చాలామందికి కరీనాకపూర్ అంటే నచ్చదు… అందులోనూ ప్రత్యేకించి కాషాయ శిబిరానికి… ఆమె పుట్టుక ప్రఖ్యాత కపూర్ ఫ్యామిలీలో… తండ్రి రణధీర్ కపూర్, తల్లి బబిత… కరిష్మాకపూర్ సోదరి… కొన్ని మెచ్చదగిన పాత్రలు కూడా చేసింది… ఆమె సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడం మీద కాదు… తన పిల్లలకు తైమూర్, జెహంగీర్ అనే హిందూ ద్వేషుల పేర్లను, హిందువులపై భీకర దాడుల కారకుల పేర్లను పెట్టుకోవడం మీద హిందుత్వ వాదుల్లో వ్యతిరేకత ఉంది…
ఐతేనేం… ఈ విషయంలో మాత్రం కరీనాకపూర్‌కే చాలామంది మద్దతు… అదేమంటే… అప్పట్లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఓ వీడియోలో కరీనాకపూర్‌పై పలు అసందర్భ వ్యాఖ్యలు చేశాడు… ఆ వీడియో ఇప్పుడు మళ్లీ వైరలయింది… గొప్ప సంపాదనపరులు గొప్పవాళ్లేమీ కానట్టు, గొప్పగా ఆలోచిస్తారని అనుకోవడానికి వీల్లేనట్టు… నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి…
‘‘నేను వెళ్తున్న ఫ్లయిట్‌లోనే కరీనాకపూర్ వస్తోంది… ఆమెను చూసి కొందరు ఆమె సీట్ వద్దకు వెళ్లి హెలో అని పలకరిస్తే ఆమె ఎవరి పలకరింపులకూ ప్రతిస్పందించలేదు… అంత అతిశయం పనికిరాదు… మనల్ని అభిమానించేవాళ్లు మన దగ్గరకు వస్తే నిమిషమో, అరనిమిషమో మనం రియాక్ట్ కావాలి…’’ అని ఏదేదో చెబుతూ పోయాడు ఆయన…
Ads
ఇక్కడ నారాయణమూర్తి ఆలోచనవిధానం సరిగ్గా లేదు… అంతెందుకు..? ఆయన భార్య సుధకే ఆయన మాటలు నచ్చలేదు… ‘‘నారాయణమూర్తిని మహా అయితే 10 వేల మంది అభిమానిస్తారేమో, అదీ ఆయన తెలిసినవాళ్లు… కానీ ఓ స్టార్‌కు లక్షల్లో అభిమానులుంటారు… ఆమె విశ్రాంతిని కోరుకుంటూ ఉండవచ్చు బహుశా ఆ టైమ్‌లో… ఆమె ఉన్న సిట్యుయేషన్‌ను అర్థం చేసుకోవాలి’’ అనేసింది… నిజం…
ఈ వీడియోల కింద ఎవరో రాశారు… ‘‘ఆమెకు మహా టెంపర్, ఇగో… పదేళ్ల క్రితం వరకు నేను ఆమెకు వీరాభిమానిని, కానీ ఒకసారి ఇలాగే ఫ్లయిట్‌లో కనిపిస్తే హెలో అని పలకరించాను, ఫోటో దిగాలనుకున్నాను, అడిగాను… కానీ ఆమె విమానసిబ్బందిని పిలిచి ఏదో చెప్పింది… బహుశా నేను ఆమెను సతాయిస్తున్నానని చెప్పింది కావచ్చు… అసహ్యమేసింది…’’ ఇలా చాలామంది ఆమె బిహేవియర్ పట్ల నెగెటివ్‌గా ఏవేవో రాశారు…
ఒక్కసారి మన బాలయ్య అభిమానుల పట్ల ఎలా వ్యవహరిస్తాడో గుర్తుతెచ్చుకొండి… వాళ్ల మీద ద్వేషంతో కాదు, వాళ్ల కేకలు, చేష్టలతో తను విసిగిపోయినప్పుడు అలా చెంప చెళ్లుమనిపిస్తాడు… సెల్ఫీలు దిగాలనుకుంటే ఫోన్లు లాక్కుని దూరంగా విసిరేస్తాడు… ఇక ఫిమేల్ స్టార్లయితే చాలామంది గుమిగూడతారు, కొందరు గలీజుగాళ్లు ఇంకేవో అడ్వాంటేజెస్ తీసుకుంటారు… బయట కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్లతో బెడద, మందలో కలవలేరు… కనీసం ఫ్లయిట్‌లో కూర్చున్నా సరే ప్రైవసీ వద్దా..? కాస్త మనశ్శాంతిగా ప్రయాణం చేయనివ్వరా..?
బయటకు వచ్చినప్పుడు లేడీ సెలబ్రిటీలకు ఎదురైన చేదు అనుభవాలు కోకొల్లలు… ఒక్కడితో కాస్త మర్యాదగా, నాలుగు మాటలు మాట్లాడితే చాలు… ఇక అక్కడే తిష్ట వేసి, సెల్ఫీలు, మాటలు, కోలాహలం, కలకలం… అందుకే ఆమె అభిమానుల్ని అవాయిడ్ చేయవచ్చు బహుశా… ఈ కారణంగా ఆమె మీద అహంభావి అనే ముద్ర వేయడం నారాయణమూర్తి స్థాయికి తగని పని…! పైగా ఆమె తత్వాన్ని విశ్లేషించే పని ఈయనకు ఎందుకట..!!
Share this Article