Gurram Seetaramulu….. ఈ విద్యారంగ చక్రవర్తి పుట్టక ముందు స్కూల్/ఇంటర్ విద్య సాధారణ బ్రతకలేని బడిపంతుల కనుసన్నల్లో ఉండేది. ఆ పంతుళ్ళు పాడుగాను సరిగా పాఠాలు చెప్పక ఏ మహానుభావుడు అయినా మమ్మల్ని విముక్తి చేయకపోతాడా అని బడిలో ప్రతిరోజూ ప్రార్ధన సమయంలో వేడుకునే వారు. బురద, ఈగల దోమల మధ్య చింతల కింద ఆరుబయట అలగా జనాలకు చదువు చెప్పలేక బడి పంతుల్లూ, పోరగాల్లూ శిలువ మోస్తున్న యేసయ్యలాగా మూగ రోదనతోనే గడిచింది మా తరం.
మాకు ఎంసెట్ తెలీదు, ఏఐత్రిప్ల్‌ఈ తెలీదు. డిగ్రీ తెలుసు. అమ్మా ఆవు ఇల్లు ఈల అని చదువుకోవడం తెలుసు. ఏ దేవుడి కరుణ వల్లో పందొమ్మిది వందల ఎనభై ఆరు నాడు బొప్పన సత్యనారాయణరావు అలియాస్ బియెస్ రావు ఇంటర్ విద్యను ఒక మలుపు తిప్పాడు. అప్పుడు గానీ చదువు కాట్ వాక్ చేయడం మొదలు పెట్టలేదు.
తరగతి గదిలో, హాస్టల్ గదిలో వేలాడే శవాలు ఇంటికి చక్కగా పాక్ చేసి రావడం ఒకేసారి మొదలైంది. ఏ ఫర్ ఆపిల్… బి ఫర్ బొప్పన …కె ఫర్ కమ్మ … డి ఫర్ దోపిడీ . ఈ ఫర్ ఈనాడు అంటూ అని చదువు తలరాతను మార్చారు. దానికి రెండేళ్ళ ముందు రాజకీయాలలో రామారావు అనే మహానుభావుని శకం మొదలైంది. భూమి ఆకాశం కలిసి రాజ్యం నిండా పాల ధారలు పొంగి పొర్లుతున్న కాలంలోనే ఆ పాల నురుగు వెలుగుల్లో వికశించిన విద్యా కమలం శ్రీ చైతన్య.
Ads
ఈగలు కొట్టుకుంటున్న పంతుల్ల బళ్లలో కాకుండా, పాలధారలు పారుతున్న చక్రవర్తి స్థాపించిన స్వర్గంలో పిల్లలు లక్షల కోట్ల మంది చేరారు. ఊరికొక పంతులు ఏజెంట్ అవతారం ఎత్తి గూడేల నుండి స్వర్గ లోకానికి దగ్గరుండి పంపడం మొదలు పెట్టారు. ఆనాడు ఈనాడు లాంటి భూమార్గం పట్టిన పాత్రికేయం ఈ స్వర్గ ధామాలకు తోరణాలు కట్టారు.
ఒకటీ రెండూ రెండూ మూడూ మూడూ నాలుగూ ఐదూ ఆరూ అంటూ వందదాకా మన స్వర్గం ధామం నుండే తీరున్నొక్క రాగంలో పాడడం మొదలు పెట్టాయి. పిల్లలను తమ కనుసన్నలలోనే స్వర్గంలో చేర్చు ఎంసెట్ కొట్టు, విమాన టిక్కెట్ కొని అమెరికా పంపు… ఇలా నలభై ఏళ్ళపాటు ఈ సైకిల్ చర్విత చరణంలా తిరుగుతూనే ఉంది. అలా ఆట, పాట, తానా తందానా అంటూ రోడ్ల మీద ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారు ఇది ఎవరి సృష్టి ?
అలా ఈ చక్రవర్తి ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. లక్షల మందిని అమెరికా పంపాడు. కానీ హాయిగా చదువుకునే పిల్లవాడు పిచ్చాసుపత్రిలో చేరడం ఇతనితోనే మొదలైంది. నేల మీద అక్షరాలు నేర్చుకున్న ఇంటర్ పోరగాడు అందని స్వర్గాన్ని చేరుకోలేక ఉట్టికి ఉరేసుకుకోవడం అప్పుడే మొదలైంది. నువ్వు ఇచ్చిన లెక్కలు, చేసిన అప్పులు తీర్చలేని ఎందరో తల్లిదండ్రులు నాకు తెలుసు. ఈ వికృత విలువల సృష్టి ఎవరిది ?
శాస్త్రీయ విద్య కై పోరాడుదాం, బంగారు బడిని కూలుద్దాం, నారాయణ చైతన్య పారాయణం చేద్దాం… అనే విద్యార్ధి సంగాలను వాటి కాపలా కుక్కల ఎర్రజెండాల కనుసన్నలలోనే ఇంత అనర్ధం జరిగింది అనేది దాచేస్తే దాగని సత్యం… మీకెవరికయినా సందేహం ఉంటే శ్రీ చైతన్య , నారాయణ రావడానికి ముందూ, వెనకా విద్యా రంగంలో జరిగిన హత్యల , ఆత్మహత్యల మీద ఒక నిజనిర్ధారణ జరిపితే… పోయిన తలల లెక్కలు వేలల్లో చూపెట్టగలను … అయినా ఈ సందర్భంగా ఈ చక్రవర్తి మూలంగా చనిపోయిన వాళ్ళకు నివాళి…
(మరణించిన వాళ్ల మీద నిందలు సరికాదు అంటారు కొందరు… కానీ ఎప్పుడో ఓసారి చెప్పుకోక తప్పదు… ఎందరి ఉసురో నారాయణ కొడుక్కి తగిలాయి… బీఎస్‌రావు విద్యారంగానికి చేసిన షేవ్ కూడా ఎప్పుడో ఓసారి బలమైన చర్చకు రాకతప్పదు… ఇది అదే… తప్పు కాదు, తప్పలేదు… నిజాలు కదా, ఇవి ఎంత నిష్ఠురంగా ఉన్నా సరే…)
Share this Article