ఒకే రోజు హీరో మనవరాలి పెళ్లి ముహూర్తం, హీరో ద్విశతాబ్ది (ఈ మధ్య ఏదయినా సంస్కృతంలోనే చెబుతున్నారు) అంటే 200 సినిమా షూటింగ్ ప్రారంభ ముహూర్తం ఒకే ఘడియలో గడియపడ్డంతో అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొని ఉంది. టీవీ డిబేట్లలో ఇదే చర్చ. సామాజిక మాధ్యమాల నిండా ఇవే వార్తలు. కామెంట్లు. అభిప్రాయాలు. గ్రహాల గతులనే కొంచెం మార్చాలంటూ ఏకాదశమ గ్రహ జాతక సైకో ఫ్యాన్స్ నిపుణులు నవీన జోతిషాలు కూడా చెబుతున్నారు.
ఇలాంటి అరుదయిన సన్నివేశం కృత యుగారంభం మొదలు ఇప్పటి వరకు ఏయే హీరోలకు ఎప్పుడెప్పుడు వచ్చిందో అల్జిమర్స్ రాని వయోవృద్ధులు అడగనివారిని పిలిచి మరీ చెబుతున్నారు.
కుల అభిమాన సంఘాలు అనుకూల- అననుకూల సంకుల స్పర్ధలతో కొట్టుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా నిండా ఈ వార్తలతో… అణు బాంబు మీట మీద చేయి పెట్టి… నొక్కడానికి సిద్ధంగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోటో వేయడానికి చోటు లేకుండా పోతోంది.
Ads
రెండు వారాల తీవ్ర ఉత్కంఠ తరువాత ఈ ప్రపంచ సమస్య పరిష్కారమయ్యింది. ఉదయం పాడ్యమి రాహుకాలంలో సరిగ్గా యమగండం వచ్చిన వేళ సినిమాకు దుర్ముహూర్తం పెట్టారేమిటని అడిగిన పండితులకు “ఆ సినిమాలో విలన్లకు మా హీరో పెట్టిన దుర్ముహూర్తమది. దుష్ట శిక్షణ దుర్ముహూర్తమే- శిష్ట రక్షణ సుముహూర్తం అన్న అంత్యప్రాస పంచ్ డైలాగ్ కూడా ఈ సినిమాలో ఉంది” అని సైకో ఫ్యాన్స్ వివరణ ఇచ్చుకున్నారు.
పాడ్యమి పాఠనాశాయ అన్నారు కానీ పెళ్లి నాశాయ అనలేదు కాబట్టి మా హీరో మనవరాలి పెళ్లికి పాడ్యమి పూట సూర్యుడు అస్తమించగానే ప్రతీకాత్మకంగా ముహూర్తం భలే కుదిరిందని ఆ లోక కల్యాణ ముహూర్తం గురించి కూడా అభిమానులు ఉబ్బి తబ్బిబ్బులవుతున్నారు.
హీరో కారు డ్రైవర్ చేత హీరో గారు ఉద్దేశపూర్వకంగా లీక్ చేయించిన ప్రకారం ద్వి శతాబ్ది సూపర్ డూపర్ బంపర్ టు బంపర్ స్టోరీ ఇది:-
లండన్ నుండి సొంత ఎయిర్ బస్ డబుల్ డెక్కర్ విమానంలో దిగిన హీరో శంషాబాద్ దాటగానే కాన్వాయ్ ఆపమని అడుగుతాడు. రోడ్డు పక్కన యాభై ఏళ్ల కిందట తాను అంట్లు తోమిన ఇరానీ హోటల్లోకి వెళ్లి సాసర్లో టీ పోసుకుని తాగుతాడు. అక్కడున్న అందరూ కాటికి కాళ్లు చాచి ఉంటారు. హీరో మాత్రం ఎనిమిది పదులకు పది రోజులే తక్కువున్నా నిగనిగలాడుతూ బుగ్గలు చిదిమితే పాలుగారేంత అందంతో మిసమిసలాడుతూ ఉంటాడు. వీళ్ళందరూ ఇలా అకాల వృద్ధులు అయిపోవడానికి నీళ్లు లేకపోవడమే కారణం అని తెలుసుకున్న హీరో తన యావదాస్తి నాలుగు లక్షల కోట్లను శంషాబాద్ నీళ్ల కోసం మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తాడు.
ఈలోపు తన మనవరాలి కంటే జస్ట్ ఎనిమిదేళ్లు చిన్నదయిన హీరోయిన్ ప్రేమలో హీరో అనివార్యంగా పడాల్సి వస్తుంది. శంషాబాద్ మంచినీటి లైన్లకు ట్రాలీ ఆటో నడుపుకుంటూ పివీసి పైపుల కోసం రాజేంద్రనగర్ వెళ్లిన హీరోకు… రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏజి బిఎస్సి చేయడానికి వచ్చిన నిరుపేద హీరోయిన్ ఎర్రటి ఎండలో బస్ స్టాపులో నిలుచుని ఉండడంతో ప్రేమ పుట్టి పెరిగి పెద్దదై… పాటలు పాడుకుంటూ ఉంటుంది. అగ్రి ఎమ్మెస్సి చేస్తున్న ఎమ్మెల్యే కొడుకు హీరోయిన్ వెంటపడితే వాడితో హీరో గొడవ కాస్త చివరకు హీరో ఎమ్మెల్యేను ఎదిరించి… ఎమ్మెల్యేగా గెలిచి… ముఖ్యమంత్రి కావడంతో శుభం కార్డు పడుతుంది.
హీరోయిన్ స్ఫూర్తితో హీరో 80 ఏళ్ల నిండు వయసులో ఇంటర్మీడియెట్ క్లాసులకు వెళ్లే సీన్ల కోసం ముప్పయ్ కోట్లతో నిర్మించిన కాలేజ్ సెట్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని టాక్. టీచర్లకు హీరో పాఠాలు చెప్పే ఒక పాటను సంస్కృతంలో, ఒక పాటను ప్రాకృతంలో రూపొందించారు. మరో పాట కోసం ఒక కొత్త భాషను ఆవిష్కరిస్తున్నారని వినికిడి.
ఈ సినిమా టికెట్ తో పాటు సంస్కృతం, ప్రాకృతం, నవ్య భాష నిఘంటువులు, జండూ బామ్, కోసిన క్రోసిన్, డోలో ట్వెల్వ్ ఫిఫ్టీ డ్రోసిన్ డ్రోసులు, ఇన్సూరెన్స్ పాలసీలు ఉదారంగా అందజేయబడతాయట.
ఈ సినిమాలో భారతీయ భాషలతో పాటు మనుగడలో లేని పురాతన భాషలతో కలిపి రాసిన-
“జలం జలం ఝళంజనం
ఝలం ఝలం ఝళిపితం
తమః తమః విధి లిఖితం
అంబోనిధి అంశాతారం
తమోనిధి ఆశ్రితావతారం
సుశంషాబాధావతారం
గరం సాగరం మాహాగరం
గరం వేగిరం అజగరం
ఏ దునియా దుల్హరం
ఏ పానీ మనోహరం…”
పాట విడుదలయిన మూడు గంటల్లో ముప్పయ్ కోట్ల మంది వీక్షించడంతో ఇప్పటి దాకా ఉన్న ప్రపంచ పాటల రికార్డులన్నీ బద్దలయ్యాయట.
గట్టి సంకల్పంతో జలాన్ని గండిపేటకు గండికొట్టి శంషాబాద్ కు మళ్లించిన జలం- ఇంద్రజాలం కథ కాబట్టి ఈ సినిమాకు “ఝా” అని నామకరణం చేస్తారట. “కన్నీరు- పన్నీరు” టైటిల్ కింద ట్యాగ్ లైనట. ఏకాక్షర నిఘంటువు ప్రకారం “ఝా” కు అనేకార్థాలున్నాయి కాబట్టి ఆ టైటిలే సముచితమట.
ఈ సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్ల ముందు ఎర్రగడ్డ వారి గొలుసుల కట్టుడు ప్రత్యేక అంబులెన్సుల సేవలు ఉచితమట!
పురాణాల్లో మార్కండేయుడి వయసు ఎప్పటికీ పదహారే!
తెలుగు సినిమాల్లో హీరోర్కండేయుల వయసు కూడా ఎప్పటికీ పదహారే!!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article