‘‘నేను ఏ పార్టీ తరఫున రాలేదు… బీసీ గళమెత్తడానికి వచ్చాను’’ అంటూ అలనాటి యాంకర్ ఉదయభాను చంద్రబాబు కొడుకు లోకేష్ పాదయాత్రల మీటింగులకు అనుబంధంగా ఆర్గనైజ్ చేయబడిన ఓ మీటింగులో చెప్పింది… సరే, ఆ కార్యక్రమం గురించిన చర్చ ఇక్కడ అవసరం లేదు గానీ ఉదయభాను కూడా ఈ మీటింగులో ప్రసంగం చేసింది… ఆమె ఏపీ కాదు… తెలంగాణలోని సుల్తానాబాద్ ఆమె స్వస్థలం… అదీ అప్రస్తుతం అనుకుందాం…
నేను అయిదేళ్లుగా టీవీల్లో కనిపించడం లేదు… కుట్ర పన్నారు… ప్రశ్నించే గళాన్ని ఎప్పుడూ తొక్కడానికే ప్రయత్నిస్తారు… అలుపు లేకుండా ప్రయత్నిస్తూ మళ్లీ మీముందు కనిపిస్తున్నాను, నిలబడగలిగాను అని చెబుతూ పోయిందామె… ఈ వ్యాఖ్య కొంత ఆశ్చర్యంగా, ఆసక్తికరంగానూ ఉంది… (ఐదేళ్లుగా కాదు, దాదాపు పదేళ్లయింది… ఆమధ్య ఏదో టీవీషోలో కనిపించింది కానీ పెద్దగా స్పార్క్ లేదు…)
నిజానికి ఈమె తెలుగు యాంకర్లలో అత్యంత సీనియర్… అప్పట్లో అత్యంత పాపులర్ కూడా… అసలు టీవీల్లో యాంకర్ అంటే ఒకప్పుడు ఉదయభానే… కొన్ని సినిమాల్లో ఏవో చిన్నాచితకా వేషాలు వేసినా సరే, ఆమె బలం యాంకరింగే… ప్రస్తుతం వెలిగిపోతున్న సుమతో పోలిస్తే కూడా ఉదయభాను మొదట్లో పాపులర్… అయితే..? ఒక్కసారి (పదేళ్ల క్రితం) మాటీవీలో జానపద పాటల వేదిక (రేలా రేలారే)పై ఓ పాట పాడింది…
Ads
నిప్పులు… గద్దె కోసమే గాడిద కొడుకుల గత్తర లేపెరా అంటూ అప్పటి రాజకీయాలపై నిప్పులు కురిపించింది… ఆ వాక్యాలు వివాదాన్ని రేకెత్తించాయి… ఆ పాట ఎవరిని తాకింది..? ఎవరెందుకు ఆమె కక్ష కట్టారు..? ఈ మిస్టరీని ఆమె ఎప్పుడూ నేరుగా చెప్పదు… అంత ధైర్యంగా గళం విప్పిన ఆమె తనపై కక్ష కట్టినవాళ్లు ఎవరో మాత్రం చెప్పదు…
ఆమే చెబుతోంది… ఆ పాట తరువాతే తన మీద కక్షలు ప్రయోగించారని…! అందుకే టీవీల్లో తనకు అవకాశాలు తగ్గిపోయాయని ఆమె ఆరోపణ (దిగువ వీడియో క్లిప్పింగ్ చూడండి)…
గంగ గరుడాలెత్తుకెళ్ళేరా..ఇంక ఆంబోతులాట సాగేరా..
ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కండ్లు సూడు
భూమి బుగ్గై పోయె.. సూడు బొంద గడ్డల జోరు సూడు..
ఎవ్వారొ…
ఎవ్వారొ ముద్దు బిడ్డలు రా… ఎందుకనొ పరుగెట్టినారు రా..
ఎవ్వారొ ముద్దు బిడ్డలెందుకనొ పరుగెట్టినారు
ఎర్రనీ మడుగుల్ల మునిగి ముద్దలాయె ముద్దు బిడ్డల్
బోరు బోరుగ గండమోర్లు పెట్టి గుండె పగిలే తల్లులు
ఈ కడుపుకోతలు నార్పెదెవ్వరు రా
ఆ కలుపు మొక్కల కాల్చెదెవ్వడు రా
రాకాసి బల్లులంతా రాజ్యమేలే రాజులంటా
రావణాసురులంత జేరి రోజు కొక్కా రచ్చ పెడితే..
పంట చీడను మట్టు పెట్టే పురుగు మందుల విందులాయె
ఎంత నెత్తురు ఏరులైన వ్వాని దూప తీరదాయే
జాలి జూపర జంగమయ్యా జాగిలాలా జాతరాపరా
కొండ దిగిరా కొమూరన్నా కొండ ముచ్చుల కోర్కె దీర్పరా
రెండు పూటల్ పస్తులుండీ నిండు ప్రాణాలెన్నొ మింగె
గోండ్రు కప్పలు గుంట నక్కలు కాకి కూత కోడెనాగులు ..
గద్దె కొరకే గాడ్దికొడుకుల్ గత్తారా లేపేరురా
ఇది మారీచులాటరా నువ్ మర్మమెరుగర పామరా
ఆడు తెస్తడొ, ఈడు తెస్తడు
అవ్వ ఇస్తదొ అయ్య తెస్తడొ
ఎవ్వడిచ్చెదేంది రా ఇది ఎవ్వనీ జాగీరురా..
నీకు నువ్వే రాజురా నిన్నేలెటోడింకెవడురా
గంగ గరుడాలెత్తుకెళ్ళేరా ..ఇంక ఆంబోతులాట సాగేరా
ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కన్ను సూడు
భూమి బుగ్గై పోయె సూడు బొంద గడ్డల జోరు సూడు..
గంగ గరుడా… గంగ గరుడాలెత్తుకెళ్ళేరా
ఇదీ పాట… ఈమె అందరినీ నిందిస్తున్నదని కక్ష కట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది..? అన్ని టీవీ చానెళ్లకు ఫోన్లు చేసి, ఆమెకు అవకాశాలిస్తే మర్యాద దక్కదని బెదిరించారా ఎవరైనా..? అంతగా తొక్కాల్సినంత పాపులరా ఆమె..? ఆమె థ్రెట్ అవుతుందని భయముందా ఎవరికైనా..? ఆమె తన గురించి ఎక్కువ ఊహించుకుంటోందా..?
ఆమె అధికారిక వయస్సు 43 ఏళ్లు… ఎస్, మొదట్లో ఆమె ఎనర్జీ, స్పాంటేనిటీ, స్పందించే గుణం ఆమెను టాప్ యాంకర్‌గా నిలిపాయి… కానీ ఆమెకు కుటుంబ సమస్యలున్నయ్… ఆమె తండ్రి డాక్టర్, తల్లి ఆయుర్వేద వైద్యురాలు. తండ్రి ఒక కవి. ఆయన కలంపేరు ఉదయభాను. దానినే కూతురుకు పెట్టాడు. ఆయన ఉదయభానుకు నాలుగేళ్ళ వయసులో చనిపోయారు. ఆయన చనిపోయాక తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకొంది. అతడికి ఏడుగురు సంతానం. ఆమె 15 వ ఏట ఒక ముస్లింతో వివాహం జరిగింది. ఆమెకు ఇష్టం లేకపోవటం వలన విడాకుల అనంతరం విజయకుమార్ అనే అతడిని తల్లి అనుమతికి వ్యతిరేకంగా వివాహం చేసుకొన్నది. ఎంఏ వరకూ చదివింది… ప్రస్తుతం భర్త శ్రీనివాస్ అని వికీపీడియా చెబుతోంది… సో, పెళ్లి, చికాకులతో కొన్నాళ్లు సఫరయింది…
క్రమేపీ వయస్సు పెరుగుతుండటం, కొత్త యాంకర్లు చాలామంది దూసుకురావడంతో ఈమె వెనుకబడిపోయింది… ఝాన్సీ, సుమ, ఉదయభాను మొదట్లో పాపులర్ యాంకర్లు… ఝాన్సీ యాంకరింగ్ కన్నా సినిమా అవకాశాల మీద దృష్టి పెట్టి, అందులోనే తన్లాడుతోంది… సుమ ఈరోజుకూ టాప్… ఉదయభాను మెరిట్ తనకు ప్లస్ కావడంకన్నా తన స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ తనకు బాగా మైనస్ అయ్యిందా..? అంతకుమించి ఆమెను ఆ పాట పాడినందుకు తొక్కేయాల్సినంత సీన్ ఉందా..? పోనీ, ఎవరు తొక్కారో వెల్లడించవచ్చు కదా..!!
Share this Article