ఏమాటకామాట… ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణకు నమస్తే తెలంగాణ ఓనర్ కేసీయార్ థాంక్స్ చెప్పాలి… మిగతా విషయాల మాటెలా ఉన్నా… నమస్తే తెలంగాణను కూడా తను స్పందించాల్సిన స్థాయి కలిగిన పత్రికగా రాధాకృష్ణ గుర్తించినందుకు..! నమస్తే పాఠకులు అనేకులు ఆ పత్రిక మడత కూడా విప్పరు… బీఆర్ఎస్ నాయకులకు టార్గెట్లు పెట్టి మరీ కొనిపిస్తుంటారు… ఆంధ్రజ్యోతి సంపాదక బృందం మాత్రం నమస్తే వార్తలను కూడా శ్రద్ధగా చదివి, కొన్నిసార్లు కౌంటర్లు రాస్తుంటుంది…
ఆంధ్రజ్యోతి సాధారణంగా సాక్షిలో వచ్చిన వార్తలకు స్పందిస్తుంది, వివరణ రాస్తుంది… అది కూడా ఏదో నీలిమీడియా అని ప్రస్తావిస్తుంది తప్ప… పెద్దగా సాక్షి అనే పేరు రాయడానికి కూడా ఇష్టపడదు… సేమ్, సాక్షి కూడా ఆంధ్రజ్యోతి వార్తల్ని గుర్తిస్తుంది, కానీ దాని పేరు రాయకుండా తోకపత్రిక అని రాస్తూ కౌంటర్ ఇస్తుంది… నిజానికి సాక్షి ఒక్క ఈనాడులో వచ్చే వార్తల మీదే సీరియస్‌గా రియాక్టవుతూ ఉంటుంది… జగన్ తన మాటల్లో మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు సమప్రాధాన్యం ఇస్తుంటాడు… వాటితోపాటు టీవీ5 అనబడే యెల్లో టీవీకి కూడా…
నమస్తే అనే కరపత్రిక కూడా అప్పుడప్పుడూ వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తలకు స్పందించి, ఏదో సర్కారీ వివరణను పొందుపరుస్తుంది… కాదు, కాదు, సర్కారు కూడా కొన్ని వార్తలకు స్పందించకపోయినా సరే నమస్తే స్పందిస్తుంది… సరే, అదో రకం పాత్రికేయం… దానికి దీటైన పత్రిక ఒక్క సాక్షి మాత్రమే… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… రాజకీయ పార్టీలకన్నా పత్రికలే ఎక్కువగా కాట్లాడుకుంటాయి కాబట్టి… తాజాగా మరో ఉదాహరణ…
Ads
ఇది నిన్నటి ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ, బ్యానర్ స్టోరీ… వర్షాలు ముంచెత్తుతున్నా ప్రభుత్వం వైపు నుంచి ప్రమాదహెచ్చరికలు, సెలవు ప్రకటనలు లేవని చెబుతూ పెద్దపల్లి మండలంలోని ఓ స్కూల్ దుస్థితి పేరిట ఓ ఫోటో వేసింది… నిజానికి అది ప్లాంటెడ్ ఫోటోలాగే కనిపిస్తోంది… అందరూ ఒకేసారి వరుసకట్టి వరదనీటిలో నడుస్తున్న సీన్ అది… కానీ నమస్తే స్పందించి ఆంధ్రజ్యోతి ఫోటోను ఖండఖండాలుగా నరకాల్సినంత సీనేమీ లేదు ఆ ఫోటోలో… దానిపైనే వార్త కాదు… ఓవరాల్ పొజిషన్ చెబుతూ సింబాలిక్‌గా ఆ ఫోటో వాడారు…
ఇదీ నమస్తే కౌంటర్… ఒక పార్టీతో అక్కడ టీచర్‌కు సంబంధాలున్నాయట… ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, విద్యార్థులను అవసరం లేకపోయినా వరదనీటిలో నడిపించి, ఫోటో తీయించాడనీ, అదే ఆంధ్రజ్యోతిలో పబ్లిషయిందని రాసుకొచ్చింది… అసలు గేటు నుంచి స్కూల్ రూమ్స్ దాకా ప్లాట్‌ఫామ్ ఉండగా పిల్లలు వరదనీటిలో వరుసకట్టి ఎందుకు నడుస్తారని నమస్తే కౌంటర్ సారాంశం… చినుకులు పడితే ఆ ఆవరణ నిండా నీళ్లు నిలుస్తాయని తనూ అంగీకరించినట్టే…
మొన్నామధ్య ఎక్కడో రైతులకు పరిహారం అందలేదని ఆంధ్రజ్యోతి ‘పరిహారమేది సారూ’ పేరిట ఏదో వార్త రాసింది… దానికి సహజంగానే నమస్తే స్పందించి, ఛట్, ఆంధ్రజ్యోతి రాసింది తప్పు, అన్నీ అబద్ధాలే అని కౌంటర్ రాసింది… ఆయ్ఁ, నేను రాసిన వార్తనే తప్పంటావా..? అన్నట్టుగా ఆంధ్రజ్యోతి మళ్లీ ఓ కౌంటర్ (రీకౌంటర్?) రాసుకొచ్చింది…
నమస్తే పత్రిక నిజాల్ని వక్రీకరించిందనీ, మేం రాసిందే కరెక్టని మళ్లీ సంబంధిత వ్యక్తుల వెర్షన్లతో సహా రాసుకొచ్చింది… దీనికి నమస్తే రీరీకౌంటర్ ఏం రాస్తుందో తెలియదు గానీ… మెయిన్ స్ట్రీమ్ మీడియా తన్నులాటలు మాత్రం ఆసక్తికరంగా తయారయ్యాయి… పాఠకజనం నవ్వుకుంటున్నారు కూడా…! అవును గానీ, నమస్తేలో కౌంటర్ వస్తే అంత ఉలికిపాటు ఎందుకయ్యా రాధాకృష్ణా..?!
Share this Article