దీన్ని భేష్ అని మెచ్చుకుందామా..? ఇదేమిటో వెంటనే బుర్రకెక్కక నిర్ఘాంతపోదామా..? ఈనెల 11న ముంబై, బాంద్రాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఓ తీర్పు ఇచ్చాడు… ఓ భర్త తన భార్యతోపాటు ఆమె పెంచుకునే మూడు పెంపుడుకుక్కలకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆ తీర్పు సారాంశం… ఆగండాగండి… కాస్త కేసు పూర్వాపరాల్లోకి వెళ్దాం పదండి…
కోమల్‌సింగ్ రాజపుట్… వర్తమాన వయస్సు 55 ఏళ్లు… 1986లో పెళ్లయింది ఆమెకు… ఇద్దరు బిడ్డలు… ఆ ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు… 2021 నుంచి భార్యాభర్తలకు పడటం లేదు… ఆమె the Protection of Women from Domestic Violence Act… ఈ చట్టం కింద గృహహింస కేసు పెట్టింది… దాంతోపాటు తనకు నెలవారీ మెయింటెనెన్స్ ఇవ్వాలని కోరింది… నాకు అనారోగ్యం, భర్తపైనే ఆధారపడ్డాను ఇన్నేళ్లూ… ఇప్పుడు ఏ దిక్కూ లేదు, వేరే ఆదాయం కూడా లేదు, నా అవసరాలకు తగినంత, అంటే నెలకు 70 వేలు ‘మధ్యంతర మెయింటెనెన్స్’ ఇస్తే సర్దుకుంటానని మొరపెట్టుకుంది…
వామ్మో, వాయ్యో, అసలే బిజినెస్ నష్టాలతో సతమతమవుతున్నాను… నెలకు 70 వేలు ఎలా తీసుకురావాలంటూ భర్త గగ్గోలు… అదే చెప్పుకున్నాడు కోర్టులో… ఠాట్, నువ్వు చెప్పేది నమ్మబుల్‌గా లేదు… 70 వేలు కాదు గానీ 50 వేలు ఇవ్వు ఎలాగోలా అని కోర్టు చెప్పింది… ఆమె తన అవసరాలతోపాటు మూడు పెంపుడు కుక్కలని కూడా పోషించాలి కదాని కోర్టు ఈ మెయింటెనెన్స్ మొత్తాన్ని సమర్థించుకుంది కూడా…
Ads
అదేమంటే..? బంధుత్వాలు, బంధాలు తెగిపోయిన కారణంగా ఆమె ఉద్వేగరహితంగా మారిపోయింది… ఆ ఖాళీని కుక్కలే భర్తీ చేస్తున్నాయి గనుక ఆ కుక్కల పోషణ భారం కూడా భర్తదే అని చెప్పేసింది… గౌరవప్రదమైన లైఫ్ స్టైల్‌లో పెంపుడు జంతువులు కూడా భాగమే, అవి మనుషుల ఉద్వేగాల కొరతను తీరుస్తాయనీ, వాటిని ఇగ్నోర్ చేయలేమనీ పేర్కొంది… అందుకని మెయింటెనెన్స్ తగ్గించాలనే భర్త కోరికను తోసిపుచ్చింది…
మెయింటెనెన్స్ అంటే అవసరాలకు తగినంత… కానీ ఆ అవసరాలు ఏ స్థాయి..? కనీసావసరాలా..? లేక భార్య కోరుకునే లైఫ్ స్టైల్‌కు తగిన అవసరాలా..? ఏవి ప్రామాణికం..? మెయింటెనెన్స్ ఖరారుకు భర్త ఆర్థికస్థితిని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా..? ఒకవేళ భార్య ఇంకాస్త ఆడంబరపు జీవనశైలి కలిగి ఉంటే..? అసలు పెంపుడు జంతువుల పోషణభారం ఎవరిది..? ఇలాంటి పలు ప్రశ్నలు ఈ తీర్పు తరువాత ఉత్పన్నమవుతున్నాయి… ఇప్పుడు ఆ భర్త ఏం చేయాలి..? ఖర్చులన్నీ భరిస్తూ పైకోర్టుకు వెళ్లడమేనా..?
Share this Article