Sai Vamshi…….. Disclaimer: DEFINITELY YOU SHOULD WATCH THIS.. (కొందరు వ్యక్తుల మీద అభిమానం ఎంత ఆర్థిక నష్టం తెస్తుందో సినీ దర్శకుడు చంద్ర మహేశ్ (‘ప్రేయసి రావే’, ‘విజయరామరాజు’, ‘హనుమంతు’ ఫేం) ఇంటర్వ్యూ చూశాక అర్థమైంది. భాగ్యరాజా గారి మీద అభిమానంతో, ఆయన అబ్బాయితో నిర్మించిన ఒక్క సినిమా కారణంగా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారో ఏమాత్రం సంకోచం లేకుండా వివరించారు. అందరూ చూడాల్సిన ఇంటర్వ్యూ..)
… తమిళ దర్శకుడు కె.భాగ్యరాజా గారికి నేను వీరాభిమానిని. ఆయన కథతో ఒక సినిమా తీయాలనేది నా కోరిక. ఆయనే నాకు ఫోన్ చేసి నా సినిమాలను మెచ్చుకున్నారు. హైదరాబాద్ వచ్చి నన్ను కలిశారు. ఆయన ఇచ్చిన కథతో ఆయన కొడుకును తెలుగులో నేనే పరిచయం చేయాలని అనుకున్నాను. దానికి నేనే నిర్మాతగా వ్యవహరించాను. నేనే నిర్మాతగా మారే నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. ఆ సినిమా వల్ల మూడు కోట్లకు పైగానే నష్టపోయాను.
… నాకు ఫుల్ స్క్రీప్ట్ ఉంటే తప్ప షూటింగ్ చేసే అలవాటు లేదు. భాగ్యరాజా గారు అలా కాదు. లొకేషన్‌లో సీన్లు రాసేవారు. ఏరోజుకారోజు సీన్లు రాసేవారు. అవి నా చేతికి వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయ్యేది. అప్పటికే లొకేషన్‌లో ఆర్టిస్టులు ఉండేవారు. వారికి ఖాళీగా కూర్చోబెట్టాల్సి వచ్చేది. సీన్ నా చేతికి వచ్చాక దాన్ని తెలుగులోకి మార్చేందుకు మరింత టైం పోయేది. ఆ రోజు తీయాల్సిన సీన్ తర్వాత రోజు చేయాల్సి వచ్చేది. ఇలా రోజూ ఇబ్బందిగా ఉండేది.
Ads
… షూటింగ్ మధ్యలో భాగ్యరాజా నా మీద అలిగేవారు. తనకు నచ్చినట్టు సీన్లు తీస్తున్నానా, లేదా అని చూసేవారు. ఉన్నట్టుండి షూటింగ్ మధ్యలో వాళ్ల అబ్బాయి చెన్నై వెళ్లిపోయేవాడు. ఫోన్ చేసి అడిగితే “మా అబ్బాయికి కడుపునొప్పిగా ఉంది. జ్వరంగా ఉంది” అని భాగ్యరాజా సమాధానం ఇచ్చేవారు. ఈ వ్యవహారం అంతా చూసి ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఇలాగే ప్రవర్తించడం మొదలు పెట్టింది. దీంతో షూటింగ్ మొత్తం క్యాన్సిల్ అయ్యేది.
… ఒకరకంగా భాగ్యరాజా గారి మీదున్న అభిమానమే నా కొంప ముంచింది. ఆయన చాలా నిదానంగా స్క్రిప్ట్ రాసేవారు. ఆయన అబ్బాయితో తీసే సినిమాని అరవై రోజుల్లో పూర్తి చేయొచ్చు అని లెక్కలు వేసుకున్నాను. కానీ మొత్తం 24 నెలలైంది. దీంతో ఖర్చు తడిసి మోపెడైంది. వడ్డీలు పెరిగాయి. ఇంట్లో ఉన్న చాలా వస్తువులు దానికోసం అమ్మాల్సి వచ్చింది.
… సినిమా షూటింగ్ మధ్యలో అప్పులు పెరిగి ఫిల్మ్‌నగర్‌లో ఇల్లు చాలా తక్కువ రేట్‌కి అమ్మేసి అద్దె ఇంట్లోకి మారాను. ఆ తర్వాత భాగ్యరాజా గారిని ఒకసారి హైదరాబాద్ పిలిచి నా పరిస్థితి చెప్పాను. ఈ సినిమా తీయడం కోసం సొంతిల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి మారానన్నాను. ఆయన కళ్ల నీళ్లు పెట్టుకున్నారు.
…. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో సురేష్ ప్రొడక్షన్స్‌లో అందరికీ తక్కువ రెమ్యునరేషన్ ఉండేది. అది కూడా విడతల వారీగా ఇచ్చేవారు. ఒకేసారి ఇస్తే ఏదైనా వాళ్లు కొనుక్కుంటారు కదా అని అనుకునేవాణ్ని. ఇదే విషయం ఒకసారి రామానాయుడు గారిని అడిగాను. “మొత్తం డబ్బులు ఒకసారి ఇస్తే నా మాట ఎవరు వింటారయ్యా! అందుకే ముందు 70 శాతం డబ్బులు ఇచ్చి, సినిమా రిలీజ్‌కి ముందు ఇక ఏ సమస్యా లేదు అన్నప్పుడు మిగిలిన డబ్బు ఇస్తాను. అలా అయితేనే పని చేయించుకోగలం” అన్నారు. ఆ విషయం నేను పాటించలేక పోయాను. దాని వల్ల బాగా నష్టపోయాను. YouTube Link: https://youtu.be/FnL8PgIHI9Y
Share this Article