Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తీజ్… మొలకల పండుగ… బంజారా తాండాల్లో అదే సంక్రాంతి, అదే దసరా…

August 9, 2023 by M S R

The Tradition: మా ఊరి మొలకల పండగ- ‘తీజ్’ కు రావాలని మా ఇంటి సహాయకులు శారద, కవిత పట్టుబట్టారు. ఎన్నో ఏళ్లుగా మా ఇంటిని చూసుకునేవారు ఆప్యాయంగా పిలిస్తే నా భార్య కాదనలేకపోయింది. ఆదివారం లాంగ్ డ్రయివ్ లా ఉంటుందని బయలుదేరాము. హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్ల దూరం. రెండు గంటలు పోను – రెండు గంటలు రాను ప్రయాణం. శ్రీశైలం వెళ్లే దారిలో నాగర్ కర్నూల్ జిల్లా అమనగల్ దాటాక వెల్దండ దగ్గర వారిది మహాత్మా గాంధీ తాండా. 1500 జనాభా ఉండవచ్చు. ఊరంతా లంబాడీలే.

వెల్దండ దాటగానే తాండాల్లో పండగ రంగులు కనువిందు చేస్తున్నాయి. కదిలే వాహనాల్లో డిజెల మోత మోగిపోతోంది. గవ్వలతో కుట్టిన వస్త్రాలతో లంబాడీలు గాల్లో తేలుతున్నారు.

Ads

ప్రతి ఇంటికి బంధువులు రావడంతో అదనపు వసతి కోసం షామియానాలు వేశారు. ప్రతి ఇంటి ముందు యాటలు కోస్తున్నారు. రాళ్లు పేర్చి కట్టెల పొయ్యిల మీద పెద్ద పెద్ద పాత్రల్లో మటన్ వండుతున్నారు.

రోజూ అన్నం వండి పెట్టే కవిత ఇంటికి ముందు వెళ్లాం. ఆపై కాస్త దూరంలో ఉన్న శారద ఇంటికి వెళ్లబోయాము. ఇంటి గేటుకు నిచ్చెన పెట్టారు. ఆ నిచ్చెనకు వేలాడదీసిన జంతువు మాంసం కోస్తున్నారు. మమ్మల్ను రోడ్డు మీదే కాసేపు ఆపి… ఆ మాంసం కొట్టుడు సీన్ ను మరో చోటికి మార్చి… నీళ్లతో కడిగి మమ్మల్ను సాదరంగా లోపలికి ఆహ్వానించారు.

శారద టీ పెట్టి ఇచ్చింది. మధ్యాహ్నం మాకోసం ప్రత్యేకంగా పప్పు, అన్నం వండింది. పెరుగు తెప్పించింది. భోంచేసి తీజ్ ఊరేగింపులో పాల్గొని… ఇంటిదారి పట్టాము. లంబాడీలు/గిరిజనులకు తీజ్ పండగ ఎందుకు ముఖ్యమో చెప్పారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు చేసే ఒక ఉత్సవమిది. మంచి భర్త దొరకాలని ఈ సంప్రదాయం ఎప్పటినుండో ఉన్నట్లుంది.

శ్రావణ మాసానికి ముందు వెదురు బుట్టలో మట్టి వేసి… ఆ మట్టి మీద గోధుమ గింజలు చల్లుతారు. రోజూ నీళ్లు చల్లుతూ ఉంటే… అవి మొలకెత్తుతాయి. తొమ్మిదో రోజు ఆ మొలకెత్తిన బుట్టలను నెత్తిన పెట్టుకుని ఊరంతా ఉరేగింపుగా వెళ్లి.. బతుకమ్మను నీళ్లల్లో వదిలినట్లు చెరువులో వదిలి వస్తారు. తీజ్ ఊరేగింపు అయ్యాక మందు- ముక్కకు లెక్క ఉండదు.

ఊరి జనంతో పాటు తీజ్ మొలకల బుట్టలతో మేము కూడా ఫోటోలు దిగాము. తీజ్ ఉరేగింపులో ఆకాశానికి చిల్లులు పడే డి జె సౌండ్ల మధ్య నృత్యాలను చూశాము.

కవిత, శారద ఇద్దరూ కష్టజీవులు. వారి తాండాలో వారు కొత్తగా కట్టుకుంటున్న ఇళ్లను మాకు చూపిస్తున్నప్పుడు వారు పొందిన ఆనందం మాటల్లో చెప్పలేము. ఎంత చెట్టుకు అంత గాలి. ఏళ్లతరబడి అహోరాత్రాలు కష్టపడి పని చేసే వారు ఉన్న ఊళ్లో ఒక గూడు కోసం ఎన్నెన్ని కలలు కన్నారో? ఎన్నెన్ని అప్పులు చేశారో?

“పోతనార్యుని గేహమున భారతీదేవి చిగురు చేతుల వంట చేయునాడు…” అని బమ్మెర పోతన ఇంట్లో సరస్వతీదేవి ఇష్టంగా వంట చేసి పెట్టేదని… అందుకే పోతన కవితకు అంతటి మహిమ అని గుర్రం జాషువా అన్నాడు. అలా శారద, కవితలు మా ఇంట్లో సారస్వతాన్ని వండుతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది.

మా ఇంట్లో పని చేయాల్సిన అవసరం రాని… పని మానేసి.. వారి కలలకు ప్రతిరూపంగా కట్టుకుంటున్న ఇంట్లో వారు హాయిగా ఉండే రోజు రావాలన్నది మా కోరిక.

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions