Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీమ పెళ్లిలో ఎదురుకోవులు… మన విశ్వనగరంలో ట్రాఫిక్ కదలికలు…

July 26, 2023 by M S R

Rain-Ruin: “చినుకులా రాలి…నదులుగా సాగి…
వరదలై పోయి…కడలిగా పొంగి…”

“గాలి వానలో, వాన నీటిలో
పడవ ప్రయాణం.
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం.
అది జోరు వాన అని తెలుసు.
ఇవి నీటి సుడులని తెలుసు.
జోరు వానలో, నీటి సుడులలో
మునక తప్పదని తెలుసు.
ఇది ఆశ నిరాశల ఆరాటం.
అది చీకటి వెలుగుల చెలాగటం.
ఆశ జారినా, వెలుగు తొలిగినా
ఆగదు జీవిత పొరాటం”

“మేఘమా! దేహమా! మెరవకే ఈ క్షణం.
మెరుపులతో పాటు ఉరుములుగా.. మూగబోయే జీవస్వరములుగా…జీవితచక్రం”

Ads

నిన్న సాయంత్రం విశ్వనగరం హైదరాబాద్ లో పడవలాంటి కారులో ఆఫీసునుండి ఇంటికి బయలుదేరితే గుర్తొచ్చిన పాటలివి. సాధారణంగా పది నిముషాలు కూడా పట్టని ప్రయాణానికి గంటకు పైన పట్టింది. మధ్యలో రేడియోలో రెండు వార్తా బులెటిన్లలో నగరపాలక సంస్థ సిబ్బంది అప్రమత్తత వివరాలు వినపడ్డాయి.

అన్ని సర్కిళ్లలో మ్యాన్యువల్ గా సిగ్నళ్లను ఆపరేట్ చేస్తూ…కుంభవృష్టిలో రెయిన్ కోట్లు వేసుకుని స్తంభించిన వాహనాలను నియంత్రిస్తున్న పోలీసుల మనసులో ఆ క్షణాన ఏముంటుందో తెలుసుకోవాలనిపించింది. కారు వదిలి నడిచి రావాల్సింది కదా? అని నా భార్య బాధ్యతగా విసుక్కుంది.

అంగుళమంగుళం బంపర్ టు బంపర్ వాహనాలు కదులుతుంటే రాయలసీమ పెళ్లిళ్లలో ఎదురుకోవులు గుర్తొచ్చాయి. విడిదిలో దిగిన పెళ్లి కొడుకు ముస్తాబవుతాడు. పెళ్లి కూతురికి కూడా బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు విచ్చుకుంటాయి. కనీసం కిలో మీటరు పైన దూరంలో పెళ్లి కూతురు బృందం వారు- పెళ్లి కొడుకు బృందం వారు ఎదురెదురుగా బయలుదేరతారు. పెళ్లి కూతురు ఒక అడుగు ముందుకేస్తే…పెళ్లి కొడుకు కూడా ఒక అడుగే ముందుకేస్తాడు. ఇలా మేళ తాళాల మధ్య అడుగులో అడుగు వేసుకుంటూ రెండు బృందాలు మధ్యలో కలిసే సంబరం సాయంత్రం మొదలయినది అర్ధరాత్రి దాటేది. ఏమిటా ఎదురుకోవుల నడక? అన్న వాడుక మాట ఇక్కడే పుట్టింది. ఈలోపు కుర్చీలు వేసి స్పృహదప్పిన పెళ్లి కూతురిని కూర్చోబెట్టి నిమ్మరసమిచ్చేవారు. పెళ్లి కొడుకు కూడా మూడు సార్లు టిఫిన్లు చేసేవాడు.

చివరికి ఈ ఎడబాటు ఎప్పటికి తీరుతుందో తెలియని నిరాశా నిస్పృహల్లో పెళ్లి కూతురు- పెళ్లి కొడుకు కలిసినా నీరసించి…ఒకరినొకరు కన్నెత్తి చూసుకునే ఆసక్తి కూడా ఆవిరై ఉంటుంది. నాలాంటివాళ్లు మధ్యలో రోడ్ల మీదే కుర్చీల్లో పడుకుంటే అర్ధరాత్రి ఎదురుకోళ్ల సన్నాహం ముగిసిందని దారినపోయేవారు అయ్యో పాపం అనుకుని నిద్రలేపి విడిది ఇంటికి దారి చెప్పేవారు.

అబ్బాయి ఒకడుగు ఎక్కువేస్తే సొమ్మేమీ పోదు కదా! అని ఉత్సాహవంతుడయిన అమ్మాయి మేనమామ చనువుగా అన్నమాట చినికి చినికి గాలి వానై…గాడ్రేజ్ కుర్చీలు మడిచి పరస్పరం సుహృద్భావ వాతావరణంలో కొట్టుకుని…తలలు పగిలి…పెళ్లికి వెళ్లిన వాళ్లు విడిదిలో సంచులను వదిలి పరారయిన సందర్భాలు కూడా ఎన్నో చూశాను. ఇలాంటి ఒక సందర్భంలో పెళ్లి ఆగితే ఆగింది కానీ…వార్త మాత్రం కళ్లకు కట్టినట్లు భలే రాసిండావప్పా- అని తుముకూరులో పెళ్లి కూతురి మేనమామ తల పగలగొట్టిన పెళ్ళికొడుకు తమ్ముడయిన నా మిత్రుడు పోలీస్ స్టేషన్ విచారణ మధ్యలో నన్ను మెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో వార్తాభిరుచులు, వార్తా ప్రమాణాలు అలా ఉండేవి మరి!

బంపర్ టు బంపర్ వాహనాలు మిల్లీ మీటర్ చొప్పున కదులుతుంటే నాకు రాయలసీమ ఎదురుకోవుల సంబరం, గొడవలు, వైరాగ్యాలన్నీ కళ్లముందు మెదిలాయి.

ఇప్పుడంటే ఉత్తర భారత హిందీ హల్దీ, మెహందీ, సంగీత్, కర్వా చౌత్, లెహంగి రాజ్యమేలుతున్నాయి కానీ…తెలుగు ఎదురుకోవుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నెన్నో జీవన పాఠాలున్నాయి. ప్రతీకలున్నాయి. పెళ్లయ్యాక ఒకరి కోసం మరొకరు అలా నిరీక్షిస్తూ…ఎంత ఆలస్యమయినా సహనం కోల్పోకుండా సంయమనంతో ఉండాలన్నది అందులో నేర్చుకోవాల్సిన పాఠం. ఆచారాల్లో అంతులేని అంతరార్థాలు దాగి ఉంటాయి. వాటిని శోధించి…సాధించి పట్టుకుని…సరిగ్గా అన్వయించుకోవాలి-అంతే.

నా పెళ్లిలో ఎదురుకోవులు జరగలేదన్న వెలితిని హైదరాబాద్ వర్ష రుతువు అనేకసార్లు తీర్చింది. తీరుస్తూనే ఉంది. వర్షం ట్రాఫిక్ లో ఎక్కడి దాకా వచ్చావ్? అంటుంది నా భార్య. ఇందాకా స్టార్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇప్పుడే రెయిన్ బో హాస్పిటల్ కు వచ్చాను అంటాను నేను. అదేమి కాంబినేషనో కానీ మా ఆఫీస్ బంజారా హిల్స్ పది రోడ్డులో నగల, పట్టుబట్టల దుకాణాలు- పెద్దాసుపత్రులు పక్క పక్కనే  బంపర్ ఆఫర్లతో కిక్కిరిసి ఉంటాయి. అబ్బా! బాగా స్పీడ్ పెరిగిందే! అయితే గంటన్నరలోపు ఇంటికొస్తావా? అంటుంది. ఇలా అడుగడుగునా కదలికను పర్యవేక్షించే…ప్రతి అడుగుకు మురిసిపోయే…ఎదురుచూపులే కలకాలం ఉండాలని ఎదురుకోవులు పెట్టి ఉంటారు.

ఇంటికి రాగానే టీవీల్లో హై రైజ్ బిల్డింగుల అంతరిక్ష బాల్కనీల నుండి పౌరులు బాధ్యతగా షూట్ చేసిన ట్రాఫిక్ జామ్ జూమ్ యాంగిల్ దృశ్యాలు కనపడుతున్నాయి. చూశావా! మన ఇల్లు- ఆఫీసు పక్క పక్కనే ఉండడంతో నువ్ హాయిగా ఒకటిన్నర గంట లోపు ఇంటికి రాగలిగావు. వాళ్లు చూడు మూడు, నాలుగు గంటలుగా అక్కడే రోడ్ల మీద ఉన్నారు…అని అరిటాకులో వేడి వేడి గారెలు, కొబ్బరి చట్నీ పెట్టి ఇచ్చింది. తృప్తిగా తిని…మొల లోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం దొరికినట్లు హాయిగా పడుకున్నాను.

కాళ్లు లేని వాడిని చూసినప్పుడే…చెప్పుల్లేని వాడి ఏడుపు ఆగుతుందన్నది మానసిక శాస్త్రంలో గొప్ప సూత్రీకరణ.

“I always like walking in the rain, so no one can see me crying”
నేనెప్పుడూ వర్షంలో నడవడానికే ఇష్టపడతాను. ఎందుకంటే నా కన్నీళ్లను ఎవరూ గుర్తు పట్టలేరు– అన్న ప్రపంచ ప్రఖ్యాత చార్లీ చాప్లిన్ మాట ఎందుకో నాకు ఈ సందర్భంలో పదే పదే గుర్తొస్తోంది.

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions