Prasen Bellamkonda…….. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచుకోవాలి బంధం. చావనేది జీవితానికో అందం… అనే తాత్వికత జీర్ణం కావడం కష్టం . ఆ జీర్ణం కావాల్సింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కైతే మరీ మరీ కష్టం బ్రో.
విపశ్యన అని ఓ పదం ఉంది. టేకింగ్ ది థింగ్స్ యాజ్ దే ఆర్ అని ఇంచుమించు అర్ధం. మానవ జీవితానికి ఈ పదాన్ని అన్వయించినపుడు ‘జరిగేదే జరుగుతది ‘ అని అర్ధం చేసుకోవాలి. మనమేదో ఉద్దరించాం, పొడిచేసాం, ఇరగదీసాం అనుకుంటాం కానీ అదంతా ఉత్తదే… అన్నీ అవే జరిగిపోతాయి నీ ప్రమేయం ఏమీ ఉండదు నువు నిమిత్తమాతృడివి మాత్రమే అనేది ఇంకొంచెం విస్తృతమైన అర్ధం. బ్రో ఇతివృత్తం ఇదే.
నిజానికి ఇదొక తాత్విక ధ్రుక్కోణం. దాన్ని సినిమా చెయ్యడం, పైగా వ్యాపారాత్మక సినిమాగా మలచడం కష్టమే. ఆ కష్టం ‘ బ్రో ‘ లో స్పష్టం. బ్రో మూలం ‘వినోదాయ సీతం ‘లో ఈ వ్యాపారాత్మక సినిమాగా మార్చడం అనే సమస్య లేకపోవడం వల్ల కేవలం భావోద్వేగాలకే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఆ కష్టం ఎదురవలేదు. అయితే ఇదే తాత్వికతతో గతంలోనూ సినిమాలొచ్చాయి. అదృష్టం, దేవుడు చేసిన మనుషులు, ఆంగ్ల స్లైడింగ్ డోర్స్ సినిమాల ఇతివృత్తం ఇదే.
Ads
1992 లో జయసుధ నిర్మాతగా పెద్ద నరేష్ హీరోగా వచ్చిన అదృష్టం నాకు చాలా ఇష్టమైన సినిమా. ఇదొక ఫ్లాప్ బస్టర్. ఆంగ్ల స్లైడింగ్ డోర్స్ కూడా మంచి సినిమా. అసలా పేరులోనే అర్ధమంతా ఉంది. అటుదిటు ఇటుదటు జరిపి ఏ తలుపు తెరుచుకు పోయినా చేరే గమ్యం మారదు అని. పూరీ జగన్నాథ్ సినిమా దేవుడు చేసిన మనుషులు. ఇది కూడా బాక్సాఫిస్ దగ్గర సూపర్ ఫట్టే. నువ్వు ఎక్కడ ఎలా మొదలైనా జీవన ప్రయాణంలో ఎన్ని మలుపులు తిరిగినా చేరేది ఒక్క దగ్గరికే అనే ఒక్క ముక్కనే ఈ సినిమాలన్నీ చెపుతాయి.
జీవితం రెండో ఛాన్స్ ఇస్తే? అనేదే కథ సారాంశం. అదృష్టం సినిమాలో నరేష్ ఒక కార్మికుడిగా మొదలై ఏ మజిలీ కైతే చేరుకుంటాడో అతనికి దేవుడు ఎదురై సెకండ్ ఛాన్స్ ఇచ్చి యజమానిని చేసినా . అదే మజిలీకి చేరుకుంటాడు. ప్రారంభం ఏదైనా ప్రయాణం ఎలాగున్నా ముగింపు మాత్రం ఒక్కటే అనేదే జీవిత సత్యం. ఇప్పుడీ బ్రో చెప్పేది కూడా అదే.
నేనీ ఉపోద్ఘాతం ఇంత పొడుగ్గా ఎందుకు చెపుతున్నానూ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇదంతా అర్ధం కాదు కనుక. కనుకనే బ్రో లో ఎలివేషన్లు ఎక్కువయ్యాయి కనుక. పంచ్ లు బాంగ్ ల మాటున తత్వం కొండెక్కింది కనుక. తత్వం బోధించడం కన్నా కిక్కెక్కించడానికే ఎక్కువ చెమటోడ్చారు కనుక.
అనేకానేక భవసాగరాలున్న ఓ వ్యక్తి చనిపోతాడు. సమయం అనే దేవుడు తారసపడి మృతుడికి 90 రోజుల రెన్యువల్ ఇస్తాడు. ఆ తొంబయ్ రోజుల పరిణామాలే బ్రో. సినిమా మొదట్లో మూడో సీన్ లోనే కథ జిస్ట్ ఇచ్చేసాడు త్రివిక్రమ్. నువు కారు ప్రమాదంలో చచ్చిపోతావ్. ఒకవేళ సెకండ్ ఛాన్స్ వచ్చి కారు ప్రమాదంలో చావకుంటే వెంటనే లారీ గుద్ది చస్తావ్. నీకు మూడో ఛాన్స్ వచ్చి లారీ నుంచి కూడా తప్పించుకున్నా ఆ పక్కనే ఉన్న ఇనుప సువ్వల మీద పడి చనిపోతావ్… ఎన్ని ఛాన్స్ లొచ్చినా జరిగేదే జరుగుతది అని చెప్పేసాడు త్రివిక్రమ్. 90 రోజుల పొడిగింపుతో నువు చేసిందేమీ లేదు నువు రాకున్నా అన్నీ ఇలాగే జరిగుండేవి అని తేల్చి చెప్పేస్తుంది సమయం.
పవన్ కళ్యాణ్ హీరో కావడం వల్ల సినిమాకు వెయిటూ వచ్చింది, భారమూ పెరిగింది. జెండాలో ఉండే స్టారు, బాలెట్ లొ ఉండే చాయ్ గిలాసూ వచ్చాయి. చిటికేస్తే మారిపోయే టైం లూప్ లూ వచ్చాయి. పవన్ కళ్యాణ్ కోసమే వచ్చి పడ్డ ఆయన పాత పాటల మెడ్లీ ప్రయోగం తాళం తప్పింది. పవన్ కళ్యాణ్ నటన గురించి చెప్పక్కరలేదు. సాయి ధరం తేజ్ గురించి చెప్పడానికేమీలేదు. మిగతా వాళ్ళంతా పక్క వాయిద్యాలే. మొత్తంగా చూస్తే ఫ్యాన్స్ కు నచ్చి అర్ధం కాదు. ఫ్యాన్సేతరులకు అర్ధమై నచ్చదు…
Share this Article