‘‘వచ్చే ఏడాది ఎలాగూ ఎన్నికల సంవత్సరం కాదు కదా, మరెందుకు ఇప్పుడు కేసీయార్ నేల విడిచి సాముకు సిద్ధపడ్డాడు..? తెలియదు…! పేరుకు 2.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్… అందులో 50 వేల కోట్ల కొత్త అప్పులు… 45 వేల కోట్ల ఆదాయ లోటు… మరెందుకీ అధిక అంచనాలు..? అంకెల గొప్పలు..? పోనీ, సంకల్పానికి దరిద్రం ఎందుకు ఉండాలీ అనుకుందాం… ఐనా మరీ ఇంతటి అధివాస్తవిక బడ్జెట్‌లా అవసరమా..? ఒకవైపు కరోనాతో లక్ష కోట్ల మేరకు నష్టపోయామని చెబుతూనే… ఈసారి కేంద్రం నుంచి వాటా తగ్గుతుందని అంటూనే… అంకెలరథాన్ని మళ్లీ ఇలా మబ్బుల బాట పట్టించడం దేనికి..? హేమిటో మరి..!!
…. 2021-22 బడ్జెట్ గొప్పల ప్రయాసల మీద ‘ముచ్చట’ విశ్లేషణ అప్పట్లో ఇదే… అన్నీ ఏతులే (అబద్ధాలే, డొల్ల గొప్పలే) అనే విమర్శలకు జవాబుల్లేవు… ఏవో అంకెలు పేరుస్తాం, జనానికి గొప్పగా చూపిస్తాం… అనుకూల మీడియా డప్పులు కొడుతుంది… పొన్నాల లక్ష్మయ్య వంటి ఒకరిద్దరు మినహా ప్రతిపక్షాల్లో బడ్జెట్ గురించి తెలిసినవాళ్లు ఎవరున్నారు..? అసలు బడ్జెట్ కాపీలు చదివే వారెందరు..? అందరూ దాదాపు పాలమ్మి, పూలమ్మి ఎదిగిన మల్లారెడ్డిలే కదా…
మీడియాలో కూడా ఆర్థిక వ్యవహారాలు నిజమైన విశ్లేషణతో రాయగలిగినవాళ్లు చాలా చాలా తక్కువ మంది… ఈమాత్రం దానికి ఒకటీరెండు పత్రికలైతే ప్రత్యేక పేజీలు వేస్తాయి… అదో ఆనందం… ఏదో బడ్జెట్ ఇన్ బ్రీఫ్ చూపించి, ప్రణాళిక- ప్రణాళికేతర వ్యయం అని టీవీల్లో అంకెలు వేస్తారు… శాఖల వారీ కేటాయింపులు చూపిస్తారు… వాళ్లకు తెలిసింది అంతే కదా మరి…
Ads
అంతన్నాడు ఇంతన్నాడే… అనే పాటలాగా బడ్జెట్లు… ఆర్థికశాఖలో ఎవరో ఓ పెద్ద కేలిక్యులేటర్ పెట్టుకుని, చకచకా బటన్లు నొక్కుతాడు… ఏ అంకెలు కనిపిస్తే అవి రాసేస్తారు, అదే బడ్జెట్ అని ఓ మిత్రుడు క్రూడ్ జోక్ వేశాడు… నిజానికి అలాగే ఉంది… అఫ్‌కోర్స్, ఏపీతో పోలిస్తే తెలంగాణ కాస్త బెటర్… అది మరీ అరాచకం… సరే, బడ్జెట్‌లోని గొప్పల బట్టలు ఊడదీసి చూపించేది కాగ్… ఎంత ఆదాయం వచ్చిందో, ఎంత వ్యయం జరిగిందో, బడ్జెట్ అంచనాలకూ వాస్తవానికీ తేడా ఏమిటో కుండ బద్దలు కొడుతుంది…
2021-22 తెలంగాణ బడ్జెట్ మీద కూడా కాగ్ రిపోర్ట్ పరిశీలిస్తే అసలు నిజం బయటపడుతుంది… ఇదుగో…
స్టేట్ ఆదాయం అనుకున్నంత వచ్చింది… పన్నేతర ఆదాయం 30 వేల కోట్లు అనుకుంటే వచ్చింది 8800 కోట్లు… కేంద్ర గ్రాంట్లు 38 వేల కోట్లు లెక్కేసుకుంటే (అసాధారణ రీతిలో) వచ్చింది 8600 కోట్లు… కానీ మరోవైపు జీతాల ఖర్చు, పెన్షన్ల ఖర్చు పెరిగింది… అప్పులు కాస్త పెరిగాయి… ఇంటర్ స్టేట్ సెటిల్‌మెంట్ జీరో… సబ్సిడీలు తగ్గాయి… వెరసి దాదాపు 50 వేల కోట్ల మేరకు బడ్జెట్‌లో కోత తప్పలేదు… మరి అంత లెక్కల గొప్పలు ఎందుకు ప్రదర్శించినట్టు..? అన్నట్లు 2022-23 బడ్జెట్ లెక్కలు కూడా ఇలాగే ఉండబోతున్నాయి… కాదు, మరింత దారుణంగా…!!
Share this Article