మొన్న హీరోల రెమ్యునరేషన్ల మీద చిరంజీవి మాట్లాడుతూ ‘‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏమిటి..? పెద్ద పెద్ద విషయాలు మానేసి ఇండస్ట్రీ మీద మాటలేమిటి..? మేం నటిస్తున్నామంటే ఇండస్ట్రీలో పదిమందికీ ఉపాధి దొరుకుతుందని మాత్రమే…’’ అని ఏదేదో చెబుతూ పోయాడు… ఇండస్ట్రీ కార్మికుల మీద పెద్ద ఔదార్యం కనబరుస్తూ… ఇండస్ట్రీ పచ్చగా ఉండటం కోసమే తాము నటిస్తున్నట్టుగా, సినిమాలు చేస్తున్నట్టుగా… రాజకీయ నాయకులు అకారణంగా తమ మీద ద్వేషాన్ని చిమ్ముతున్నారన్నట్టుగా…
నిజానికి ఇండస్ట్రీలో శ్రమ మాత్రమే దోపిడీకి గురికావడం లేదు… క్రియేటివిటీ కూడా వంచనకు, దోపిడీకి గురవుతోంది… దారుణంగా… బయటపడి చెప్పుకోలేరు… అనేక మంది కలలు కల్లలైపోయి దిక్కుమాలిన జీవితాలు గడుపుతున్నారు… ఇక ఆడవాళ్లనైతే ఇండస్ట్రీ మనుషులుగానే చూడదు… వాళ్లను లైంగిక సరుకులా చూస్తారు… వేరే దిక్కులేక పెద్ద పెద్ద తారలే ‘అన్నీ చంపుకుని’ కమిటైపోతుంటారు… ఫేస్‌బుక్‌లో ఎవరో మిత్రుడి పోస్టు ఆసక్తికరంగా అనిపించింది…
అది సింగర్లకు పేమెంట్ల గురించి… చూడండి ఓసారి…
Ads
చూశారు కదా… చిరంజీవి ఎప్పుడైనా మాట్లాడాడా..? ఇప్పుడు తన తమ్ముడి రెమ్యునరేషన్ వివాదాల్లో పడింది కాబట్టి, నాయకులు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి చిరంజీవికి నొప్పి… దాసరి స్థాయిలో ఇండస్ట్రీ పెద్దగా మారదామని అప్పట్లో ట్రై చేశాడు కదా చిరంజీవి… ఏనాడైనా ఈ శ్రమ, క్రియేటివిటీ దోపిడీల గురించి ఒక్క మాటైనా మాట్లాడాడా..?
వందల కోట్లకు చేరుతోంది తెలుగు సినిమా రేంజ్… భారీ ఖర్చులు చూపిస్తున్నారు, టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు… జనం పర్సుల్ని కొట్టేస్తున్నారు… కానీ నాణ్యత లేదు, సృజన లేదు, ప్రయోగం లేదు, సమాజం మీద ధ్యాస లేదు… అంతా హీరోక్రసీ… అందరూ హీరోల ఎదుట సాగిలపడుతున్నారు… చిడతలు వాయిస్తున్నారు… వంగి వంగి దండాలు పెడుతున్నారు… మంచి మంచి ఇతర భాషల సినిమా కథలు కూడా రీమేకులుగా… ఈ హీరోల కీర్తనలకు బలై సారం పోగొట్టుకుంటున్నాయి… రొడ్డ కొట్టుడు, ఫాల్తు హీరోయిజాన్ని ఎలివేట్ చేయడమే పనిగా పెట్టుకున్నయ్…
పాన్ ఇండియా ఓ వ్యాపారం… ఇతర దేశాల్లో విడుదల ఓ ఆర్థిక మిస్టరీ… మన ఈడీలు, ఐటీల ఘోర వైఫల్యం… చివరకు గ్రాఫిక్స్ ఖర్చులు కూడా మిస్టరీలే… అంతా ప్రేక్షకుడి మీద రుద్దుతున్నారు… నిధులన్నీ జమచేసి హీరోల కాళ్ల మీద గుమ్మరిస్తున్నారు…
హీరో చెప్పినవాడే విలన్, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, హీరోయిన్… చివరకు సెట్‌లో క్యారవాన్ డ్రైవర్లు, ప్రొడక్షన్ స్టాఫ్, మేకప్ ఆర్టిస్టుల విషయాల్లోనూ హీరోలు చెప్పిందే శాసనం… హీరోల రెమ్యునరేషన్లు ఖచ్చితంగా చర్చనీయాంశాలే… అఫ్‌కోర్స్, పవన్ కల్యాణ్, చిరంజీవి మాత్రమే బాధ్యులు కాకపోవచ్చు… హీరోలందరి బాటా అదే కావచ్చు, నిర్మాతలు హీరోల కాళ్ల దగ్గర పొర్లుదండాలు పెడుతూ ఉండవచ్చు… కానీ చర్చ అర్థరహితం మాత్రం కాదు…
కొందరైతే దర్శకులను అలా పక్కకు నెట్టేసి, తాము మెగాఫోన్ పట్టేసి దర్శకుల అవతారాలు ఎత్తుతున్నారు… తీరా సినిమా ఫ్లాపయితే దర్శకుల్ని బకరాల్ని చేసేస్తున్నారు… ఒక్క రాజమౌళి మినహా ఇంకెవరైనా దర్శకుడికి హీరోల మీద గ్రిప్ ఉందా..? ఈ వికారాలకు తోడు వ్యక్తి ఆరాధనలో మునిగితేలే ఫ్యానిజం సరేసరి… సినిమా అనేది ఫక్తు వినోదవ్యాపారం… దందా… అదొక మురికికూపం… పెద్ద హీరోల సినిమాల్ని ప్రేక్షకుడు తిరస్కరించే ట్రెండ్ వచ్చేవరకూ ఇది ఇలాగే కొనసాగుతుంది…!!
Share this Article