పొద్దున్నే కనిపించిన ఓ వార్త… ఇదీ… మీడియా బాధ్యులపై క్రిమినల్ కేసులు… విస్సన్నపేట జడ్పీ హైస్కూల్ లో పాత రేకుల షెడ్స్ లో విద్యార్థులకు గొడుగులు ఇచ్చి కూర్చోబెట్టి, పాఠశాలలో వసతులు లేవని, తరగతి గదుల్లో వర్షం కురుస్తుందని వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన పత్రికలు, చానళ్లపై క్రిమినల్ కేసుల నమోదుకు డీఈఓ రేణుక ఆదేశాలు. విలేకరులపై కేసులు నమోదు చేయాలని విస్సన్నపేట ఎంఈఓకు ఆదేశాలు…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాలన తీరు ఇలాగే ఉంది… ప్రత్యేకించి విద్యావ్యవస్థలు… అవస్థలు… ఈ వార్త చదువుతుంటే అచ్చు నిన్న నమస్తే పత్రిక (??) ఆంధ్రజ్యోతి వార్తకు కౌంటర్ రాసిన తీరు గుర్తొచ్చింది… అదేదో పెద్దపల్లి జిల్లాలోని ఒక స్కూల్ ఆవరణలో వరద నీరు చేరి, పిల్లలు వరుసగా క్లాస్ రూంకు వెళ్తున్న ఫోటో ఒకటి ఆంధ్రజ్యోతి ప్రచురించింది… అదేదో మహాపాపం అన్నట్టుగా ఆయ్, పిల్లల కాళ్లు తడవకుండా తరగతి గదిలోకి వచ్చేలా గేటు నుంచి ప్రభుత్వం ర్యాంప్ కట్టిందనీ, ఈ ఫోటోకు కారకుడు ఓ టీచర్ అనీ నమస్తే నిందించింది…
Ads
సదరు టీచర్ ఓ పార్టీకి అభిమాని అట, అందుకని బీఆర్ఎస్ సర్కారుకు బదనాం చేయడానికి, కావాలని పిల్లల్ని వరద నీటిలో నడవాలని ఆదేశించి, ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌తో ఆ ఫోటో తీయించాడని నమస్తే అభియోగం… ఛస్, అన్నీ అబద్దాలే, ఇలా రాసుకోవడానికి సిగ్గు ఉండాలి సుమా అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఈరోజు మరో కౌంటర్ ఫోటో పబ్లిష్ చేసింది ప్రముఖంగా… సదరు ర్యాంప్ కూడా వరద నీటిలో మునిగిపోయినట్టున్న ఫోటో… ఇక నమస్తేకు తలదించుకోవడం మినహా మరో మార్గం లేనట్టుంది… ఏమో, రేపు రీరీకౌంటర్ ఏం రాస్తుందో చూడాలి…
నిజానికి ఇది కాదు వార్త… ఇదుగో చదవండి…
స్కూళ్లలోని వాస్తవ స్థితిగతుల్ని బజారుకెక్కిస్తున్నారనే భావనతో… బీఆర్ఎస్ సర్కారు మొత్తం విద్యావ్యవస్థకే ఓ విచిత్ర ఆదేశాలు జారీచేసింది… స్కూళ్లకు సెలవులు ప్రకటించడంలో విద్యా మంత్రి అలక్ష్యాన్ని మీడియా, సోషల్ మీడియా భారీగా నిందించడానికి తోడు మెయిన్ స్ట్రీమ్ కూడా తరగతి గదుల దురవస్థను ఫోటోలతో సహా పబ్లిష్ చేస్తోంది… టీవీలు ప్రసారం చేస్తున్నాయి… దాంతో రాజకీయ నాయకులు గానీ, స్వచ్ఛంద సంస్థలు గానీ, మీడియా గానీ, విద్యార్థి సంఘాలు గానీ స్కూళ్లలోకి రావద్దని ఆంక్షలు జారీ చేసింది…
ఒకవేళ వాళ్లు స్కూళ్లలోకి వస్తే బాధ్యులైన టీచర్లను సస్పెండ్ చేసిపారేస్తామని హుకుం… దాన్ని కూడా ఆంధ్రజ్యోతి ఓ వార్తగా రాస్తూ… సాక్షాత్తూ ముఖ్యమంత్రి మనమడు హిమాంశు స్వయంగా రాష్ట్రంలోని స్కూళ్ల దుస్థితిని బయటపెట్టాడుగా అని గుర్తుచేసింది… ఇప్పుడైతే బహుశా హిమాంశును కూడా స్కూళ్లలోకి అడుగుపెట్టనివ్వరేమో… అదే ఏపీ అయితే హిమాంశు మీద కూడా క్రిమినల్ కేసు పెట్టేవారేమో… ఎందుకంటే… ఈ ఎన్టీయార్ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు చూడండి…
నిన్న టీవీ9, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో తరగతి గదిలో పిల్లలకు గొడుగులు ఇచ్చి, కూర్చోబెట్టి, ఫోటోలు తీసి, వీడియోలు తీసి ప్రసారం చేసి, పబ్లిష్ చేసి ప్రభుత్వాన్ని బదనాం చేశాయట… నిజానికి అక్కడ సరిపడా తరగతి గదులు ఉన్నా సరే, ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఫోటోలు, వార్తలు జనంలోకి తీసుకుపోతున్నారట… ఇలాగని సదరు డీఈవో చెబుతోంది… ఇలా వార్తను జనంలోకి తీసుకుపోయిన పాపానికి సదరు విలేకరులకు నిష్కృతి లేదనీ, క్రిమినల్ కేసులు పెట్టాలని సంబంధిత మండల విద్యాధికారికి ఆదేశాలు జారీ చేసింది…
ఇక్కడ ఓ మాట… నిజానికి కేసులు పెట్టాల్సిందే… వీటిపై కోర్టుల్లో చర్చ జరగాల్సిందే… మీడియాపై ఇలాంటి వార్తలకు సంబంధించి క్రిమినల్ కేసులు పెట్టడంలో అధికారుల ఓవరాక్షన్ మీద విచారణ జరగాల్సిందే… మొన్న ఎవరో న్యూస్‌టుడే విలేకరి ఇంటిని కూల్చేశారు కదా… ఆయనేమో జర్నలిస్టుల మీద క్రిమినల్ కేసులు పెడతాడు, ఈయన జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు అడ్డంగా పడుకున్నాడు… భలే ఉన్నారు మన తెలుగు ముఖ్యమంత్రులు..!!
Share this Article