ముందుగా ఓ కర్నాటక వార్త చదవండి… నిన్నామొన్న కర్నాటక పత్రికల్లో వచ్చిందే… ఆయన పేరు హెచ్‌డీ రంగనాథ్… మొన్నటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కునిగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించాడు… తను ఆర్థోపెడిక్ సర్జన్ … ఎమ్మెల్యేగా ఎన్నికైనా వీలు చిక్కినప్పుడల్లా వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు…
తుమకూరు సమీపంలోని యాదవని… అక్కడ శివనంజయ్య అనే రైతు… తను 20 ఏళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తనది. శివనంజయ్యను పరీక్షించిన డాక్టర్లు అతడు రూమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాడని… మోకాలి కీళ్ల మార్పిడి సర్జరీ చేయాలని నిర్ణయించారు… ఓ మోస్తరు ప్రయివేట్ హాస్పిటళ్లలో సర్జరీకి రూ.2 లక్షలు ఖర్చవుతుందని… కార్పొరేట్ హాస్పిట్‌లోనైతే రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు…
తన దగ్గర అంత డబ్బు లేదు… ఆర్థిక సాయం చేయాలంటూ శివనంజయ్య ఎమ్మెల్యేను కలిశాడు… పరిస్థితి వివరించి, సాయం చేయాలని కోరాడు… అతడికి డబ్బులిచ్చి పంపించడంకన్నా తానే ఉచితంగా సర్జరీ చేస్తే ఇంకా బాగుంటుందని సదరు ఎమ్మెల్యే భావించాడు… అనుకున్నదే తడవుగా తన స్నేహితుడైన డాక్టర్ దీపక్‌తో కలిసి బెంగళూరులోని బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్‌లో శివనంజప్పకు ఉచితంగా ఎడమ మోకాలు సర్జరీ చేశాడు… మరో మూడు నెలల తర్వాత కుడి మోకాలి కీలు సర్జరీని కూడా ఉచితంగా చేస్తామని చెప్పాడు… ఇలాంటిదే మరో ఉదాహరణ…
Ads
మొన్నటి ఎన్నికల ప్రచారం సమయంలో కునిగల్ తాలుకాలోని కుందూరు అనే గ్రామానికి ఈ డాక్టర్ రంగనాథ్ వెళ్లాడు… ఆ ఊరికి చెందిన ఆశా శంకర్ అనే 42 ఏళ్ల మహిళ తన ఆరోగ్య పరిస్థితిని గురించి చెప్పుకుంది… ‘‘నా పేరు ఆశ… స్కూల్లో వంట మనిషిని… 12 ఏళ్ల క్రితం హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు… ఈ మధ్యే ఇంటి దగ్గర కింద పడిపోయా… అప్పటి నుంచి తుంటిలో నొప్పి వస్తోంది, నడవలేకపోతున్నా… హాస్పిటల్‌కు వెళ్లి చూపించుకుంటే సర్జరీ చేయాలన్నారు…
రూ.5- 6 లక్షలు ఖర్చవుతుందన్నారు… మా ఆయన ఆటో డ్రైవర్. ఆపరేషన్‌కు అంత మొత్తమంటే మా వాళ్ల కాదయ్యా… మీరే ఏదైనా దారి చూపించాలి..’ అని ఆమె వేడుకుంది. ఆమె మెడికల్ రిపోర్టులు పరిశీలించిన డాక్టర్ రంగనాథ్.. ఎన్నికల హడావుడి కాస్త తగ్గాక నీకు నేనే ఫ్రీగా సర్జరీ చేస్తానని చెప్పాడు… అన్నట్టుగానే జూన్ 26న ఆమెకు బెంగళూరులోని అదే బౌరింగ్ హాస్పిటల్‌లో ఉచితంగా సర్జరీ చేశాడు… సదరు ఎమ్మెల్యేపై అభినందనల వర్షం కురుస్తోంది…… ఇదీ వార్త…
ఎస్.., ఒక వైద్యనిపుణుడిగా పేదల పట్ల కన్సర్న్ చూపించే మనసున్న రాజకీయ నాయకుడిగా తన మంచి, దయా గుణాన్ని ప్రస్తుతించాల్సిందే… కానీ ఇంకో కోణంలో చూస్తే తనే స్వయంగా ఈ ఆపరేషన్లు చేయడంకన్నా తన టైమ్‌ను నియోజకవర్గంలోని ఇతరత్రా సమస్యల పరిష్కారానికి వెచ్చించడం కరెక్టని అనిపిస్తుంది… ఈ రెండు కేసుల్లోనూ ప్రభుత్వసాయం చేయడానికి వీలుంది… తను స్వయంగా డబ్బు ఇవ్వడంకన్నా, తనే సర్జరీలు చేయడంకన్నా, బాధితులకు అవసరమైన సర్కారీ ఆరోగ్య పథకాల నుంచి సాయం ఇప్పించాల్సింది…
ఎందుకంటే… ప్రతి కేసులోనూ తనే స్వయంగా అటెండ్ కాలేడు… చాలారకాల వ్యాధులు, అనారోగ్యాలు, వాటికి చికిత్సలు, బిల్లులు అన్నీ తనే డీల్ చేయలేడు… అందరికీ స్వయంగా డబ్బు సాయం కూడా చేయలేడు… కర్నాటకలో మొన్నటిదాకా బీజేపీ సర్కారు ఉండేది… అక్కడ ఆరోగ్య కర్నాటక స్కీమ్ ఉంది… దాని కింద ఉచితంగా ఆపరేషన్లను చేయించే వీలుంది మన ఆరోగ్యశ్రీ పథకంలాగే… ప్రధానమంత్రి జనఆరోగ్య యోజన స్కీమ్ పేరుతో రనవుతుంది ఇది… వాజపేయి ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యభాగ్య, యశస్విని, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్, ముఖ్యమంత్రి సాంత్వన, ఇందిరా సురక్ష యోజన, కాంక్లియర్ ఇంప్లాంట్ తదితర పాత పథకాలన్నీ కలిపేసి ఆరోగ్య కర్నాటక పథకాన్ని రూపొందించారు… ఎమ్మెల్యే సాబ్, వింటున్నారా..?! అంతెందుకు..? ఈ పరిధిలో లేని వారు ఉంటే ఏకంగా సీఎంఆర్ఎఫ్ నుంచి కూడా సాయం చేయించవచ్చు…!!
Share this Article