Amarnath Vasireddy….. పులిని చూసి నక్క వాత పెట్టుకొంటే ? హిమాచల్ ప్రదేశ్ . కొండల రాష్ట్రం . కొండ ప్రాంతాల భౌగోళిక స్థితిగతులు, మైదాన ప్రాంతాలతో పోలిస్తే భిన్నం . భారీ పరిశ్రమలు మైదాన ప్రాంతాలకే అనేక చిక్కుల్ని తెస్తాయి . కొండ ప్రాంతంలో అయితే వంద రెట్ల సమస్యలు .
ఒక ప్రాంతం/ రాష్ట్రం అభివుద్ది సాధించాలంటే, అది సంతులితాభివృద్ధి అయ్యేలా చూసుకోవాలి . పర్యావరణాన్ని కాపాడుకొంటూ ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులననుసరించి పారిశ్రామీకరణ జరుపుకోవాలి . మైదాన రాష్టమయిన తమిళనాడు లేదా మరొకదాన్ని దృష్టిలో ఉంచుకుని అంతకు మించి పారిశ్రామీకరణ జరిగిపోవాలి .. అభివృద్ధి సాధించాలని ప్రయత్నిస్తే ? హిమాచల్ ప్రదేశ్ లో గత నలభై సంవత్సరాలుగా జరిగింది ఇదే .
“మేరీ సప్నోమ్ కి రాణీ… కబ్ అవొగిఁ తుం ..” అని రాజేష్ ఖన్నా, టాయ్ ట్రైన్ లో పయనిస్తున్న షర్మిల టాగోర్ కు సైట్ కొట్టిన నాటి హిమాచల్ ప్రదేశ్ ,” నా మది నిన్ను పిలిచింది గానమై… వేణు గానమై అని అన్న ఎన్టీవోడు , వాణిశ్రీల మనసును ఆకట్టుకున్న హిమాచల్ ప్రదేశ్… ఎప్పుడో చచ్చి పోయింది .
Ads
ఎక్కితే కొండ .. దిగితే లోయ .. మొత్తం రాష్ట్రం … ఆ రాష్ట్రం హిమాచల్ లో అన్నీ కొండలే . అటువంటి రాష్ట్రంలో ఫార్మా , టెక్స్టైల్స్ , ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు . ఇది కాకుండా టూరిజం . సివిల్స్ పాఠాలు చెప్పేటప్పుడు చాలా సార్లు దీన్ని ఉదహరించేవాడిని .
” తప్పేముంది .. మా రాష్టం అభివృద్ధి కావొద్దా ? మా ఆదాయాలు పెరగొద్దా? మేము అడవి మనుషుల్లా ఉండిపోవాలా? అని వాదనలు వినిపిస్తున్నాయి . అభివృద్ధి అవసరమే .. కానీ స్థానిక భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి కదా ” అని చెప్పేవాడిని .
పరిశ్రమల కోసం .. టూరిజం కోసం ..
1 . లక్షలాది చెట్లు నరికేశారు..
2 . రాళ్ళల్లో, చెట్లల్లో నిర్మాణాలు వచ్చాయి .
3 . రోడ్ లు వేశారు .
4 . చెరువులు పూడ్చారు .
ఇది కదా… అభివృద్ధి అని చూపారు .
కురిసే వాన నీటికి పెద్ద మొత్తంలో గతి శక్తి ఉంటుంది . అది భూమి ఫైభాగంలోని మట్టిని పెకలిస్తుంది . మట్టి , వాన నీటిలో కరిగి కింది ప్రాంతాలకు వెళ్లి అక్కడ వాగుల్ని వంకల్ని పూడ్చేస్తుంది . కొండ ప్రాంతంలో అయితే ఏటవాలు కారణంగా మరిన్ని పరిణామాలు .
చెట్లుంటే, అవి వర్షపు చినుకులు నేరుగా భూమిని ఢీకొట్టకుండా అడ్డుకొంటాయి . చెట్లపై పడి అక్కడినుంచి భూమిపై పడే చినుకుల గతి శక్తి అనేక రెట్లు తగ్గిపోతుంది . చెట్ల వేళ్ళు, భూమిని పట్టి ఉంచుతాయి . చెట్ల ఆకులూ అలుములు … చెట్ల కింద మొలిచే గడ్డి కూడా వర్షపు చినుకులు , భూమిని పెకలించకుండా కాపాడుతాయి .
ఎప్పుడైతే చెట్లను లక్షలాదిగా నరికేసారో .. వర్షపు చినుకుల విధ్వంసం మొదలయ్యింది . ఎత్తైన కొండపై పడ్డ వర్షం అక్కడి మట్టిని రాళ్లను పెకలిస్తుంది . అవి వర్షపు ప్రవాహంలో ఏటవాలు కొండ పైనుంచి కిందకు వస్తాయి . ఈ ప్రవాహం వేగం కిందకు వచ్చే కొద్దీ పెరుగుతుంది . అంటే గతి శక్తి మరింత తీవ్రం . బుల్ డోజర్ పెట్టి తోసినట్టు పెద్ద పెద్ద రాళ్లు సైతం స్దాన చలనం పొందుతాయి . ప్రవాహ వేగాన్ని అడ్డుకోవడానికి మట్టిని పట్టి ఉంచడానికి చెట్లు లేవు .
కింది మట్టి కరగడంతో కొండ ఏటవాలు రాళ్లు ” ఇప్పుడా? వచ్చే వానాకాలం లోనా? ” అంటూ కిందకు రావడానికి రాకాసుల్లా వేచి చూస్తుంటాయి .
బోర్డర్ రోడ్ సంస్థ ఎన్నెన్ని రిపేర్ చేస్తుంది ? కింద రోడ్.. దానికి కాస్త ఎత్తుగా ఏటవాలులో ఉన్న ప్రాంతం అయితే రిపేర్ ఓకే. రోడ్డు నుంచే చూస్తే వందల మీటర్ల ఎత్తులో “దూకుతా .. దూకుతా” అని చూస్తున్న వందలాది… వేలాది… లక్షలాది గండ శిలలు . దేన్నీ అడ్డు పెట్టి రోడ్డు పై పోయే వారిని కాపాడాలి ? రోడ్లను ఎలా పరిరక్షించుకోవాలి ?
మట్టి రోడ్లు ఉంటే అక్కడ నీరు ఇంకి పోతుంది . ఇప్పుడేమో ఎక్కడ చూసినా తారు/ సిమెంట్ రోడ్లు . అలాంటి రోడ్ల పై పడే వర్షం.. ప్రవాహ వేగాన్ని మొత్తాన్ని పెంచుతాయి . కింద ఉండాల్సిన చెరువులు మాయం . దానితో నీరు అక్కడ ఉండలేక ప్రవాహంగా కిందకు వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది .
గత నెల రోజులుగా హిమాచల్ లో జరుగుతోంది ఇదే . బతుకులు నరకం . కొండ చరియలు విరిగి పడి ఆస్థి / ప్రాణ నష్టం . అనేక ప్రాంతాలకు రవాణా వారాల తరబడి ఆగిపోయింది . ఒకప్పుడైతే స్థానికంగా తిండి, ఇతరత్రా అవసరాలు తీర్చుకొనే పరిస్థితి . ఇప్పుడేమో ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ నుంచి “అట్టా” రాకపోతే పూట గడవదు . పర్యాటకులు రాకపొతే లక్షలాది మంది ఉపాధి దెబ్బ తింటుంది .
వెళ్లిన వారు తిరిగొస్తారో రారో అని పరిస్థితి ఉంటే ఇక పర్యాటకం ఎక్కడ ? రవాణా ఆగిపోతే పరిశ్రమలు ఎలా నడుస్తాయి . ఒకటి నిజం . అయిదు వేల కోట్లో .. ఇంకాస్త ఎక్కవో ఖర్చు పెట్టి మరో రెండు నెలల్లో రోడ్లను రిపేర్ చేయిస్తారు . పరిస్థితి చక్కబడి పోయిందనిపిస్తారు . కానీ .. హిమాచల్ ప్రదేశ్ ..
అదొక ల్యాండ్ మైన్ . ఎప్పుడైనా పేలుతుంది .
రాబోయే రోజుల్లో క్లౌడ్ బరస్ట్ లు సహజం అయిపోతాయి . అలాంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో ఇక్కడ ప్రళయం సహజం అయిపోతుంది . బహుశా మరో వందేళ్లకు చరిత్ర/ భౌగోళిక శాస్త్రం పుస్తకాల్లో ” ఇదిగో ఇక్కడ … గతంలో ఒక రాష్టం ఉండేది . ప్రజలు ఉండేవారు . మనిషి అభివృద్ధి పేరుతొ అడవి తల్లి గర్భంపై తన్నాడు . ఆమెకు కోపం వచ్చింది . ఆ మంటల్లో ఒక నాగరికత నాశనం అయిపొయింది అని మన వారసులు ” విలుప్త నాగరికత ” అనే హెడ్డింగ్ తో పాఠాలు చదువుతారు … పాపం శమించుగాక…
Share this Article