రుతుమహిళల్ని శబరిమల గుడిలోకి అనుమతించడం మీద పెద్ద రచ్చే జరిగింది… ఇది కుల, మత వివక్ష కాదు, లింగవివక్షే అని కోర్టు చెప్పేసరికి, హిందుత్వం మీద దాడికి భలే చాన్స్ దొరికింది అనుకున్న కేరళ సీపీఎం ప్రభుత్వం సింబాలిక్‌గా ఇద్దరు మహిళల్ని తనే పోలీస్ బందోబస్తుతో మరీ ప్రవేశపెట్టింది…
ఒక్కో గుడిలో ఒక్కో ఆచారం, పద్దతి ఉంటాయి… కోర్టులు ఏమైనా ఆగమశాస్త్రాల ప్రకారం తీర్పులు చెబుతున్నాయా..? వాళ్లకు ఏం తెలుసు..? ఒక గుడి ఆచారాన్ని యథాతథంగా పాటిస్తే తప్పేమిటి అని మండిపడుతూ అయ్యప్ప భక్తులు మనోభావాల్ని గాయపరుచుకున్నారు… జనంలో ఈ వ్యతిరేకత గమనించి లెఫ్ట్ ప్రభుత్వంలోని ఓ భాగస్వామ్య పార్టీ ప్రభుత్వమే నిర్వహించిన ‘అపవిత్రీకరణ ప్రయత్నం’ మీద లెంపలేసుకుంది… అదంతా వేరే కథ…
సేమ్, శనిసింగాపూర్‌లో విగ్రహాన్ని మహిళలు తాకవచ్చునని మరో తీర్పు… ఉజ్జయినిలో శివలింగం అభిషేకానికి ఏమేం వాడొచ్చో, ఏమేం వాడొద్దో కోర్టు పరిమితులు… మంచు తుఫాన్లు వస్తాయని మరో చోట నినాదాలు చేయవద్దని, గంటలు కొట్టవద్దని మరో నిర్దేశం… అసలు హిందూ మత వ్యవహారాల్లో కోర్టులు ఏ జ్ఞానంతో తీర్పులు చెబుతున్నాయనే చర్చ సొసైటీలో సాగుతూనే ఉంది… కానీ ఇది నాణేనికి మరోవైపు… కోర్టులు తప్పకుండా ఇలాంటి ఇష్యూల్లో ఇన్వాల్వ్ కావచ్చునని అనిపించే తీర్పు…
Ads
ఈ తీర్పు మద్రాస్ హైకోర్టు ఇచ్చింది… ఈరోడ్ జిల్లాకు చెందిన తంగమణి… తనకు భర్త లేడు… ఆయన ఒక గుడిలో పూజారిగా ఉండేవాడు… ఆయన బతికి ఉన్నప్పుడు తంగమణి కూడా నిండు ముత్తయిదువలా గుళ్లో సేవలు చేసింది… ఆమెకు ఓ కొడుకు… ఎప్పుడైతే భర్త మరణించాడో ఇక ఆమెను గుడిలోకి అనుమతించవద్దంటూ గ్రామ పెద్దలు పలువురు అడ్డుపడ్డారు… దేవుడి సేవకు ఆమెను దూరం చేశారు… అంతేకాదు, గుడి తరఫున జరిగే ఏ ఉత్సవానికీ రాకూడదని హుకుం జారీచేశారు…
ఆమె పోరాడదల్చుకుంది ఈ వివక్షపై… కింది కోర్టులు కూడా దాటి హైకోర్టు దాకా వచ్చింది కేసు… నిజానికి వితంతువుల్ని గుడిలోకి రానివ్వని పద్ధతి ఏ గుడిలోనూ పెద్దగా కనిపించదు… ఒంటరి మహిళలే ఎక్కువగా భక్తిని ఆశ్రయిస్తుంటారు… ఒక మహిళ వ్యక్తిగత హోదా ఆమె వైవాహిక స్థితి మీద ఆధారపడి ఉంటుందా..? హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ కూడా అదే అన్నాడు… వితంతువు అనే కారణంతో గుడిలోకి రానివ్వకుండా నిరోధించే హక్కు ఎవరికీ లేవని, అది నేరం అవుతుందనీ విస్పష్టంగా తన తీర్పులో పేర్కొన్నాడు…
ఒక వితంతువు ఆలయంలోకి ప్రవేశించడం వల్ల ఆలయ ప్రాంగణం అపవిత్రంగా మారుతుందని భావిస్తూ, కొంతమంది స్థానికులు తనను బెదిరించారని పిటిషనర్-మహిళ కోర్టుకు తెలిపింది… రాష్ట్రంలో ఇలాంటి ప్రాచీన విశ్వాసాలు ఇంకా కొనసాగడం దురదృష్టకరమని జస్టిస్ వెంకటేష్ అన్నాడు… ‘‘ఒక స్త్రీకి వైవాహిక స్థితిని బట్టి ఆమె గుర్తింపు ఏ విధంగానూ దిగజారదు’’ అంటాడు ఆయన…
“ఒక వితంతువు దేవాలయంలోకి ప్రవేశిస్తే అది అపవిత్రతకు కారణమవుతుందనే ప్రాచీన విశ్వాసాలు ఈ రాష్ట్రంలో కొనసాగడం చాలా దురదృష్టకరం. సంస్కర్తలు ఈ అర్ధంలేని నమ్మకాలన్నింటినీ బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, కొన్ని గ్రామాల్లో ఇది ఆచరించబడుతోంది. ఇవి పురుషుడు తన సౌలభ్యం కోసం రూపొందించిన సిద్ధాంతాలు మరియు నియమాలు… ఇది నిజానికి భర్తను కోల్పోయిన స్త్రీని కించపరుస్తుంది. చట్టబద్ధమైన పాలనలో ఉన్న నాగరిక సమాజంలో ఇవన్నీ ఎప్పటికీ కొనసాగవు. ఎవరైనా వితంతువులను ఆలయంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుంది” అని కోర్టు పేర్కొంది…
ఎవరైనా ఆమెను, ఆమె కొడుకును అడ్డుకుంటే వారి మీద కఠినచర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులకు సూచించింది… అంతేకాదు, ఈ విషయంలో ఆమెను బెదిరిస్తున్నవారిని పిలిచి కౌన్సెలింగ్ చేయాలని కూడా చెప్పింది… గుడ్… మంచి తీర్పు… వితంతువుల ప్రవేశంతో గుడి మైలపడుతుందనే వాదన శుద్ధ తప్పు… ఆ దేవుడు కూడా దాన్ని అంగీకరించడు…!!
Share this Article