By…. Gottimukkala Kamalakar…………… #పల్లిక్కట్టుశబరిమలక్కూ..! 1995 నుండి 1998 వరకు ఆర్ధిక స్థితి అడ్డదిడ్డమైపోయిన సంవత్సరాలు. మూడు వేల రూపాయల జీతంతో ఎనిమిది వేల ఖర్చుతో 1998 అక్టోబర్ కల్లా లక్ష రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయాను. రైల్వే స్టేషన్ లో జేబుదొంగలా ఏ చుట్టం, పరిచయస్తుడి జేబు ఎత్తుగా ఉందా ఓ రెండు వేలడుగుదాం అని చూస్తుండేవాణ్ని. ఐదొందల అప్పు కోసం అంతులేనన్ని అబద్ధాలు చెప్పేవాణ్ని. తట్టుకోలేనంత భారం..! నెలకోసారి జీతం..! నిమిషనిమిషానికీ ఖర్చు..!!
పంబానది హైదరాబాద్ భూగర్భ డ్రైనేజీ కన్నా అధ్వాన్నంగా ఉంది. నేను స్నానం చేయలేదు. దర్శనం ఓ పావుసెకను అయ్యే వుంటుంది. ఆ పదునెట్టాంబడి మీదుగా పోలీసులు ఎత్తి పైకి విసిరేసారు. నేనెందుకో చిన్నపాదం కూడా నడవలేకపోయాను. పాదాలకు బొబ్బలు వచ్చాయి. నా బాల్యస్నేహితులు దాదాపుగా ఎత్తుకుని కిందికి తీసుకొచ్చారు. కాళ్లకు కొబ్బరినూనె రాసారు. మా గురుస్వామి గారు నన్ను గంభీరంగా చూస్తూ “మానసిక వ్యభిచారులకు, ఈ మండలం రోజుల్లో దైహిక వాంఛలు కలిగిన వాళ్లకు కాళ్లు బొబ్బలొస్తాయని ప్రవచించారు. నేను వారిని జాలిగా చూసాను..! ప్రయాణమంతా నా ఒంటిమీద లుంగీ, తుండుగుడ్డ తప్ప మరో వస్త్రం లేదు. నా దగ్గర ఉన్న కాసిన్ని డబ్బులు సుదర్శన్ రెడ్డి దగ్గర పెట్టాను. తనే అడిగనప్పుడల్లా ఇస్తూ ఉండేవాడు. పళనికొచ్చాం. నా కాళ్ల నెప్పులు తగ్గలేదు. ఆ పళని కొండ పళని కొండంత ఎత్తుగా ఉంది. చుట్టూ గమ్మత్తైన పరిచయం లేని తమిళ సంప్రదాయం..! మావాళ్లను ముందెళ్లిపొమ్మని చెప్పాను. నేను డోలాయమాన స్థితిలో మెల్లగా నడుస్తున్నాను.
ఓ ఎనభయ్యేళ్ళ వృద్ధురాలు నాకు ఎదురొచ్చి చేతిలో ఓ పళనిస్వామి శూలం బొమ్మా, నుదుటన చందనం, విభూతి దట్టంగా పూసి చేయిచాచింది. నా దగ్గర దమ్మిడీ లేదు. తనకు తమిళం తప్ప మరో మాట తెలియదు..! సైగలతో డబ్బులు లేవని చెబుతూ, ఆమె శూలం బొమ్మ వెనక్కీయబోయాను. తను వద్దంటూ, పైకి వెళ్లమని సైగ చేసింది. కొండ మీద ఆ స్వామి దర్శనం చేసుకుని, దిగబోతుంటే కాలికి ఏదో తగిలింది. వంగి చూస్తే ఐదొందల నోట్లు మడిచి ఉన్నాయి. మొత్తం ఇరవై వేల ఐదు వందలు..! అవి తీసుకుని చుట్టూ చూసి సుబ్రహ్మణ్యాన్ని సలహా అడుగుతూ చూసాను. తను ఉత్తరక్షణంలో జవాబిచ్చాడు. కిందికి వచ్చాక ఆ డబ్బులన్నీ అక్కడే ఉన్న వృద్ధురాలికిచ్చాను. తను బుగ్గకో అత్యంత మధురమైన ముద్దును తన బోసినోటితో పెట్టిన క్షణం నాకు దైవసాక్షాత్కారమైంది..! నా అప్పులు ఎలా తీర్చాలో తెలిసింది. ఈ అనుభవం ఇంతవరకూ ఎవ్వరికీ చెప్పలేదు.
Ads
Share this Article