారమెల్ల గ్రహించితిని తండ్రీ అని హిరణ్యకశ్యపుడికి చెప్పిన ప్రహ్లదుడు గుర్తుకు వచ్చి .. బాబూ నీకు ఇంకొకరు జర్నలిజం పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు . టీవీలకు నీలాంటి వారే కావాలి .. నీకు తిరుగులేదు . నువ్వు జర్నలిస్ట్ గా పుట్టుకతోనే తలపండిన వాడివి అని చెప్పి ఫోన్ కట్ చేశాను .
Ads
******
దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగింది ఇది . హెచ్ఎంటివిలో ముక్కామల చక్రధర్ అని జర్నలిస్ట్ మిత్రుడు ఉండేవారు . భూమి నుంచి బయటకు వెళ్లి హెచ్ఎంటివిలో చేరాడు . ఓ రోజు ఫోన్ చేసి మా ఛానల్ లో కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ ఒకడున్నాడు . అతనికి పొలిటికల్ రిపోర్టింగ్ ఆసక్తి . మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు అని చెప్పాడు . రాజకీయ వార్తల కోసం నీతో మాట్లాడుతాడు , కాస్త సలహా ఇవ్వమని చక్రధర్ చెబితే , సరే కాల్ చేయమని చెప్పాను. అతని పేరు గుర్తు లేదు కానీ మాట్లాడిన మాటలు గుర్తున్నాయి .
బాబును మీడియా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రోజులు అవి . బాబు కోసం ఎన్టీఆర్ ను సైతం ఎదిరించి మీడియా వెలిగిపోతున్న రోజులు . ఓవైపు తెలంగాణ ఉద్యమం ఉదృతం అవుతూ , టీడీపీ బలహీన పడుతోంది . దాంతో తెలంగాణ టీడీపీ నాయకులు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు . భవిష్యత్తు ఏమిటా ? అనే ఆలోచన వారిని వెంటాడుతుంది . అప్పటివరకు తెలంగాణ తానే నంబర్ టూ అని భావిస్తున్న నాగం జనార్దన్ రెడ్డికి దిక్కు తోచని పరిస్థితి . జేఏసీ నాయకునిగా ప్రొఫెసర్ కోదండరాంను కెసిఆర్ ముందుకు తీసుకురావడం , రోజూ కోదండరాం మీడియాలో కనిపించడంతో నాగంను ఆందోళనకు గురి చేసింది . కోదండరాం తెలంగాణలో బలమైన రెడ్డి నాయకునిగా వెలుగులోకి వస్తున్నాడు అని ఓసారి ఇష్టాగోష్టిలో చెప్పుకొచ్చారు .
టీడీపీలో ఉండలేడు , తెరాసలో చేరలేడు .. మరేం చేయాలో స్పష్టత లేదు . శాసనసభలోనే బాబు విధానాలపై విమర్శలు చేసి కలకలం సృష్టించి , తిరిగి బాబు పక్కనే కూర్చొని ముచ్చట్లు పెట్టడంతో సీరియస్ నెస్ పోయింది . ఈ దశలో మీడియాలో బోలెడు వార్తలు . నాగంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డే తిరుగుబాటు చేయిస్తున్నాడు అనేది మీడియా వార్తల సారాంశం . నాగం , జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ రెడ్డి నాయకులే ఈ ఒక్కటి తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి సామీప్యం లేదు . తెలంగాణకు చెందిన నాగం , సమైక్యాంధ్రను కోరుకుంటున్న జగన్ చెప్పినట్టు ఎందుకు చేస్తారు ? చేస్తే అతనికి ఏ విధంగా ప్రయోజనం అనేది మీడియాకు అనవసరం , అంత ఆలోచించే ఓపిక లేదు . జగన్ చెబితేనే నాగం తిరుగుబాటు అంటే సరిపోతుంది . చాలా ఛానల్స్ లో, పత్రికల్లో ఇలానే వార్తలు వచ్చాయి .
హెచ్ఏంటివి నుంచి ఫోన్ చేసిన కుర్ర జర్నలిస్ట్ నాగం విషయం ఏమిటీ అని ప్రశ్నిస్తే ఇది చెప్పేవాడిని , కానీ అతను ఫోన్ చేసి నాగం , జగన్ కుమ్మక్కు కుట్ర అని అతనే చెబుతుండడంతో ఇలాంటి వారికి చెప్పి వృధా అనుకుని, నువ్వు అనుకుంటున్న విషయంతోనే ఛానల్ కు స్టోరీ చేసేయ్ అని చెప్పాను …
టీడీపీలో దశాబ్దాల పాటు తెలంగాణకు సంబంధించినంత వరకు నంబర్ 2 గా అధికారం చెలాయించి తెలంగాణ ఉద్యమంతో ఎటు పోవాలో తెలియక , తెలంగాణ కోసం మొదట సొంత సంస్థ , తరువాత బిజెపి అటు నుంచి కాంగ్రెస్ లో చేరారు . నాగం చెప్పలేదు , దేవేందర్ గౌడ్ చెప్పారు . మేం నంబర్ 2 గా ముందు వరుసలో ఉంటే కెసిఆర్ మూడవ వరుసలో ఉండేవారు , మేం తెరాసలో చేరి కెసిఆర్ నాయకత్వంలో పని చేయడం ఏమిటీ, అందుకే అటు వెళ్లడం లేదు అని దేవేందర్ గౌడ్ చెప్పారు . నాగం మంత్రి అయినప్పుడు బహుశా రేవంత్ రెడ్డి విద్యార్ధి కావచ్చు . ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీపీ అధ్యక్షుడు కాగా , నాగర్ కర్నూల్ నాయకునిగా నాగం కాంగ్రెస్ లో ఉన్నారు . నాగంకు నాగర్ కర్నూల్ టికెట్ కూడా గ్యారంటీ అని చెప్పలేం .
అచ్చిరాని నంబర్ 2
రాజకీయాల్లో నంబర్ 2 లు ఎప్పుడూ నంబర్ వన్ లకు అచ్చిరారు . అలానే నంబర్ 2 లకు కూడా నంబర్ వన్ ల నుండి గండం తప్పదు . ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని జిల్లాలో, దాదాపు అంతమంది నంబర్ 2 లు ఉండేవాళ్ళు . వీళ్ళలో కొందరు నంబర్ వన్ చేతిలో , కొందరు కాల ప్రవాహంలో కొట్టుకు పోయారు . నాదెండ్ల కో- పైలట్ ను అని వెన్నుపోటుతో బయటకు వెళ్లారు . అలా నంబర్ 2 అనుకున్న దగ్గుబాటితో సహా చాలా మందిని బాబు విజయవంతంగా బయటకు పంపారు . ఆ దశలోనే రాష్ట్రంలో ఒక నంబర్ 2 వద్దు , జిల్లాకో నంబర్ 2 ఉండాలి అని బాబు అలా మాధవరెడ్డి , నాగం , దేవేందర్ గౌడ్, అలా జిల్లా కొక నంబర్ 2ను ప్రోత్సహించారు .
తెలంగాణ ఉద్యమ సమయంలో దేవేందర్ గౌడ్ ఓ రోజు… మేం ముందు వరుసలో ఉంటే కెసిఆర్ మూడవ వరుసలో ఉండేవారు . నేను అతని నాయకత్వంలో ఎలా పని చేస్తా అంటూ ఎన్టీఆర్ భవన్ లో బాధపడ్డారు . మీరు మంత్రి కాక ముందు మీ జిల్లాలో వెలిగిపోయిన కాంగ్రెస్ నేతలు మారిన కాలంలో తెరమరుగు అయ్యారు. టివి 9 రవిప్రకాష్ సుప్రభాతంలో 3వేల జీతంతో పని చేసేప్పుడు నాకు భూమిలో అంతకు రెట్టింపు జీతం . ఇప్పుడు ఏమిటీ ? అనేది ముఖ్యం కానీ గతంలో నేను ఇది నువ్వు అది అంటే కుదరదు . సంపాదకుడిగా ఓ వెలుగు వెలిగిన పతంజలి రవిప్రకాష్ వద్ద పని చేశారు . ఈ రోజు ఏమిటీ అనేది ముఖ్యం కానీ నేను పైన ఉన్నప్పుడు కాలం అలానే ఆగిపోవాలి అని చాలా మంది కోరుకుంటారు . అది సాధ్యం కాదు . కాలం ఆగదు .
టీడీపీలో ఉండలేక , కాంగ్రెస్ లోకి వెళ్లలేక , తెరాసలో చేరే ఇష్టం లేక దేవేందర్ గౌడ్ తీవ్రంగా మథనపడ్డారు . ఆ దశలో కొందరు మేధావులకు ఆయన చిక్కి పోయారు . తెలంగాణ పేరుతో ఓ పార్టీ పెట్టారు . చిరంజీవి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు . బోర్డుల మీద , వాహనాల మీద టిజి అని రాస్తే తెలంగాణ వస్తుందా ? ఇదేం ఉద్యమం అని అడిగితే .. ఎప్పుడు పెద్ద గడ్డంతో ఉండే ఓ మేధావి పేరు చెప్పి అతని సలహా … ఇంకా వీటి పేర్లు మార్చాలి అని చెప్పాడో గుర్తు చేసుకున్నారు . రాజకీయంగా సంక్షోభ పరిస్థితి ఎదుర్కొని మానసికంగా దెబ్బ తిని , అనారోగ్యం పాలయ్యారు . నిజానికి రాజకీయాల్లో మంచి అభ్యుదయకరమైన ఆలోచనలు ఉన్న కొద్ది మంది నాయకుల్లో దేవేందర్ గౌడ్ ఒకరు . సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక దెబ్బ తిన్నారు . ఆ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో నంబర్ 2 ల శకం ముగిసింది …. – బుద్దా మురళి
Share this Article