ఇక థియేటర్ల పని అయిపోయినట్టే అనుకుంటున్న తరుణంలో… సినిమా ఇండస్ట్రీ ఆనందంగా ఫీలైన తరుణం… 11 నుంచి 13 వరకు దేశంలో 2.10 కోట్ల టికెట్లు తెగాయి… 390 కోట్ల కలెక్షన్లు… వందేళ్ల సినిమా చరిత్రలో రికార్డు… పైగా అందరూ వెటరన్ స్టార్ హీరోల సినిమాలు… సో, థియేటర్లు ఇంకొన్నాళ్లు బతికే ఉంటాయి… భారతీయులకు సినిమా అనేది ఓ వ్యసనం… థియేటర్‌లో వీక్షణం ఓ వినోదం… థియేటర్లలో నిలువు దోపిడీ సాగుతున్నా సరే, సగటు భారతీయుడు నిరభ్యంతరంగా తమ పర్సుల్ని, తమ బుర్రల్ని అప్పగించేస్తున్నాడు… సీన్ కట్ చేయండి…
భోళాశంకర్ ఓ డిజాస్టర్… ఓ క్రాష్… ఎవరూ సపరేటుగా చెప్పనక్కర్లేదు… కలెక్షన్ల సంఖ్య చెబుతోంది… రకరకాల వార్తలు, అభిమానుల బహిరంగలేఖలు మాత్రమే కాదు, నిన్నటి వసూళ్లపై కనిపించిన ఓ వార్త షాకింగ్‌గా ఉంది… భోళాశంకర్ నిన్నటి నెట్ వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షలు అట… క్రాష్, డిజాస్టర్ అనే పదాల్ని మించిన ఇంకొక పదం కావాలి… ఆ 390 కోట్ల పండుగలో చిరంజీవి వసూళ్లు కూడా ఉన్నాయి… కానీ హఠాత్తుగా నేలకూలింది… ఈ రెండు వార్తలూ ఓ విరోధాభాస సమీకరణంలా ఉన్నాయి కదా…
మరో వార్త చూద్దాం… ‘‘ఇవ్వాల్టితో రజినీకాంత్ సినిమా జైలర్, చిరంజీవి సినిమా భోళాశంకర్ వసూళ్లను దాటే అవకాశం ఉంది . చిరంజీవి టెరిటరీలో రజినీకాంత్ సినిమాకు కలెక్షన్స్ ఎక్కువరావటం ఆశ్చర్యకరం… ఇంతకంటే షాకింగ్ ఎలిమెంట్ ఉండదు . చిరంజీవి పునరాగమనం తరువాత ప్రొడ్యూసర్లు పోగొట్టుకున్న డబ్బు దాదాపు అక్షరాలా 200 కోట్లు . సైరా నరసింహరెడ్డి 60 కోట్లు , ఆచార్య 50 కోట్లు , గాడ్‌ఫాదర్ 25 కోట్లు, భోళాశంకర్ 55- 60 కోట్లు …’’
Ads
ఇంకో వార్త చూద్దాం… భోళాశంకర్ నిర్మాత అనిల్ సుంకర చిరంజీవి రెమ్యునరేషన్ 65 కోట్లు కట్టడానికి తన ఆస్తుల్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది… పలు ఏరియాల్లో చిరంజీవి సినిమాకు అసలు బయ్యర్లు రాకపోవడం ఏమిటి..? నిర్మాతే పలుచోట్ల సొంతంగా రిలీజ్ చేసుకుని బజారునపడ్డాడు… చిరంజీవి మాత్రం ముక్కుపిండి వసూలు చేసుకున్నాడుట… ఇప్పుడు ఇండస్ట్రీకి కావల్సింది హీరో కృష్ణ వంటి సహృదయులే అని భోళా నిర్మాత వాపోతున్నాడట… ఈ వార్తలకు బేబీ దర్శకుడు వంటి ఫ్యాన్స్ ఖండనలు కూడా జారీచేశారు… అదంతా వేరే కథ…
ఈ మొత్తం వార్తలూ చిరంజీవి ప్రజెంట్ స్టేటస్ ఏమిటో చెబుతున్నయ్… పైగా ఇండస్ట్రీలో కార్మికులు బతకడం కోసమే మేం సినిమాలు తీస్తున్నామనీ, మా రెమ్యునరేషన్ల మీద చర్చలు ఏమిటనీ చిరంజీవి వ్యాఖ్యలు చేస్తున్న తీరూ విశేషమే… చిరంజీవి ఎంత ప్రయత్నించినా తెలుగు రాష్ట్రాలను దాటి పాన్ ఇండియా దశకు వెళ్లడం లేదు… ఇప్పుడిక తెలుగు రాష్ట్రాల్లోనే పరిస్థితి దయనీయంగా మారింది… చిరంజీవి హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌కు కూడా తీవ్రంగా అసంతృప్తి కలిగించే పరిణామాలే ఇవన్నీ…
గుర్తుందా… అప్పట్లో వరుసగా చిరంజీవి సినిమాలన్నీ ఫ్లాపులుగా మారిపోతుంటే హఠాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు… తన బాట ఎలా ఉండాలి..? ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు చేయాలి..? అనే మథనంలో పడ్డాడు… ఆ తరువాత ఫుల్ కమర్షియల్, మాస్ మసాలా పాత్రలకే మొగ్గాడు… అవి ఫలించి స్టార్‌డం వచ్చేసింది… తరువాత విఫల రాజకీయ యజ్ఞంలో భంగపాటు తరువాత రీఎంట్రీ… కానీ ఇదేమంత కలర్‌ఫుల్‌గా లేదు… కారణాలు అనేకం…
అటు అమితాబ్ నుంచి ఇటు ఓ సి గ్రేడ్ హీరో దాకా ఎందరో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు, కొత్త కథలు పట్టుకుంటున్నారు… కానీ చిరంజీవి..? ప్రతిభ కలిగిన ఒక నటుడిగా కాలరెగరేసే సినిమాలు ఏవి..? కలెక్షన్లలో కాదు, అందరినీ కనెక్టయ్యే కథలేవీ, కొత్తదనం ఏదీ..? ఈరోజుకూ షకలక, ఢాండక్క గెంతులేనా..? తనంతట తాను జబర్దస్త్ స్థాయికి కుంచించుకోవడమేనా..? చిరంజీవికి మరోసారి మథనం అవసరం… చెట్లు కాయలు చివరి విడత దులుపుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను అనుకుంటే ఇక ఎవరూ ఏమీ చెప్పేది లేదు…!!
Share this Article