‘‘భోళాశంకర్ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో కనీసం గద్దర్‌కు సంతాపం ప్రకటించే సంస్కారం కూడా లేదా చిరంజీవికి..?’’ అని ఓ మిత్రుడు ఆగ్రహపడిపోయాడు… పోనీలే, తమ్ముడు పవన్ కల్యాణ్ నివాళి అర్పించాడు కదా… నా అన్న ప్రజాయుద్ధనౌక పేరిట ఒకటీరెండు స్మరణ వీడియోలు కూడా రిలీజ్ చేసినట్టున్నాడు… మోహన్‌బాబు కూడా అక్కడికి వెళ్లాడు… కానీ ఏమన్నాడు..?
గద్దర్ తమ్ముడట… తమది అన్నాదమ్ముల అనుబంధం అట… 49లో పుట్టిన గద్దర్ 52లో పుట్టిన మోహన్‌బాబుకు తమ్ముడెట్లా అయ్యాడు… పైగా గద్దర్ అందరినీ అన్నా అని పలకరిస్తాడు, పిలుస్తాడు… అలా తమ్ముడయ్యాడా మోహన్‌బాబుకు..? గద్దర్‌ను తమ్ముడు అని సంబోధించడంలోనే ఓ ఆధిపత్య ధోరణి… సగటు తెలుగు సినిమా హీరో పెత్తందారీ పోకడ… మోహన్‌బాబు మారడు… అస్సలు మారడు… 26 ఏళ్ల నుంచీ తమది కొనసాగుతున్న బంధమట… నెలకు రెండుమూడుసార్లు మాట్లాడుకునేవారట… ఎప్పుడూ ఒక్క ఫోటో లేదు, కలిసి మాట్లాడిన వార్త లేదు ఏమిటో మరి…
Ads
మొత్తం ఆ కుటుంబసభ్యులందరూ ఏం మాట్లాడతారో వాళ్లకే తెలియదు కొన్నిసార్లు… మోహన్‌బాబు సోషల్ పోస్టు చూస్తే విస్మయం కలిగింది… గద్దర్ బిడ్డలు తన ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నారట… డౌటే… ఎప్పుడూ వినలేదు… నిజంగానే గద్దర్ పిల్లలు తన స్కూల్‌లో లేదా కాలేజీలో చదువుకుని ఉంటే ఎంత ప్రచారం చేసుకునేవాళ్లో అనిపించింది…
సరే, వాటి మాటెలా ఉన్నా… చిరంజీవి కనీసం ఆ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో గద్దర్ గురించి ఒక్క మాట మాట్లాడకపోవడంతో పోలిస్తే మోహన్‌బాబు కాస్త బెటరే అనిపిస్తుంది గానీ… అదే సినిమా భాష… కృతకంగా… తను అడవిలో అన్న సినిమాకు డైలాగులు రాశాడట… గద్దర్ సినిమాలకు మాటలు కూడా రాస్తాడా..? అదీ ఆశ్చర్యపరిచిన విషయం… మరి ఆ సినిమా టైటిల్స్‌లో గద్దర్ పేరు లేదేమిటి మాస్టారూ… ఏం..? గద్దర్ మరీ ఓ బినామీ రచయితలా కనిపిస్తున్నాడా..?
పాటలు కూడా రాశాడట… కలెక్టర్ గారు వంటి సినిమాలకు సలహాలు ఇచ్చాడట… ఓహ్, గద్దర్ ఇన్ని పాత్రలు పోషించాడా..? 10 రోజుల ముందే ఇంటికి వచ్చి అన్నా గుండ్ల పోచంపల్లి పోదాంరా అనడగ్గానే మోహన్‌బాబు మాజీ గవర్నర్, మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండేతో కలిసి వెళ్లాడట… ఔనా..? నిజమేనా..? పదిరోజుల క్రితమే గద్దర్ హాస్పిటల్‌లో చేరినట్టు వార్తలొచ్చాయి మరి… గుండ్ల పోచంపల్లిలో ఏం మీటింగ్..? షిండే, గద్దర్, మోహన్‌బాబు పాల్గొన్న ఆ మీటింగు వార్త కూడా చదివినట్టు గుర్తులేదు… ఏమోలెండి… మోహన్‌బాబు గారండీ… మీ తమ్ముడి ఆత్మకు శాంతి కలుగుగాక…
Share this Article