రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు ఉంటాయి . డ్రామాలు ఉంటాయి . సినిమాలో హీరో ఎవరో ? విలన్ ఎవరో ముందే తెలిసి పోతుంది . శుభం కార్డు పడిన తరువాత కూడా హీరో ఎవరో విలన్ ఎవరో రాజకీయాల్లో అస్సలే తెలియదు . బాబు కోణం నుంచి సినిమా చూస్తే ఆగస్టు కుట్రలో బాబు హీరో , ఎన్టీఆర్ క్యారక్టర్ ఆర్టిస్ట్ . అదే సినిమాను ఎన్టీఆర్ కోణం నుంచి చూస్తే ఎన్టీఆర్ హీరో , బాబు విలన్ . ఒక్క బాబే కాదు కుటుంబం మొత్తం విలన్ .అనుమానం ఉంటే జామాతా దశమ గ్రహం వీడియో వినవచ్చు .
సినిమాల్లో ఫలానా వ్యక్తి విలన్ అని ప్రేక్షకులకు తెలిసి పోయాక చివరి వరకు విలన్ గానే ఉంటాడు . రాజకీయాల్లో అలా కాదు ఒక పాత్ర ఒకసారి విలన్ అనిపించవచ్చు . కొంత కాలం గడిచాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనిపించవచ్చు . ఒకసారి దుష్టుడు అనిపించిన పాత్ర కాలం గడిచాక బాధితుడు పాపం అనిపించవచ్చు . అలాంటి ఓ బాధితుడిని టీడీపీనే శిక్షించింది , అక్కున చేర్చుకుంది . అతను విలనా ? బాధితుడా ? అంటే ఏమో ?సినిమాల్లో ఈజీగా చెప్పవచ్చు కానీ రాజకీయాల్లో చెప్పడం అంత ఈజీ కాదు .
****
Ads
ఒక మంత్రి లంచం తీసుకుంటున్నాడు అని అదే పార్టీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని … ఏసీబీకి అప్పగించడం దేశంలో మొదటిసారి, చివరిసారి . ఐతే అలా పట్టుపడిన మంత్రికి ఎంపీగా టికెట్ ఇవ్వడం విన్నారా ? అంతేనా, మొత్తం ఊరిని బ్యాంకులో తాకట్టు పెట్టిన వ్యక్తి .. అక్రమాలు బయటపెట్టడానికి వెళితే గుర్రాలతో వెంటాడి దాడి చేశాడు అంటూ మీడియా ముందు గగ్గోలు పెట్టిన బాబు అదే నేతకు ఎంపీగా టికెట్ ఇచ్చారు . ఇలాంటి వింతలు , సినిమాలను మించిన నాటకీయ పరిణామాలు ఎన్నింటికో మీడియా సాక్షిగా నిలిచింది
ఎన్టీఆర్ ను దించేసిన కొద్ది రోజులకే 1996 పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి . అప్పటికే రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి అని చంద్రబాబు నాయుడు అనేక మీటింగ్ లలో చెప్పుకుంటూ వస్తున్నారు . ఆయన్ని వ్యతిరేకించేవారు ఉన్నట్టే .. రాజకీయాల్లో విలువలకు పట్టం కడతారు అని నమ్మినవారూ ఉన్నారు .
పార్లమెంట్ కు పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల జాబితా చూడగానే ఒక పేరు వద్ద దృష్టి ఆగిపోయింది . సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పేరు వద్ద దృష్టి అలానే నిలిచిపోయింది . ఆ పేరు బాగా పరిచయం ఉన్నట్టు తోచింది . కొద్దిసేపటి తరువాత గుర్తుకు వచ్చింది. రామచంద్రరావు అని ఖైరతాబాద్ నుంచి గెలిచిన శాసన సభ్యులు . 83లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రి . అవినీతిని నిర్మూలించడానికి అని ఎన్టీఆర్ మహాపాత్ర అని ఏర్పాటు చేశారు .
రామచంద్రరావు 10 వేల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు . అవినీతికి సంబంధించి ఏసీబీకి తప్ప మరో సంస్థకు అధికారం లేదు . ఈ లెక్కన మహాపాత్ర ఏర్పాటే అప్పట్లో చట్ట వ్యతిరేకం . పైగా ఏసీబీ అధికారులు , ఉద్యోగులపై అవినీతిపై కేసులు పెట్టవచ్చు కానీ అప్పటి నిబంధనల ప్రకారం మంత్రిపై కేసు పెట్టే అవకాశం లేదు . ఆ రామచంద్రరావేమో ‘బాబోయ్ నాకే పాపం తెలియదు . వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికి నన్ను బలి పశువును చేశారు’ అని లబోదిబో మన్నారు . ఆ తరువాత రామచంద్రరావు రాజకీయ చరిత్ర ముగిసిపోయింది అనుకున్నారందరూ .
ఓ నాటకం ఆడి రామచంద్రరావును బలి చేశారు అని నమ్మిన వారు కూడా ఉన్నారు . ఎన్టీఆర్ కు అలా చేయాల్సిన అవసరం లేదు . రామచంద్రరావు తప్పు చేశాడు అని నమ్మిన వారూ ఉన్నారు . ఏదేమైనా రామచంద్రరావు పేరు మరుగున పడిపోయింది . ఎన్టీఆర్ ను దించి బాబు సీఎం కాగానే తొలి ఎన్నికగా 96లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి . టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా చూస్తే సికింద్రాబాద్ నుంచి రామచంద్రరావుకు బాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు . రామచంద్రరావు జీవిత జీవితంలో ఎవరు విలన్ ? ఎవరు విలన్ అంటే ఏం చెబుతాం ? బాబు టికెట్ ఇచ్చారు కానీ అయన గెలువలేదు . ఆ తరువాత రామచంద్రరావు మరణించినప్పుడే ఆయన పేరు వినిపించింది .
*******
2004 లో ఓడిపోయిన కొద్ది రోజులకే చంద్రబాబు నాయుడు మీడియాను వెంటబెట్టుకొని నాదర్ గుల్ గ్రామానికి తీసుకువెళ్లారు . ఆ గ్రామం మొత్తాన్ని ఓ వ్యక్తి బ్యాంకులో తాకట్టు పెట్టాడు అని మీడియాలో కథలు కథలుగా వచ్చింది . అప్పుడు ప్రతి రోజు ఆ వ్యక్తి అక్రమాల గురించి మీడియాలో ప్రధానంగా వచ్చేది . ఏం జరిగిందో ఏమో కానీ మీడియాలో రోజూ ఆగకుండా కథలు కథలుగా వచ్చేవి . గ్రామంలోకి మీడియాతో కలిసి బాబు వెళితే గుర్రాలతో దాడి జరిపారు అంటూ మీడియాలో షోలే సినిమాలో గబ్బర్ సింగ్ స్థాయిలో వార్తలు వచ్చాయి , బాబు అదే స్థాయిలో వర్ణించారు . ఆ గ్రామానికి వెళ్లి వచ్చిన జర్నలిస్ట్ లు కూడా గుర్రాల దాడులను ఒళ్ళు గగుర్పాటు కలిగే విధంగా వర్ణించి చెప్పేవారు .
గుర్రాలతో వెంటాడడం నిజమే .. హైదరాబాద్ లో భూములు అంటే బంగారం , అలాంటి భూములను ఆక్రమించుకోవడానికి , అక్రమాలను బయట పెట్టడానికి వస్తే గుర్రాలతో దాడులు అంటే పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు . ఊరు మొత్తాన్ని ఆక్రమించుకొని బ్యాంకులో తనఖా పెట్టాడు అని , ఈ అక్రమాలను బయటపెట్టడానికి వెళితే గుర్రాలతో దాడులు చేయించాడు అని చంద్రబాబు ఆరోపించింది నూకారపు సూర్యప్రకాశ రావు గురించి …. ఇక్కడి వరకు బాగానే ఉంది .. ఆరోపణల్లో నిజాలూ ఉండొచ్చు కానీ విశేషం ఏమంటే కొద్ది రోజుల తరువాత ఇదే నూకారపు సూర్యప్రకాశ రావుకు చంద్రబాబు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా టీడీపీ టికెట్ ఇచ్చారు .
మీ పార్టీ ఓడిపోగానే తొలి ఉద్యమం నూకారపు మీదనే కదా ? మీడియాను వెంటబెట్టుకెళ్ళి అంత హడావుడి చేశారు ? గుర్రాలతో దాడి అన్నారు , భారీ కుంభకోణం అన్నారు , మీ పార్టీ టికెట్ ఇవ్వడం ఏమిటీ అడిగితే… బాబు సింపుల్ గా ఆ ఆరోపణలు రుజువు కాలేదు కదా ? అందుకే టికెట్ ఇచ్చాము అని బదులిచ్చారు .. జగన్ లక్ష కోట్లు సంపాదించాడు అనేది ఋజువైందా ? రాజకీయ అవినీతిలో ఏ ఒక్క కేసు అయినా రుజువవుతుందా ? అని బాబును అడిగితే సమాధానం లేదు . బాబులో ఒక గొప్ప లక్షణం ఉంది. నూకారపు మీద ఉగ్ర నరసింహుడిలా ధ్వజం ఎత్తిన బాబు గారే , నూకారపు ఎంత గొప్పవారో అనకాపల్లి నుంచి ఆయన ఎందుకు గెలవాలో ఆ వెంటనే అంతే అద్భుతంగా చెప్పగలరు . చెప్పారు కూడా …
బాబు టికెట్ ఇచ్చారు , విస్తృతంగా ప్రచారం చేశారు , సూర్య పత్రిక రోజూ అనకాపల్లి నియోజక వర్గం మొత్తం పంచి నూకారపును ఆకాశానికి ఎత్తారు . ఐతే నూకారపు అక్రమాల గురించి మొదట బాబు చేసిన ప్రచార ప్రభావం జనం మీద బలంగా పడినట్టు ఉంది . అనకాపల్లి ప్రజలు తొలుత బాబు చెప్పిన మాటల్నే సీరియస్ గా తీసుకోని నూకారపును ఓడించారు.
ఆ రెండు పత్రికలు …
ఆ రెండు పత్రికలు టీడీపీవి , వాటిని చదువవద్దు అని వైయస్ రాజశేఖర్ రెడ్డి బహిరంగంగానే చెప్పేవారు . సీఎంగా శాసనసభలో కూడా చెప్పారు . ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు , ఆంధ్రజ్యోతి టీడీపీ పత్రికలు అని ధ్వజమెత్తేవారు . ఆ రెండు పత్రికలు అంటూ వైయస్ఆర్ చెప్పిన మాటలు గుర్తుండి పోయాయి . మరో రెండు పత్రికల గురించి కూడా ఆయన చెప్పారు . ఐతే అందరికీ గుర్తుండక పోవచ్చు . మాకూ రెండు పత్రికలు వస్తున్నాయి అని చెప్పేవారు . ఒకటి సూర్య , రెండు సాక్షి . ఈ రెండూ కాంగ్రెస్ పత్రికలు అని వైయస్ఆర్ బహిరంగంగానే చెప్పారు . సాక్షిని వైయస్ఆర్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి , సూర్యను నూకారపు సూర్యప్రకాశ రావు ఏర్పాటు చేశారు .
మా పత్రిక అని వైయస్ఆర్ స్వయంగా చెప్పిన పత్రిక సూర్య . వైయస్ఆర్ ఆత్మగా పేరు పొందిన కెవిపి రామచంద్రరావుకు నూకారపు సన్నిహితులు . అలాంటి నూకారపు పత్రిక సూర్య పుట్టిన కొద్ది కాలానికే బాబు క్యాంపులో చేరిపోయి , అనకాపల్లి ఎంపీ టికెట్ సాధించారు . ఏ నాయకుడు ఏ క్యాంపులో ఎంత కాలం ఉంటాడో , ఏ పత్రిక ఏ పార్టీ క్యాంపులో ఉంటుందో చెప్పలేం .. ఎందుకంటే సినిమా ఐతే ట్విస్ట్ లను ఊహించగలం కానీ రాజకీయాల్లో ట్విస్ట్ లు ఊహించలేం ….. — – బుద్దా మురళి
Share this Article