నార్సింగి : ఒక పర్యావలోకనం…. పాత జీవితం స్థానే కొత్త జీవితానికి, అందలి సౌందర్యానికి అలవాటు పడటానికి కొన్నేళ్ళు పడుతుంది.
దాదాపు పదిహేనేళ్ళు ముషీరాబాద్ డివిజన్ పరిధిలోని పార్సిగుట్ట, గంగాపుత్ర కాలనీ, రాంనగర్ పరిసరాల్లో నివాసం ఉంటూ ఆ వీధులు, సంధులు, అక్కడి మనుషులు, వారి జీవన సరళి, దినమంతా వచ్చి పోయే వివిధ చిరువ్యాపారులు, వీటితో కూడిన ఎన్నో జీవన ఛాయల్ని చిత్రించిన వైనం దాదాపు ఒక పుష్కర కాలంగా మిత్రులు చూస్తున్నదే. ‘మై సిటీ మై పీపుల్ పేరిట’ ప్రధానంగా పోస్టు చేసినవి అక్కడి చిత్రాలే. అదే ప్రాంతంలో దాదాపు ఆరేళ్ళు మహిళా మణులు సంక్రాతి సమయంలో తమ వాకిళ్ళలో పండించిన ఉదయ రాగాలను కొన్నింటిని ఏర్చి కూర్చి ‘చిత్రలిపి’ పేరిట ‘మగువ కానుక’గా ఒక ప్రత్యేక ప్రదర్శన పెట్టిన సంగతి కూడా తెలిసిందే. చిత్రమేమిటంటే అక్కడ జీవితం ఉధృతం, విస్తృతం.
అన్ని వీధులూ రోమ్ లో కలుస్తాయన్న నానుడిలా రాంనగర్ పరిసరం ఒక తెలంగాణా కేంద్రం. అక్కడ శ్రీకాకుళంతో సహా ఇతర జిల్లా వాసులు ఉన్నప్పటికీ అది నిత్య సంబురమైన ‘బతుకమ్మ’. జ్యోతిష్యం చెప్పే కోయవాళ్ళతో సహా భాగ్యనగరంలోని ప్రతి ఇంటా ఉండే చీపిర్లకు మూలమైన ఎన్నో కుటుంబాలు అక్కడే నివాసం ఉన్నవి. ఇట్లా చాలా జీవితం, సన్న జీవులు మొదలుగా ఉన్న వలస కూడలీ ప్రస్థానం అక్కడి ప్రత్యేకతగా చెప్పాలి. అక్కడినుంచి పుప్పాల గూడకు ఇల్లు మారాక ఒక్క పరి ఛాయా చిత్రలేఖనం కుదుపుకు గురవుతుందేమో అన్న శంక ఉండింది. కానీ అదృష్టవశాత్తూ ఇక్కడా గ్రామం నిండుగా ఉంది.
Ads
పుప్పాల గూడ ఆదివారం మార్కెట్ కొన్ని గ్రామాల నిలయంగా కానవచ్చి మొదటే నన్ను శాంతింప జేసింది. అదీ మొదలు ఇక అటు పుప్పాలగూడ నుంచి మణికొండ, లాంకో హిల్స్ సమీపంలోని మర్రిచెట్టు జంక్షన్ , తర్వాత పంచవటి కాలనీ ఆ తర్వాత మా గ్యాలరీ ఉండే ఓయూ కాలనీ, షేఖ్ పెట్ దర్గా దాక – ఇటువైపు పుప్పాల గూడ ఈవల ఉన్న నార్సింగి దాకా, మధ్యలో మా వెనకాలి అలకాపురి, నార్సింగి దాటాక వెళ్ళాలి అనిపిస్తే ఔటర్ రింగు రోడ్ జంక్షన్ దాకా వెళ్ళడం ఒక ఆటవిడుపు. ఇష్టముంటే మంచి రేవుల దాక – అటు గండిపేట దాక. ఇట్లా, ఛాయా చిత్రకారుడిగా ఇది నా స్థానిక వైశాల్యంగా మారింది.
మెల్లగా ఈ మొత్తం ప్రాంత నూత్న శోభకు ఆకర్షితుడినయ్యాను. ఒక రకంగా ‘పాత ఒక కొత్త’గా ఇదంతా నాకు పరిచయం అవసాగింది. ముఖ్యంగా నార్సింగి ఒక యాదవ పట్టణంలా ఉంటుంది. ఆవులూ గేదలు మేకలతో కూడి హాయిగా నిద్రపోయే పల్లెటూరును గుర్తు చేస్తుంది. నిద్రలేస్తే ఇది మెల్లగా పట్టణంగా మారుతుంటుంది.
కొత్తగా వచ్చిన అపార్ట్ మెంట్లూ, గేటెడ్ కమ్యూనిటీలు ఎత్తుగా నిలబడితే కింద అంతా విశాలంగా ఎప్పటి నుంచో ఉన్న ఊరుగా ఉండే ప్రాంతం ఇంకా స్థిరంగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ వీధి శునకాలే కాక పందులూ ఉన్నాయ్. స్థాయి భేదాలు ఉన్నప్పటికీ అక్కడ చాలా మంది నిదానమే ప్రధానంగా బరుకుతున్నట్లు అనిపిస్తుంది. ఇంటి ముందు నిలిపిన కొత్త కార్లతో పాటు ఎదో ఒక ఆలయం పక్కన వాడని పాత కార్లు, అక్కడక్కడ అంబాసిడర్ కార్లూ కనిపిస్తాయి. ఒక మూడు నాలుగు పురాతన గూన పెంకుల ఇండ్లు ఇంకా ఉన్నాయి. అక్కడ ఒక ముసలమ్మ కట్టె పట్టుకుని కూర్చొని దేన్నో అదులిస్తూ ఉంటుంది. తలెత్తి చూస్తే ‘మై హోం’ వారి ‘అవతార్’ కూడా కనపడుతూ ఉంటుంది.
అన్నట్టు, నార్సింగి గండిపేట మండల పరిధిలో ఉంటుంది. ఒకనాటి మేజర్ గ్రామ పంచాయతీ నాలుగేళ్ళుగా మున్సిపాలిటీగా మారింది. ఇది రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. పద్దెనిమిది వార్డుల పట్టణం ఇది. ఆధునికత కన్నా జానపదమే ప్రధానంగా కానవచ్చే ఈ ప్రాంతం, అది నా మనసుపై ముద్ర వేసిన రీతిని వర్ణాల్లో పంచుకోవాలంటే, అది తెలుపు, పసుపు, ఆకుపచ్చ. పండుగల్లో చెప్పాలంటే ఒక బోనాల. మరో పీర్ల పండుగ. సదర్ ఉత్సవం కూడా.
దాదాపు ఐదేళ్ళుగా ఇక్కడి బతుకమ్మ పండుగ చిత్రిస్తున్నాను. చాలా మంది అక్కలు నన్ను గుర్తు పడతారు. నార్సింగి చౌరస్తా దగ్గర ఉన్న పాత బావి ఒక వారసత్వ సంపద. దాన్ని ఈ ఏడే చూశాను. అక్కడ బతుకమ్మ నిమజ్జనం కన్నుల పండుగ. తర్వాత చొరస్తాలో ఆటా పాట ఒక కోలాహలం. అందులో మార్వాడీ మహిళలూ చేరి స్థానిక మహిళలతో ఆడి పాడుతారు. ఉదయాలు సాయంత్రాలు వాళ్ళు పాలు అమ్మే దృశ్యాలు చూస్తుంటాను. అవి ఎన్నటివో పాత రోజుల్లోకి తీసుకెళ్ళి పాల నురుగు వంటి మంచి జ్ఞాపకాలను కొన్ని మనసుకు అద్దుతాయి. వాళ్ళ తెల్ల బనీన్లు, పిల్లల ఆధునిక పోకడ అంతా గతం వర్తమానం పాలు నీళ్ళలానే కలిసిపోయినప్పటికీ పాలు ఎక్కువ, కొద్దిగా నీళ్ళలా మనసుకు నిమ్మళం అనిపిస్తుంది.
రియల్ ఎస్టేట్ కారణంగా ఇక్కడి భూములు కొంచెం అమ్మగా కోటీశ్వరులైన యాదవుల్లో ఒక పెద్దమనిషి ఇప్పటికీ గొర్లు కాసుకుంటూ పోవడంలో ఆనందం పొందడాన్ని చూస్తాం. పసుపు పచ్చటి ఆకులతో పసిడిని తలపించే ఒక చెట్టు కిందుగా నడిచి వెళ్ళే మేకల్లో ఒక పరధ్యానం వంటిదే ఆయనలో ఉన్నట్టు కూడా అనిపిస్తుంది.
ఇక్కడ భాగ్యనగరం ప్రత్యేకత ఐన గంగా జమున తహజీబ్ మిశ్రమం మరో చూడ ముచ్చటైన విశేషం. వీధుల్లో ముస్లిం ఆజా ఒకటి హిందువుల ఇంటికి వినవస్తుంది. మహిళలు, పిల్లల జీవన సంబురం ముచ్చట గొలుపుతుంది. ప్రధాన రోడ్డుతో సహా ఇప్పుడు లింకు రోడ్లు కూడా సిమెంట్ రోడ్లుగా మారినప్పటికీ దేవాలయాల ముందు సాన్పు పచ్చగా మెరుస్తుంది. వీధుల్లో లాంగ్ షాట్ లో కదిలి పోతున్న ఒకరిద్దరు బురఖాలో ఉన్న మహిళలు, చేసంచితో ఆగి ముచ్చట పెట్టే ఆ వనితలు, అక్కడక్కడా పెద్ద కూర అమ్మే షాపులలో వేలాడుతున్న సగం మిగిలిన మాంసం. కొనుక్కోవడానికి నిలుచున్న ఒకరిద్దరు, అరుగుల మీద కూచుండే పెద్ద మనుషులు. తలపై టోపీలు ధరించే పిల్లలు. అంతా ఒక పాత శోభ. సంక్షిప్తీకరిస్తే, ఈ ఊరు నిమ్మళంగానూ తనదైన కోలాహలంతోనూ ఒక ఇరాన్ సినిమా వంటి అనుభూతిని పంచిపెడుతుంది.
నార్సింగి మరో ప్రత్యేకత పశువుల అంగడి. శుక్రవారం జరిగే మార్కెట్ దగ్గర ఏడాది క్రితం ఆవుదూడ విగ్రహం ప్రతిష్టించారు. అక్కడి దాకా వెళ్లి దాని చుట్టూ రౌండ్ కొడుతుంటే అక్కడ లేబర్ అడ్డా మీద వందలాది వలస జీవులు. స్త్రీపురుషులు. నగరం అంటే వలస కూడలి అని గుర్తు చేయడానికా అన్నట్టు. అదే సమయంలో స్నేహానికి మిత్రుత్వానికి చిహ్నంలాగా కూడా పని దొరకే దాకా అట్లా కూచుండి వారి ఆత్మీయ ముచ్చట్లు. అక్కడొక చిత్రం తప్పక చేస్తాను. అందులో ఒకానొక వేదనాభరిత ఎదురీత దాగి ఉండటం సహజం.
మళ్ళీ మెల్లగా ఇంటిముఖం పడుతుంటే, దారిలో ఒక గురుకుల సంక్షేమ కాలేజీ కూడా ఉంటుంది. అందులో స్కూల్ కూడా ఉంది. అక్కడ బిడ్డను దించి వెళుతున్న ఒక బక్క చిక్కిన తండ్రి కనిపిస్తాడు. రేపటి భవిత గురించి ధీమా ఒకటి అతడిలో కాన వస్తుంది. అది చూస్తూ ఇంటికి చేరేటప్పటికి తొమ్మిది అవుతుంది. కానీ అప్పటికీ ఒక రోజు గడించినట్లు ఉంటుంది. మిగతా రోజంతా బోనస్ అనే అనిపిస్తుంది. పాత నగరం కొత్త నగరం సందర్శించి వచ్చినట్టు అనిపిస్తుంది.
ఇంటికి వచ్చాక హార్డ్ డిస్క్ లోకి ఒక పది చిత్రాలు కొత్తగా చేరుతాయి. అందులో ఇది వరకు ఎన్నడూ చూడని, నేనే తీశానా అన్నటువంటి చిత్రం ఒకటి తప్పక ఉంటుంది. అందులో బాధ కన్నా సంబురం ఒకటి కట్టి పడేసేది నిశ్చయంగా ఉండటం నన్ను తిరిగి తిరిగి ఈ బొమ్మలను దించేలా చేస్తుంది. పట్టణంలో బ్రతుకుతున్న ఈ ఊరు ఇక మా ఊరే అనిపిస్తుంది. ఇది నా సెలబ్రేషన్. దాదాపు ప్రతి రోజూ తాలూకు పర్యావలోకనం ఇది…. —- కందుకూరి రమేష్ బాబు… Samanyashastram Gallery
Share this Article