గురువును మించిన చదరంగ శిష్యుడు… టాప్-10 జాబితాలోకి భారత యువ గ్రాండ్ మాస్టర్… తనకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న విశ్వనాథన్ ఆనంద్‌నే అధిగమించాడు అతడి శిష్యుడు… ఫిడే ర్యాంకింగ్స్‌లో తొలిసారి 9వ స్థానంలోకి దూసుకొచ్చిన ఈ చెన్నై యువ కెరటం పేరు గుకేశ్ (Gukesh)…
గత 36 ఏళ్లుగా ఫిడే (FIDE) చెస్ రేటింగ్స్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ టాప్-10లో కొనసాగుతున్న విషయం తెలిసిందే… అయితే, ఈ నెలాఖరున ఫిడే ప్రకటించబోయే ర్యాంకుల్లో మాత్రం ఆనంద్ పేరు ఉండే అవకాశం తక్కువ. ఆ స్థానంలో అతడి శిష్యుడు, యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ వచ్చేశాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ ప్రస్తుతం 2,754 రేటింగ్‌తో పదో స్థానంలో నిలిచాడు… అయితే, ప్రపంచ కప్ మూడో రౌండ్‌కు చేరిన 17 ఏళ్ల గుకేశ్ 2,755 రేటింగ్‌తో తొమ్మిదో ర్యాంక్‌కు చేరాడు… కార్ల్‌సన్ (2,838) అగ్రస్థానంలో ఉన్నాడు… సెప్టెంబర్ 1న ఫిడే అధికారిక రేటింగ్ జాబితా విడుదల కానుంది…
కేవలం 16 నెలల్లోనే..
గతేడాది ఏప్రిల్‌లో గుకేశ్ తొలిసారి టాప్-100లోకి ఎంట్రీ ఇచ్చాడు. కేవలం 16 నెలల వ్యవధిలోనే తొమ్మిదో ర్యాంకుకు చేరుకోవడం విశేషమే. అలాగే ఆనంద్ కాకుండా మరో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే టాప్-10లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు గుకేశ్ కాగా.. 2016లో పెండ్యాల హరికృష్ణ ఈ ఫీట్‌ను సాధించాడు. 17 ఏళ్ల గుకేశ్ అత్యంత పిన్న వయసులోనే 2,750 రేటింగ్స్ మార్క్‌ను తాకిన ప్లేయర్‌గానూ రికార్డు సృష్టించాడు. చెన్నైకు చెందిన గుకేశ్ 2019లో పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు…
Ads
అతడు అద్భుతం: విశ్వనాథన్ ఆనంద్
‘‘గత ఏడాదిన్నర నుంచి గుకేశ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అతడి టాలెంట్ నన్ను మాత్రమే కాకుండా ప్రపంచ చెస్ అభిమానులను మంత్రముగ్దులను చేసింది. చెస్ పట్ల అతడికున్న అంకితభావం అపూర్వమైంది. అతడి సత్తా పట్ల నాకు నమ్మకముంది. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టాప్‌లో నిలవాలి. ఆట పట్ల నిబద్ధత, సంకల్పం, ప్రయోగాలు చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే అతడు ఇలాగే కొనసాగాలి’’ అని ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్ వ్యాఖ్యానించారు…. by అనంచిన్ని వెంకటేశ్వరరావు…
Share this Article