అట్టహాసాలు, ఆడంబరాలతో… ఎడాపెడా అప్పులు చేసి మరీ ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి, కొత్త కృతక తంతులను కూడా కొందరు నెత్తిన మోస్తున్న తరుణంలో… ప్రతి దండల పెళ్లి, ప్రతి స్టేజ్ మ్యారేజ్, ప్రతి రిజిష్టర్ వివాహమూ అభినందనీయమే… వధువు తండ్రికి మనసులో ఉంటుంది, సింపుల్‌గా పెళ్లి చేసేద్దామని… కానీ బంధుగణం సారీ, రాబందుగణం ఊరుకోదు… అసలు ఇంట్లోనే ఎవరూ పడనివ్వరు…
తప్పులు తీస్తారు, చీప్‌గా చూస్తారు, చీదరించుకుంటారు… అందుకే ఐనకాడికి డబ్బు సమకూర్చుకుని అడ్డగోలు రేట్లతో పెళ్లి జరిపిస్తాడు… పోనీ, వధువులైనా తండ్రి బాధను గమనిస్తారా..? నించరు… వాళ్ల కోరికలూ బోలెడు… ఐనా ఇవ్వాళారేపు పెళ్లిళ్లేమైనా నాలుగు కాలాలు నిలుస్తున్నాయా..? అదీ లేదు… మరెందుకీ అవస్థలు..? దీనికి ఎవడూ జవాబు చెప్పలేడు…
ఇదంతా ఎందుకంటే..? ఒకప్పుడు ఆదర్శ వివాహం చేసుకున్నవారిని (కులాంతరం, మతాంతరం, ఖండాంతరం అని కాదు… ఎట్ లీస్ట్ సింపుల్ పెళ్లి) అందరూ అభినందించేవారు… గతం వేరు… ఈ రోజుల్లో అలాంటి పెళ్లిళ్లు చేసుకోవాలంటే సాహసం కావాలి, లోకనిందను తిప్పికొట్టే ధైర్యం కావాలి… అన్నింటికీ మించి ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుని పదిమందికీ ఆదర్శమవ్వాలి… ఈ జంట చేసింది అదే… అందుకే వాళ్లకు ‘ముచ్చట’ అభినందనలు…
Ads
మొన్న మనమే చెప్పుకున్నాం… ఓ జర్నలిస్టు జస్ట్, దండలతో పెళ్లి చేసుకుని, అరగంటలో ఇంటికి భార్యతో తిరిగి వచ్చేశాడని… అది కదా ఆదర్శం అంటే..! చాలా ఉదాహరణలున్నయ్… కానీ ప్రతిసారీ మీడియా హైలైట్ చేయాలి… సొసైటీలో పాజిటివ్ మార్పు కోసం అవసరం… కానీ ప్రజెంట్ మీడియా ఓ చెత్త మురికికూపం కదా… దానికి పాజిటివ్ వైబ్స్ అక్కర లేదు… రాజకీయ నాయకుల తిట్లు, దిక్కుమాలిన ప్రోగ్రామ్స్‌ను మోయడం తప్ప ప్రజెంట్ మీడియాకు ఇంకేమీ చేతకాదు… ఆంధ్రజ్యోతి కాస్త నయం, ఈ ఆదర్శ వివాహాన్ని పబ్లిష్ చేసింది… కనీసం సింగిల్ కాలమ్‌లోనైనా…
వీరిలో ఒకరు ఐఏఎస్, మరొకరు ఐపీఎస్… ఒకరు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్… ఇంకొకరు ఐపీఎస్ దేవేంద్రకుమార్… ఇద్దరిదీ రాజస్థాన్… దేవేంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఐపీఎస్ శిక్షణలో ఉన్నాడు… ఇద్దరి పెళ్లినీ గతంలోనే పెద్దలు ఆమోదించి ఉన్నారు… బుధవారం జేసీ పుట్టినరోజు కావడంతో దేవేంద్ర మచిలీపట్నం వచ్చాడు… జేసీ చాంబర్‌లోనే జిల్లా రిజిస్ట్రార్ జగన్మోహనరావు సమక్షంలో ఈ ఇద్దరూ దండలు మార్చుకుని, రిజిష్టర్‌లో సంతకాలు చేశారు… ఎక్కడో ఉన్న పేరెంట్స్‌కు లైవ్ ద్వారా పెళ్లిని చూపించారు… వావ్… ఇవే కదా, మీడియాలో ప్రయారిటీ లభించాల్సిన వార్తలు…! (సోషల్ మీడియాలో ఈ పెళ్లి వీడియో బిట్ కనిపించింది… కానీ డౌన్ లోడ్ చేయడం కుదరలేదు…)
Share this Article