ఒక న్యాయస్థానం తీర్పుపై అభిప్రాయం వ్యక్తం చేయడం తప్పు కాదు, నేరం కాదు… అలాగే న్యాయస్థానాలు చట్టాల అసలు స్పూర్తిని పరిగణనలోకి తీసుకోవాలే తప్ప, దాన్ని నీరుకార్చకూడదు….. ఒక పన్నెండేళ్ల బాలికపై ఓ నడివయసు పురుషుడు చేసిన అకృత్యం, దానిపై ముంబై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మీద తెలుగు సమాజంలో జరగాల్సినంత చర్చ జరగడం లేదేమో అనిపిస్తోంది… బహుశా కోర్టు తీర్పు కదా అని తమాయించుకుంటున్నారేమో… కానీ ఒక కోర్టు చెప్పిన తీర్పు అల్టిమేట్ ఏమీ కాదు… ఒక తీర్పు సమాజానికి దీర్ఘకాలికంగా నష్టం చేసేలా ఉంటే సమాజం స్పందించడం కూడా తప్పు కాదు… ఒక చిన్మయి, ఒక తాప్సి తప్ప ఈ తీర్పు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసే వివేచనపరులే లేరా అని ఆశ్చర్యం వేస్తోంది… పిచ్చి పిచ్చి విషయాలపై సోషల్ మీడియా, మీడియాలో రంకెలు వేస్తుంటారు గానీ, నిజంగా చర్చ జరగాల్సిన అంశాల్ని గాలికి వదిలేస్తున్నట్టూ అనిపిస్తోంది…
ఒకడు… జామకాయ ఇస్తాను రా అంటూ పన్నెండేళ్ల బాలికను ఇంట్లోకి తీసుకెళ్లాడు… (పదాలు, భాష… రాయడం కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా సరే, కేసు తీవ్రత అర్థం కావాలి కదా, సూటిగానే చెప్పుకుందాం…) ఆ పిల్ల వక్షోజాలను పట్టుకున్నాడు… ఆమె టాప్, సల్వార్ తీయడానికి ప్రయత్నించాడు… ఆమె భయంతో కేకలు వేసింది… ఆమె నోరు మూసి, తలుపు వేసి, బయట గడియ పెట్టాడు… కానీ ఆ పిల్ల తల్లి ఈ కేకలు విని పరుగెత్తుకొచ్చి, ఆ పిల్లను కాపాడుకుంది… కేసు పెట్టింది… పోక్సో చట్టం కింద కోర్టు శిక్ష వేసింది… కేసు హైకోర్టుకొచ్చింది… స్కిన్ టు స్కిన్ టచ్ లేదు, లైంగిక దాడిగా ఎలా చెప్పగలం..? అని తీర్పు వచ్చింది… ఆ చట్టం ప్రకారం… నిందితుడు చేతితో పిరుదులను, స్తనాలను, ఇతర భాగాలను పట్టుకుంటే నేరమట… లేదా బాలికలతో తన మర్మాంగాన్ని, పిరుదులను చేతితో పట్టించుకుంటే నేరమట… లైంగిక వేధింపులకు అసలు చట్టంలో పేర్కొన్న నిర్వచనాలే తప్పుగా ఉన్నప్పుడు… ఇక శిక్షలేం పడతాయి..? ఆ చట్టానికి ఉన్న విలువ ఎంత..?
Ads
అంటే… చేతులతో నేరుగా వక్షోజాలను పట్టుకుంటేనే అది లైంగిక దాడా..? అదే లైంగిక వేధింపా..? చట్టం నిర్వచనం ప్రకారం ఈ దైహికచర్యలు లైంగిక దాడి కిందకు రావా… అదెలా..? సంభోగవాంఛ లేకపోవచ్చు, ఇతర పార్ట్స్ జోలికి పోకపోవచ్చు, ఆ టైం, చాన్స్ దొరక్కపోవచ్చు కానీ ఆ లైంగికపరమైన తృప్తి కోసమే కదా వాడు ఆ తప్పుడు పనికి పాల్పడింది… ఆ బాలిక ప్రైవేటు పార్ట్స్ ఏవైనా సరే, బట్టల మీద నుంచైనా సరే, ఒక పురుషుడు టచ్ చేస్తూ, ఒత్తుతూ, పట్టుకుంటూ తన మనోవికారాన్ని ప్రదర్శిస్తే… అది ఆ చట్టం నిర్వచనాలు, ఉద్దేశాల నుంచి ఎలా తప్పించుకోగలదు..? వక్షోజాలను ప్రెస్ చేయడం, సల్వార్ తీసేయడానికి ప్రయత్నించడం పోక్సో చట్టంలోని 7వ సెక్షన్ చెప్పిన లైంగిక దాడి నిర్వచనం కిందకు వస్తాయా, రావా..? 8వ సెక్షన్ ప్రకారం శిక్షార్హమా, కాదా అని పరిశీలించాలా కోర్టు..? లేక నిందితుడి తప్పుడు ఉద్దేశాల్ని పరిగణనలోకి తీసుకోవాలా..? అవసరమైతే కాస్త స్వేచ్ఛ తీసుకుని, పోక్సో (పిల్లలపై లైంగిక వేధింపులపై చేసిన చట్టం)కు సవరణలు అవసరం అనే అభిప్రాయాన్ని కూడా కోర్టు చెప్పి ఉంటే బాగుండేది కదా…
ప్రత్యేకంగా ఆ చట్టం ఇక్కడ సరిగ్గా వర్తించదు, నిందితుడికి శిక్ష సరిగ్గా వేయడం సాధ్యం కాదు అనుకున్నప్పుడు… చట్టం, సెక్షన్లు మార్చుకునే వీలు కూడా ఉంది కదా… ఇక్కడ న్యాయం జరగడం ముఖ్యం..? ముంబై హైకోర్టు తీర్పు సరైన స్పిరిట్‌లో లేదు అనుకున్నప్పుడు… దానిపై సొసైటీ స్పందిస్తే తప్పేమీ లేదు… ఆ తీర్పును సమీక్షించడానికి ఇంకా పైకోర్టులున్నయ్… ధర్మాసనాలున్నయ్… అవసరమైతే జువెనల్, పోస్కో చట్టాల్లోని సందిగ్ధతల్ని, లొసుగుల్ని సవరించడానికి అవకాశాలున్నయ్… చిన్న వయస్సులో ఎవరైనా తమ పట్ల తప్పుడు పనులకు పాల్పడితే, ఆ ప్రభావం పిల్లలపై దీర్ఘకాలికంగా ఉంటుంది, జీవితాంతం వెంటాడే ప్రమాదమూ ఉంది… అందుకని పిల్లల పట్ల లైంగిక నేరాలకు పాల్పడే వారికి శిక్షలు తప్పనిసరి… తప్పించుకునే లూప్ హోల్స్‌ను మూసేయడమూ తప్పనిసరి… ముంబై హైకోర్టు తీర్పు ఆ దిశగా ఆలోచనల్ని ప్రేరేపిస్తే బాగుండు..! చివరగా :: రేప్పొద్దున ఎవడైనా గ్లవుజ్ వేసుకుని, ఏం చేసినా తప్పు లేదా..? ఆఫీసుల్లో, బస్సుల్లో, ఇంకెక్కడైనా పిల్లల ప్రైవేటు పార్ట్స్‌ను ఏం చేసినా నేరం కాదా అని ఓ మిత్రురాలు ప్రశ్నించింది… చాలా సీరియస్ ప్రశ్న…
Share this Article