Dying Declaration: ప్రపంచ జంతు ప్రేమికులారా! బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని అన్నమయ్య పరవశించి పాడిన సంగతి మీకు తెలియనిది కాదు. చీమ నుండి బ్రహ్మ వరకు ప్రాణం ఏదయినా ప్రాణమే. అన్నిట్లో ఉన్నది ఆ పర బ్రహ్మమే.
ఇన్ని మన్వంతరాలలో, ఇన్ని యుగాల్లో ఇలా పులులు మరణ వాంగ్మూలం రాయడం మీకు వింతగా అనిపించవచ్చు కానీ…చరిత్రలో పులి చంపిన లేడి నెత్తురే కాకుండా…సంఘం చంపిన పులుల నెత్తురు కూడా రికార్డ్ కావాలన్న సదుద్దేశంతో బరువెక్కిన గుండెతో పదునెక్కిన గోళ్లతో ఈ లేఖ రాస్తున్నాం.
ఆఫ్రికాలో మా మానాన మేము వేళకు పది కేజీల నెత్తురోడే పచ్చి మాంసం తిని త్రేంచి విశ్వ శ్రేయస్సు గురించి ఆటవిక కలలు కనే వాళ్లం. ‘అడవి కాచిన వెన్నెల’ అని మా ఏరియాల్లో వెన్నెల కూడా కాయకూడదనుకునే, కాచినా అది నిరుపయోగం అనుకునే మీ ఏరియాల్లో గాజు గదుల్లో మర బొమ్మల్లా మమ్మల్ను మీరు చూడాలనుకున్నప్పుడే మా ఆత్మాభిమానాలు మంట కలిశాయి. మధ్యప్రదేశ్ కునో అడవి పేరుకే 750 చదరపు కిలోమీటర్ల వైశాల్యపు అడవి. మా ప్రతి కదలికను పసిగట్టే వ్యవస్థలు; ప్రతి పది కిలో మీటర్లకు ముళ్ల కంచెలు; అన్నిటికీ మించి మా మెడలకు ఉరితాడు లాంటి రేడియో కాలర్లతో మేము అండమాన్ కలాపానీ భూగర్భ ఇనుప గోడల గదుల్లో ఉన్నట్లు ఉంది తప్ప…మాకలవాటయిన అడవిలో స్వేచ్ఛగా ఉన్నట్లు అనిపించలేదు.
Ads
ఒకదాని తరువాత ఒకటి…ఆఫ్రికా నుండి వచ్చిన ఇరవైలో ఇప్పటికి ఎనిమిది పులులు పునరావృత్తి రహిత శాశ్వత ఉజ్జయినీ మహాకాళేశ్వర శివ సాయుజ్యం పొందాయి. మిగతావి కూడా కాళేశ్వరుడిలో కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
మా మరణాలకు బాధ్యులను చేస్తూ కునో అటవీ ఉన్నతాధికారులను ఎనిమిది మందిని ప్రభుత్వం సస్పెండ్ చేయడం మాకు బాధగా ఉంది. మా ఖర్మ కాలి కర్మభూమికి వచ్చి ధర్మంగా చచ్చామే కానీ…అటవీ అధికారుల అజాగ్రత్తతో అధర్మంగా చావలేదు. వారు మాకు వేళకింత మాంసమే పెట్టారు తప్ప…పులికి ప్రాస కుదిరిందని పులిహోర పెట్టలేదు.
మా కళ్లకు గంతలు కట్టి, మాకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి విమానాల్లో, హెలీకాప్టర్లలో తెచ్చి…అతిరథ మహారథులందరూ కెమెరాలు పట్టుకుని ఫోటోలు తీస్తుండగా…మమ్మల్ను కంట్రోల్డ్ ఏరియాల్లో వదిలినప్పుడే మేము పిల్లులం అయిపోయామని మాలో మేము తర్కించుకుని తేల్చుకున్నాం. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకున్నట్లే మేము కూడా అడవుల్లో కళ్లు తెరిచి జంతువులను తింటూ ఎవరూ చూడలేదని అనుకున్నాం. పిల్లి కళ్లు మూసుకున్నా, పులి కళ్లు తెరిచినా మనిషి కంట్లో పడితే ఇంతే సంగతులని మాకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది.
“ఏ పులి మేకను రక్షిస్తుంది?”
అని అభ్యుదయ, విప్లవ కవితలు రాసిన మీరు ఎప్పుడయినా…
“ఏ పులిని ఎవరు పిల్లిని చేశారు?”
“ఏ పులికి ఎవరు సింహ స్వప్నమయ్యారు?”
అన్న వ్యాఘ్ర సహృదయ సన్నివేశ ఆవేశంతో కనీసం చిట్టి హైకూ కవితలయినా రాశారా? లేదే!
ఇరవైలో ఎనిమిది పోగా మిగిలిన పన్నెండు పులులను మళ్లీ మా నేటివ్ ఏరియా ఆఫ్రికా అడవుల్లో వదలాలని మీ రాతి గుండెలకు అనిపించదు. గుండెలు తీసిన బంట్ల కంటే కఠినమయిన మీ గుండెలు కరుగుతాయన్న ఆశ మాకు ఏ కోశానా లేదు.
అడవిలో అంత పర్వతం లాంటి గజరాజు కూడా మా వాడి గోళ్ల పులి పంజా తగిలితే…పంజరంలో చిలుకలా గిజగిజలాడి గజగజ వణికిపోయేది. ఇప్పుడు కాన్వెంటు పిల్లల మెడకు బిగించిన టై లా మా మెడలకు బిగించిన రేడియో కాలర్లను చూసి సాటి జంతువులు కుక్కలు, నక్కలు కూడా నవ్వి పోతున్నాయి. థూ! మా బతుకు చెడ! అని కసి తీరా మమ్మల్ను మేము తిట్టుకోవడానికి కూడా మెడ తాడు అడ్డుపడుతోంది.
అంతరించిపోయే పులులను మీరు రక్షిస్తున్నారో? లేక పులులు అంతరించేదాకా వదలం అని పంతం పట్టి…మా అంతం కోసం వెంట పడుతున్నారో? మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకుని…మీకు మీరే తేల్చుకోండి.
ఇట్లు…
పూర్తి స్పృహ కోల్పోక ముందే స్పృహలో ఉండి మాకు మేము ఇష్టపూర్వకంగా రాయించి...గోళ్ల వేళ్ళతో స్వయంగా సంతకం చేసిన రక్తాక్షర మరణ వాంగ్మూలమిది. మా చీతాల చితా భస్మాన్ని మధ్యప్రదేశ్ పవిత్ర నర్మదలోనే కలాపాలన్నది మా చివరి కోరికగా పరిగణించగలరు.
(వరుసగా పులుల సంతకాలు)
తేదీ- 20 -07- 23
ప్రదేశం- కునో వనం
రాష్ట్రం- మధ్యప్రదేశ్
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article