సహజంగానే ‘మార్గదర్శి’పై చిట్స్ రిజిష్ట్రార్ ప్రకటన కూడా ఈనాడులో వచ్చిందని అనుకున్నారు చాలామంది… కానీ రాలేదు… బహుశా ఈనాడే ఆ యాడ్‌ను యాక్సెప్ట్ చేసి ఉండదు… తన చిట్స్ చందాదారుల గ్రూపులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడాన్ని తన పత్రికలోనే ఫుల్ పేజీ ప్రకటనగా పబ్లిష్ చేయడానికి మనసొప్పి ఉండదు… సర్కారీ నిర్ణయానికి తాము ఆమోద ముద్ర వేయడం దేనికని భావించి ఉంటుంది…
ఎలాగూ ఏపీప్రభుత్వం ఆంధ్రజ్యోతికి యాడ్స్ ఇవ్వదు, సో ఆ పత్రికలోనూ కనిపించలేదు… అత్యంత సహజంగా సాక్షిలో కనిపించింది… గతంలో ఈనాడుకు తప్పనిసరిగా ప్రభుత్వ యాడ్స్ ఇచ్చేవాళ్లు… లార్జెస్ట్ సర్క్యులేటెడ్ కాబట్టి సెకండ్ స్థానంలో ఉన్న సాక్షికి యాడ్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ప్లేసులో ఉన్న ఈనాడుకు తప్పకుండా ఇవ్వాలనే రూల్ పాటించేదేమో జగన్ ప్రభుత్వం… ఐనా జగన్ ప్రభుత్వం ఏ రూలైనా తీసి బయటపడేస్తుంది కదా, ఈనాడు వంటి విషయాల్లో మరీనూ…
నిజానికి ఈనాడుకు యాడ్స్ రెగ్యులర్‌గానే వచ్చేవి… ఈమధ్య ఈనాడు ఏ ప్రభుత్వ యాడ్‌నూ యాక్సెప్ట్ చేయడం లేదు… తమకు సకాలంలో పేమెంట్స్ ఇవ్వడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నదని ఓ కారణం కూడా చెప్పింది… ఈనాడే రిజెక్ట్ చేయడంతో జగన్ ప్రభుత్వానికి సంతోషమనిపించింది… ఇక ఈనాడు లెటర్ చూపించి, ప్రభుత్వ యాడ్సన్నీ ఎంచక్కా సాక్షికే ఇచ్చేసుకోవచ్చు…
Ads
ఇక్కడ కొన్ని ప్రశ్నలు… ఏపీలో ఒక్క మార్గదర్శి చిట్‌ఫండ్స్ మాత్రమే నియమాల్ని ఉల్లంఘిస్తోందా..? మిగతావన్నీ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తున్నాయా..? ఒక్క మార్గదర్శే దేనికి..? దేనికంటే… అది ఈనాడు ఆర్థికమూలం కాబట్టి… రామోజీరావుకు సంబంధించిన ప్రతి సంస్థ నష్టాల్లో ఉంది, ఒక్క మార్గదర్శే ఈనాడు వ్యవస్థను, అనగా రామోజీ గ్రూపు పోషిస్తోంది… జగన్ తన తండ్రి వైఎస్ఆర్ కాదు కాబట్టి ఈనాడును సమూలంగా పెకిలించడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి…
గతంలో వైఎస్ పదే పదే ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలను కడిగేసేవాడు… తరువాత తనే సాక్షిని పెట్టాడు… శ్రీశ్రీ చెప్పిన ‘కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకీ పకీర్లు, పుకార్లకీ నిబద్ధులు’ అన్నట్టే సాక్షి వ్యవహారం ఉండేది, అది వేరే సంగతి… జగన్ వెళ్లి ఓసారి రామోజీని కలిసి మాట్లాడాక… మార్గదర్శి ఎండీ శైలజ, సాక్షి చైర్మన్- జగన్ భార్య భారతిల చొరవతో… మధ్యలో కొంతకాలం ఈనాడు వర్సెస్ సాక్షి వైరం ఆగిపోయినా మళ్లీ ఈమధ్య బాగా పెరిగిపోయింది…
చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఇది పులివెందుల మార్క్… వైఎస్ రామోజీ ఫిలిమ్ సిటీ భూముల కొనుగోలు లోపాల్ని పట్టుకున్నాడు… మార్గదర్శి ఫైనాన్స్ యవ్వారాన్ని గెలికాడు… మార్గదర్శి ఫైనాన్స్ అక్రమాల కేసు ఈరోజుకూ సుప్రీంలో ఉంది… భూముల యవ్వారం తవ్వితే బోలెడు, కానీ కేసీయార్‌తో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఢోకా లేదు, సంబంధాలు చెడిపోతే కదా లక్ష నాగళ్లు బయటికి వచ్చేది…
సో, తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా తను ఎంటరయ్యే కారణాలను వెతికిన జగన్‌కు రెండు ఇష్యూస్ కనిపించాయి… 1) మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి కొనసాగిస్తున్న వ్యాజ్యంలో తను ఇంప్లీడయింది… కేసీయార్ ప్రభుత్వం కాలేదు, కారణం ఇంతకుముందు చెప్పుకున్నదే… 2) మార్గదర్శి చిట్స్ విషయంలో జగన్ ఎంటరయ్యాడు… సంకల్పం ఈనాడును ఆర్థికంగా తొక్కేయడమే… మరోసారి చెప్పుకోవాలి… జగన్ తన తండ్రిలాగా గెలికి వదిలేయడు… సమూలంగా పెకిలించే ప్రయత్నం చేస్తాడు… అందుకే మార్గదర్శిని పక్కాగా ఫిక్స్ చేస్తున్నాడు…
రెండు విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి ఇక్కడ… 1) మార్గదర్శిపై చందాదారుల విశ్వాసం… మార్గదర్శి ఫైనాన్స్ వ్యవహారం వేరు, ఆ డిపాజిట్లు పెద్ద పెద్ద ఖాతాదారులవి… మార్గదర్శి చిట్స్ విషయం వేరు… చిన్న చిన్న చందాదారులు అనేకులు… తమ డబ్బు ఉన్న ఏ సంస్థపై ఏ ఆరోపణలు వచ్చినా సరే చందాదారుల్లో ఒక్కసారిగా విశ్వాసం సడలిపోతుంది… ఆందోళన వ్యక్తమైంది… ఐనాసరే, మార్గదర్శి చిట్స్ విషయంలో ఏ ఒక్క చందాదారుడి నుంచీ నెగెటివ్ స్పందన లేదు… అది రామోజీపై చిట్స్ కస్టమర్ల విశ్వాసం…
2) ఒక పత్రిక లేదా ఒక మీడియా గ్రూపు ఆర్థికమూలాలను పెకిలించే ప్రయత్నం కూడా ఆ మీడియాపై దాడిలాగే చూస్తుంది పాత్రికేయలోకం… ఈనాడు సిబ్బందిని ఎప్పుడూ జర్నలిస్టు యూనియన్ కార్యకలాపాల్లోకి రానివ్వడు రామోజీ… గతంలో చేదు అనుభవాలు కారణం కావచ్చు… సో, ఇప్పుడు ఈనాడుకు సమస్య వస్తే పాత్రికేయలోకం అందుకే లైట్ తీసుకుంటోంది… పైగా సాక్షి, ఈనాడు సంస్థాగత వైరం, మార్గదర్శిపై దాడికి రాజకీయ కారణాలు గట్రా మొత్తం లోకం అర్థం చేసుకుంటోంది కాబట్టి పత్రికా స్వేచ్ఛ, మీడియాపై దాడి అనే కోణంలో దీన్ని ఎవరూ చూడటం లేదు..
మార్గదర్శి విషయంలో జగన్ దూకుడు ఏకంగా చందాదారుల గ్రూపుల రద్దు దాకా పోయింది… కోర్టు కఠిన వైఖరిని ప్రదర్శించకూడదు అంటున్నా సరే, జగన్ ప్రభుత్వం తన దూకుడు ఆపడం లేదు… చందాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుందీ అనుకున్నట్టుంది జగన్ ప్రభుత్వం… అదేమీ లేకపోవడంతో నియమోల్లంఘనల్ని చూపించి ఏకంగా గ్రూపుల రద్దు వైపు దృష్టి సారించింది… ఇదే కేసీయార్ ప్లేసులో గనుక జగన్ ఉన్నట్టయితే కథ ఇంకా వేరేగా ఉండేది… వెరసి జగన్ వర్సెస్ మార్గదర్శి ఇక్కడితో ఆగేట్టు లేదు…
Share this Article