థియేటర్లలో ఆదిపురుష్ విడుదలప్పుడు రకరకాల రివ్యూలు వచ్చాయి… నిష్పాక్షిక కలాలన్నీ సినిమాను ఏకిపారేశాయి… సినిమా డిజాస్టర్… రాముడి మీద భక్తితో సినిమాను చూడాలని అనుకున్నవాళ్లు కూడా పెదవి విరిచారు… ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశకు గురయ్యారు… హఠాత్తుగా ఓటీటీలో పెట్టేశారు… ఓటీటీలో కూడా పెద్దగా వీక్షకులు లేరు… కానీ సినిమా ఎందుకు బాగాలేదో చూద్దామని కొందరు చూస్తున్నారు… రామాయణం ఎలా తీయకూడదో ఓ పాఠం అట… సమీక్షల్లో చేయితిరిగిన మిత్రుడు Prasen Bellamkonda రాసిన ఓ సునిశిత రివ్యూ ఇది…
ఇఫ్తిఖార్ జైలర్. సంజీవ్ కుమార్ పోలీస్ ఆఫీసర్.
Ads
దశరధుడు రాజు. విశ్వామిత్రుడు ముని.
‘ ఓ మిషన్ కోసం నీ జైల్ లో ఉన్న ఇద్దరు ఖైదీ లు నాకు కావాలి ‘ అంటాడు సంజీవ్ కుమార్.
‘ ఓ దుర్మార్గాన్ని అరికట్టడానికి నీ ఇద్దరు కుమారులు నాకు కావాలి’ అంటాడు విశ్వామిత్ర.
ఎంటా మిషన్. అడుగుతాడు ఇఫ్తికార్.
ఎంటా దుర్మార్గం. అడుగుతాడు దశరధుడు.
ఒక ఊరి మీద పడి దోచుకుంటున్న బందిపోట్లను అరికట్టాలి అంటాడు సంజీవ్ కుమార్.
ఒక యాగాన్ని అడ్డుకుంటున్న ఇద్దరు రాక్షసులను చంపి యాగానికి ఆటంకం లేకుండా చెయ్యాలి. అంటాడు విశ్వామిత్ర.
దొంగలతో మిషన్ ఏంటి. నా ఫోర్స్ ఇస్తా తీసుకెళ్ళు అంటాడు ఇఫ్తిఖార్.
నా బిడ్డలు పాలుగారే పసి కూనలు. వాళ్లెందుకు నా సైన్యాన్నిస్తా తీసుకెళ్లండి సామీ.. అంటాడు దశరధుడు.
నాకా దొంగలే కావాలంటాడు
సంజీవ్ కుమార్.
నాకా పిల్లలే కావాలంటాడు విశ్వామిత్ర.
ఆ జేబ్ ఖత్తర్ అమితాబ్ ధర్మేంద్ర అనబడు దొంగలిద్దరూ వెళ్లి రాం ఘడ్ ను కాపాడి అంజాద్ బందిపోటు ఖాన్ అండ్ కో ని అంతమొందిస్తారు.
ఆ ఇద్దరు పసి రాముడు, పిల్ల లక్ష్మణుడు వెళ్లి యాగానికి ఆటంకాలను తొలగించి రక్కసులను చంపేస్తారు.
ఇన్స్పిరేషన్ కు పర్స్పిరేషన్ కలిస్తే
అలా
నకల్ మార్నేకా అకల్ నహ్యేతో ఇంకోలా
ఒకలా చెపితే రామాయణం.
మరొకలా తీస్తే షోలే.
ఇంకేదోలా తీస్తే సోదిపురుష్.
సోది పురుష్ 2
—————
అవాల్మీకం.
రామాయణానికి సంబంధించిన మాట ఇది.
వాల్మీకి రాయకుండా ఆ తరువాత రామాయణంలో వచ్చి చేరినవన్నీ అవాల్మీకాలు.
ఆదిపురుష్ గురించి మాట్లాడేముందు ఈ అవాల్మీకం అనే మాట గురించి తప్పక మాట్లాడాలి. సరే ఆదిపురుష్ గురించి అనగానే మొదటి ప్రశ్న ఎలా ఉంది అని కదా….అదేం ప్రశ్నండీ ఇచ్చిత్రం కాకపోతే… రామాయణం రామాయణంలా కాక బాగోతంలా ఉంటుందా… ఏమో.. ఉండొచ్చేమో కూడా.
నిజం చెప్పాలంటే ఆదిపురుష్ కొంచెం చాలా అలానే ఉంది. అవాల్మీక రామాయణంలా ఉంది. చీపెస్ట్ గ్రాఫికాయణంలా ఉంది. రావణాయణంలా ఉంది. క్యాట్ వాక్ జానకి, సిక్స్ పాక్ రాముడిలా ఉంది. చిన్నపిల్లల వార్ గేమ్ వీడియోలా ఉంది. హారీ పోటర్ తరం కోసం రామాయణ ప్రీమియర్ షోలా ఉంది. ఏం ఉండకూడదా…ఎన్ని రామాయణాలు లేవు. కల్పవృక్షం ఉంది విషవృక్షమూ ఉంది. ఆనంద, గోపీనాథ, శేష, ఉత్తర, భాస్కర, నిర్వచనోత్తర, రంగనాథ, మొల్ల, ఆధ్యాత్మ, సత్యపురి ,కూచకొండ రామాయణాలూ ఉన్నాయి. పద్యగేయాల్లో, వచనంలో ఎన్ని రామాయణాలో లెక్కపెట్టలేం. ఆది పురుష్ ఇంకోటి…
అంతే.
బాపు సంపూర్ణ రామాయణానికి ఇది పోస్ట్ మోడ్రన్ రూపం… అంతే. సేం టు సేం అరణ్య కాండలో మొదలై యుద్దకాండతో ముగుస్తుంది.
తెలుగు, సంస్క్రుతాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రామాయణాలు అవాల్మీకాలతో రూపొందాయి. విభీషణుడు రావణగర్భంలోని అమృతభాండం పగులగొట్టడం, గౌతముడిని అహల్యను వేరుచేయడానికి ఇంద్రుడు కోడిలా కూయడం, అహల్య రాయిగా మారడం, శంభూక వధ, కాలనేమి కథ, శబరి ఎంగిలిపండ్ల వ్యవహారం, లక్ష్మణ దేవర నవ్వు, జంబుమాలి వృత్తాంతం, సులోచన సహగమనం, సీత ఎత్తిపొడుపులు తట్టుకోలేక లక్ష్మణుడు
అన్నను వెదకడానికి వెళ్లడం, రావణుడు విభీషణుడిని తన్ని వెళ్లగొట్టడం, ఉడతాభక్తి, రావణుడి ముందు హనుమంతుడు తోక సింహాసనం వేయడం, బాల్యంలో తన కాలు విరిచాడన్న కోపంతో మందర శ్రీరాముడిని వనవాసానికి పంపడం, కైక పద్నాలుగు రోజులు అనబోయి పొరపాటున పద్నాలుగు సంవత్సరాలు అనడం.. ఇలాంటివి ఎన్నో వాల్మీకి చెప్పనివి ప్రచారానికి వచ్చాయి.
తాజాగా ఆదిపురుష్ మరికొన్ని అవల్మీకాలను తెరమీదకు తెచ్చాడు. ఆంజనేయుడు సంజీవని మొక్కను గుర్తించలేక మొత్తం కొండను ఎత్తుకొచ్చాడనే మనకు తెలుసు. కానీ ఆదిపురుషాంజనేయ మాత్రం సంజీవని ఔషధం ఇంకా చాలా మందికి అవసరం పడుతుందని కొండను పెకిలించుకొస్తాడు. ఆంజనేయుడిని బుర్ర తక్కువ వాడిగా చూపడం హనుమ ఫీవర్ కాలంలో బాక్సాఫీస్ కు నష్టం అనుకున్నట్టున్నాడు దర్శకుడు. వాలిని చెట్టు చాటునుంచి రాముడు చంపడమే మనకు తెలుసు. కానీ ఆదిపురుష్ వాలి మాత్రం మల్ల యుద్దంలో ఆయుధం వాడడం అనే అధర్మానికి పాల్పడినంచేత రాముడి చేత మరణిస్తాడు. చెట్టు చాటు నుంచి చంపడం అనే నిందను కూడా దర్శకుడు రాముడికి అంటనివ్వలేదు. ప్రజలను కాపాడేవాడే నిజమైన రాజు అని సుగ్రీవుడికో టాగ్ ఇచ్చి అతని పక్షాన రాముడు నిలవడం కూడా బాహుబలి టైప్ అవాల్మీకం.
సీత ఎత్తిపొడుపులేవీ లేకుండానే శేషు రాముడి దగ్గరకు వెళ్లిపోతాడు. లక్ష్మణుడిని రాముడు శేషూ అని పిలవడం ఓ అవాల్మీక వింత. తెలుగు ప్రేక్షకులకు అతడు లక్ష్మణుడిగా మాత్రమే తెలుసు. ఆంజనేయుడిని కూడా భజరంగ్ అని పిలుస్తూ ఉంటారిక్కడ. రావణుడి కడుపులోపలి అమృత భాండం గురించి రహస్యం విప్పడం అనేది ఆదిపురుష విభీషణంలో లేదు. అయితే రాముడు మాత్రం రావణాసురుడిని పొట్టలో బాణం దింపే చంపుతాడు. ఓ మాయావిని సీత వేషంలో రాముడికి అప్పగించి చివరి నిముషంలో ఆమె మెడకు కత్తి పెట్టడం వంటి సీన్లు మరీ నేలబారు క్రయిమ్ పెట్రోల్ స్ధాయి నవ్వులాటలు. అసలు రావణుడిదే ముతక విలన్ గెటప్. రామాయణ పాఠకులకు రావణుడిలో సీతను ఎత్తుకురావడం అనే చెడ్డ తనం తప్పఅన్నీ మంచి లక్షణాలున్నట్టుగానే తెలుసు. అతని పట్ల ఏహ్యత ఉండదు. రావణుడి ఆహార్యం కానీ రూపం కానీ పాఠకుడి ఊహల్లో రావణ బ్రహ్మగా గౌరవ ప్రదంగానే ఉంటుంది. ఆ విషయాన్ని దర్శకుడు ఉద్దేశ్య పూర్వకంగా మరచి రావణుడిని మరీ సి గ్రేడ్ సినిమా విలన్ ని చేసినట్టున్నాడు.
పాన్ ఇండియా సినిమా పుణ్యం కావచ్చు ప్రభాస్ రాముడు పక్కా ఉత్తర భారత రాముడిలా ఉన్నాడు. తెలుగు ప్రేక్షకుడికి తెలిసిన రాముడు దక్షిణ భారత రాముడే. కొట్టొచ్చినంత తేడా ఉంది. అవునూ రాముడు అంత ఎర్రగా ఉన్నాడేంటి నీలమేఘ ఛాయ ఏమైంది. అడవి వాతావరణం పడక మెలానిన్ మాయమైందా. రాముడి కళ్లెదుటే రావణుడు సీతను ఎత్తుకెళ్లడం ఆదిపురుష్ స్పెషల్. సీత రావణుడిని చూడదు అతనితో మాట్లాడదు. కేవలం గడ్డిపరకను ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతుంది. కానీ మన కృతీ సనన్ మాత్రం రావణుడితో ఓవర్ ది టేబుల్ ఫేస్ టు ఫేసే.
ఆంజనేయుడు కుంభకర్ణుడు దిష్యుం దిష్యుమ్ మాగొప్ప సృజన. కుబేరుడిని తన్ని తగలేసి తెచ్చుకున్న నిధులన్నీ మన సైఫ్ అలీ రావణ్ ఏమ్ చేసాడు ఆ పాడుబడ్డ కొంపల్లో కాపురం చేస్తున్నాడు. సినిమాలో మహిళల ఆహార్యం కూడా గాగ్రా చోళీ కమ్ కుర్తీ కుర్తా కమ్ లాంగ్ గౌన్ల మీద ఓడ్నీలతో మెరిసిపోయింది. ఇటు కోతులు అటు రాక్షసుల మధ్య ఆ మాత్రం గ్లామర్ లేకపోతే బావోదనుకున్నట్టున్నాడు దర్శకుడు. లంకేయులేమో పాత సినిమాల్లో గాడ్జిల్లాలను గుర్తు తెచ్చారు. వానర సైన్యం తీరంతా రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లోంచి ఓ ముక్క కత్తిరించుకొచ్చినట్టుంది. రావణుడి వాహనం గబ్బిలం అని మనకు తెలియ చెప్పి మన జ్ఞాన బ్యాంక్ నూ బలోపేతం చేసాడు దర్శకుడు. ఆదిపురుషుడు విష్ణువు కదా మరి రాముడెలా అయ్యాడు. ఓకే విష్ణు రూపమే రాముడు కనుక అని సమాధాన పడితే మరి కృష్ణుడు కూడా ఆదిపురుషుడేనా వామనుడు వరాహుడు కూడా ఆది పురుషులేనా టెల్మీ.
సినిమా బాలేదనడానికేం లేదు. అంతా రామాయణమే కదా. అలా అని బాగుందనడానికీ ఏమీ లేదు. అంతా రామాయణమే కదా. ప్రభాస్ మొహంలో భావాలు పలకకున్నా ఫర్వాలేదనిపించాడు. సైఫ్ అలీ సోసో. కృతీ సనన్ అందంగానే ఉంది. నటులెవరికీ ఇరగదీసి నటించేయాల్సిన సన్నివేశాలేవీ లేవు. కేవలం అరణ్యకాండ, యుధ్ద కాండ లను మాత్రమే తీసుకుని రాసుకున్న సన్నివేశాలు కనుక భావోద్వేగాలకు చోటులేకుండా పోయింది. యుద్ద కాండ లెంగ్తెక్కువై బోర్ కొట్టింది కూడా. విజువల్ ఫీస్ట్ గా ఉండాల్సినంత విందు లేదు. గ్రాఫిక్స్ చవకబారుకు కొంచెం తక్కువ.
తెలిసిన కథను చెప్పేపుడు చెప్పే పద్దతిలో కొత్తదనాన్ని గుప్పించాలి ఎవరైనా. ఆదిపురుష్ లో కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కొత్తదనం అని దర్శకుడు అనుకున్నట్టున్నాడు. కానీ ఆ పప్పులుడకలేదు . రామాయణం చాలా తెలిసిన కథే అయినా రామానంద్ సాగర్ రామాయణాన్ని టివిలకు పూజలు పునస్కారాలు చేస్తూ చూసిన జనం మనం. ఆది పురుష్ కూడా అవే పూజలందుకుంటాడేమో చూడాలి. ఇటీవల పాన్ ఇండియా వ్యాప్తంగా హిట్ అయిన సినిమాలను పరిశీలిస్తే అయితే దేశ భక్తి లేదా రామభక్తి ప్రధానమైనవే ఎక్కువ శాతం ఉన్నాయి.
ఈ నేపథ్యంలో స్కూప్ అనే ఓ వెబ్ సిరీస్ లో ఓ పాత్ర‘ గతంలో వినోదం కోసం సినిమాలను, నేషనల్ ఇంట్రస్ట్ తో వార్తలను చూసేవారు, ఇప్పుడు వినోదం కోసం వార్తలను నేషనల్ ఇంట్రస్ట్ తో సినిమాలను చూస్తున్నారు’ అన్నట్టు… ఈ ఆదిపురుషుడి వెనుక నాకైతే ఆ నేషనల్ ఇంట్రస్ట్ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అవునేమో.. ఇదీ భారత బాగోతం.
Share this Article