Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ విషయంలో మోడీ ప్రభుత్వ అడుగులు సరైనవే… ప్రతిపక్షాలకూ మాటల్లేవ్…

August 12, 2023 by M S R

కాలం చెల్లిపోయిన, పురాతన నేరచట్టాల్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, కొత్త శిక్షా స్మృతులను తీసుకొస్తున్నందుకు మోడీ ప్రభుత్వాన్ని అభినందించాలి… అన్నింటికీ మించి 313 సవరణల్ని కొత్త బిల్లుల్లో ప్రస్తావిస్తే అందులో అధికశాతం బీజేపీని వ్యతిరేకించే సెక్షన్స్‌కు కూడా ఆమోదయోగ్యంగా కనిపించడం… ప్రత్యేకించి రాజద్రోహం సెక్షన్ రద్దు, శిక్షల్ని ప్రభుత్వాలు తగ్గించడంపై నిషేధం వంటివి ప్రగతిశీల- ప్రజాస్వామిక శక్తులూ ఉపశమనం…

నిజానికి ఈ చట్టాల సవరణపై ఎంత భారీ కసరత్తు జరిగిందో తెలియదు, కసరత్తు లేకుండా అల్లాటప్పాగా పార్లమెంటులో పెట్టలేరు… కానీ బిల్లులు ప్రవేశపెట్టడానికి ముందుగా ప్రజల్లో విస్తృత చర్చకు పెడితే బాగుండేది… సుప్రీంతో కూడా ఓమాట సానుకూలంగా చెప్పించుకుని ఉంటే ఈ సవరణలకు మరింత శాంటిటీ వచ్చి ఉండేది…  నిరర్థక చర్చలకు బదులు పార్లమెంటు ఇలాంటి విషయాల్లో సీరియస్‌గా చర్చిస్తే బాగుండు… ఎటొచ్చీ మన టీవీ డిబేట్లకు వచ్చే వక్తలెవరికీ లీగల్ అంశాల మీద అవగాహన సరిగ్గా ఉండదు కాబట్టి, సీరియస్‌గా చర్చించే ప్రజెంటర్లూ లేరు కాబట్టి తెలుగు మీడియాలో పెద్ద చర్చ లేకుండా పోయింది… టీవీ వార్తల సంగతి తెలిసిందే కాబట్టి వాటి గురించి చెప్పుకునే పని లేదు…

విచిత్రంగా తెలుగు పత్రికల సెంట్రల్ డెస్కులు స్పందించి ఉండాల్సింది… అదీ జరగలేదు… చాలా పత్రికలు కేవలం అమిత్ షా వ్యాఖ్యలు రాసేసి ఊరుకున్నాయి… ఈనాడు వంటి పత్రికే బిల్లుల్లోని ముఖ్యాంశాల్ని నెట్ ఎడిషన్‌లో చదువుకొండి అని ఓ ముక్తాయింపు ఇచ్చి చేతులు దులుపుకుంది… ఇంతకుమించి ప్రాధాన్యమున్న వార్తలు ఏమన్నాయని..? సాక్షి ప్రొఫెషనల్ ఎబిలిటీ తెలిసిందే కాబట్టి ఏమీ ఆశించలేం కానీ ఆంధ్రజ్యోతి సరైన దిశలో స్పందించలేదు…

Ads

ఇక పార్టీల్లో నాయకుల పరిజ్ఞానాలు, పరిణతి సంగతి తెలిసిందే కదా, వాళ్ల స్పందనల్ని ఆశించలేం… బిల్లుల్ని ప్రవేశపెట్టి పార్లమెంటరీ కమిటీ అధ్యయనానికి అప్పగించారు కానీ పాస్ చేసేస్తే సరిపోయేది… ఈ సవరణలపై పెద్దగా అభ్యంతరాలు కూడా వచ్చే అవకాశాల్లేవు… ఈ చట్టాల ప్రక్షాళన ఎన్నాళ్లుగానో నాగరిక సమాజం కోరుకుంటున్నదే…

ఆమధ్య బిల్కిస్ బానో కేసు మీద దేశవ్యాప్తంగా రచ్చ జరిగింది… అంతటి సీరియస్ కేసులో దోషులు జైలు నుంచి బయటికి రావడం మీద సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది… ఇకపై ప్రభుత్వాలు శిక్షల్ని తగ్గించలేవు అనే అంశం బాగుంది… కోర్టులు అన్నీ విచారించి శిక్షలు వేస్తే ప్రభుత్వాలు తగ్గించేయడం ఏమిటనే ప్రశ్నకు బదులు దొరికినట్టే… అలాగే రాజద్రోహం అనే సెక్షన్ ఇన్నేళ్లుగా దుర్వినియోగం అవుతోంది… ఇప్పుడు దాన్నీ రద్దు చేయడం సరైన దిశలో చర్య… అఫ్‌కోర్స్, ఉపా వంటి చట్టాలు ఎలాగూ ఉన్నాయి… పైగా ఇప్పుడు కొత్తగా ఉగ్రవాది అనే నిర్వచనం మార్చి దేశసమగ్రత కోణంలో చట్టాల్ని మరింత కఠినతరం చేయబోతున్నారు.. అదీ అవసరమే…

అన్నింటికీ మించి ఏడేళ్ల శిక్షకు మించి పడే కేసుల్లో బాధితుల వాదనలు వినకుండా ప్రభుత్వాలు ఉపసంహరించుకోకుండా నిషేధం… సరైన చర్యే… పార్టీలు ఎడాపెడా కేసులు పెట్టేసుకోవడం, వాళ్లు అధికారంలోకి వస్తే కేసుల్ని రద్దు చేసుకోవడం, అంటే ప్రాసిక్యూషన్ విత్‌డ్రా చేసుకోవడం… తమ వాళ్లు ఏవైనా కేసుల్లో ఉంటే ప్రాసిక్యూషన్ నుంచి మినహాయిస్తున్నారు అనేకసార్లు… ఇప్పుడు వాటన్నింటికీ తెరపడుతుంది… ఈ బిల్లులు గనుక చట్టరూపం తీసుకుంటే… బాధితుల వాదనలు వినాలి కాబట్టి విత్ డ్రా నిర్ణయాన్ని ప్రభుత్వాలు, పార్టీలు కోర్టులో సమర్థించుకోవాలి ఇక… లేదంటే కోర్టు బయట రాజీ కుదరాలి…

లైంగికదాడులు, మూకదాడులకు సంబంధించి సెక్షన్లకు కఠినతరం చేయడం, కొన్ని కేసుల్లో యావజ్జీవం శిక్షను జీవితకాలం జైలుశిక్షగా మార్చడం వంటి సవరణలూ ఆహ్వానించదగినవే… ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తే, తప్పుడు హామీలు ఇస్తే శిక్షలు ప్రతిపాదించడం కూడా బాగుంది… పార్టీలు ఆ సెక్షన్ల కళ్లుగప్పి మాయచేష్టలతో నిర్వీర్యం చేయగలవు కానీ ఓ చట్టమంటూ ఉంటే కొంతైనా అదుపు, భయం ఉంటాయి కదా… ఇవి గనుక సరిగ్గా అమలైతే అన్ని పార్టీల అధ్యక్షులూ జైలుకే…

అన్నింటికీ మించి చార్జి షీట్ల దర్యాప్తుకు, విచారణకు, తీర్పు ప్రకటనకు టైమ్ ఫ్రేమ్ పెట్టడం కూడా ఆహ్వానించదగిందే… కింది కోర్టుల్లో కనీసం 40 శాతం కేసులు తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు… ఇన్నేళ్లకు ఈ దేశం వలసవాదుల చట్టాల్ని సవరించడానికి పూనుకుంది… అదీ ఆనందం… అఫ్‌కోర్స్, కొన్ని కఠిన సెక్షన్ల మీద మళ్లీ కొన్ని గొంతులు అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి పూనుకుంటూ ఉండవచ్చు… మోడీ, బీజేపీ ఏ అడుగులు వేసినా సరే వాటిని తప్పకుండా వ్యతిరేకించాలనే ఓ అర్థం లేని భావజాలంతో కూడా కావచ్చు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions