నారాయణమూర్తి భార్య, దాత, వక్త, రచయిత్రి సుధామూర్తి తెలుసు కదా… ఓసారి లండన్ వెళ్లాక, ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగాడు… ఇక్కడ ఏ అడ్రెసులో ఉంటారు అని… దానికి ఆమె బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ అని చెప్పింది… ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఓసారి ఆమెను ఎగాదిగా చూశాడు, జోక్ చేస్తున్నారా అనడిగాడు..?
బాబూ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నా అల్లుడే అని చెప్పుకోవాల్సి వచ్చింది ఆమె… అది కన్‌ఫరమ్ చేసుకున్నాక గానీ సదరు ఆఫీసర్ ఆమెను అనుమతించలేదు… నెట్‌లో ఈ సంఘటన మీద బాగా చర్చ సాగింది… ఇదేకాదు, ఆమె పలుసార్లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది వివిధ కారణాలతో…
ఆమె ఈమధ్య కునాల్ విజయకర్ అనే ఫుడ్ రైటర్, టీవీ పర్సనాలిటీ చేసిన ‘ఖానే మే క్యా హై’ అనే ఓ ప్రోగ్రాం వీడియోలో మాట్లాడుతూ… ‘‘నేను ప్యూర్ వెజిటేరియన్… గుడ్లు కూడా తినను, అంతెందుకు వెల్లుల్లి కూడా తినను… ఏ దేశమైనా వెళ్తే రెస్టారెంట్లలో వెజ్, నాన్-వెజ్ వంటకాలకూ సేమ్ స్పూన్లను వాడుతుంటారు కదా, అందుకని అవి వాడాలంటే నాకు భయమేస్తుంది… అంత సంప్రదాయవాదిని ఫుడ్ విషయంలో…’’ అని చెబుతూ పోయింది… ఇప్పుడు దానిపైనా చర్చ…
Ads
ఫుడ్ అనేది ఆమె చాయిస్, విమర్శించకూడదనే వర్గం ఒకవైపు… ఫుడ్ మీద మరీ ఇంత ఛాందసమా అని విమర్శించేవారు మరో వర్గం… ట్రోలర్లు ఒకవైపు, సమర్థకులు మరోవైపు… రెండుగా చీలిపోయారు నెటిజనం… ఆమె ఎటైనా వెళ్తే ‘రెడీ టు ఈట్’ ప్యాకెట్లను తీసుకెళ్తుంది తనతో… అప్పటికప్పుడు నీళ్లను మరిగించి, ఈ ప్యాకెట్లలోని పదార్థాన్ని అందులో వేస్తే వంటకం రెడీ… ఎందుకైనా మంచిదని అటుకులు వంటి తేలికరకం సరుకుల్ని కూడా తీసుకెళ్తుంది…
వీలైనంతవరకూ వెజ్ రెస్టారెంట్ కోసం సెర్చ్ చేస్తుంది, దూరమైనా సరే అక్కడికే వెళ్తుంది… లేదంటే తనతోపాటు తెచ్చుకునే స్వల్ప సరుకులతో తనే వంట చేసుకుంటుంది… ఓ చిన్న కుక్కర్, బ్యాటరీలతో నడిచే ఇండక్షన్ స్టవ్ కూడా తీసుకెళ్తుందని కొందరు నెటిజన్లు వెక్కిరింపులకు దిగితే… మోసుకుపోయేది ఆమె, వండుకునేది ఆమె, మధ్యలో మీ అభ్యంతరాలేమిట్రోయ్ అని సమర్థించేవాళ్లు మరికొందరు…
ఈ చర్చలోకి కొందరు రిషి సునాక్‌ను కూడా లాగారు… ఏమయ్యా, మీ అత్తగారు మీ ఇంటికి వస్తే మీ పిల్లలు వాడే కట్లరీ ఆమె దగ్గరకు రానివ్వకండి… అంటూ కొందరు, ఫ్లయిట్లలో వెళ్లేటప్పుడు తన చెయిర్ తనే తీసుకుపోతుందా అంటూ మరికొందరు… రకరకాల వ్యాఖ్యానాలు… ఆమె సింపుల్‌గా ఉంటుంది… ఆడంబరం, అట్టహాసం ఏమీ ఉండవు… ఏ ఫుడ్ తీసుకోవాలనేది ఆమె ఇష్టం… కానీ ట్రోలర్స్‌కు ఇవన్నీ దేనికి..? దొరికింది కదాని ఆడేసుకుంటున్నారు…
ఇదంతా చదువుతుంటే కొందరు సంప్రదాయవాదులైన జైనుల కష్టాలు కొన్ని గుర్తొచ్చాయి… జంతువుల పాలను కూడా వాళ్లు స్వీకరించరు… గుడ్లు, నాన్ వెజ్ వాసన కూడా చూడరు… ఏ దేశమైనా వెళ్తే వాళ్లు తమకు అనువైన ఫుడ్ కోసం సాగించే అన్వేషణ ఓ ప్రయాసే… వాళ్లు ఏది పడితే అది తినరు… ఆల్కహాల్ దగ్గరకు రానివ్వరు… చివరకు ఉల్లి, పొటాటో, కేరట్, అల్లం, వెల్లుల్లి కూడా ఉపయోగించరు… తమ ఇళ్లల్లో తప్ప ఇంకెక్కడా వాళ్లు తృప్తిగా భోంచేయలేరు… కానీ తమ అలవాట్లను, సంప్రదాయాల్ని వదులుకోవడానికి కూడా ఇష్టపడరు…
Share this Article