‘Social’ Murder: కొన్ని వార్తలు చదవకపోతేనే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వార్త ఇది. డిజిటల్ వ్యామోహంలో మనుషులు ఎలా మృగాల కంటే నీచంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి కాబట్టి చదవకతప్పదు. డిజిటల్ వ్యసనంలో పడ్డవారు వావి వరుసలు మరచి ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుని జాగ్రత్తపడాలి కాబట్టి తెలుసుకోక తప్పదు.
ఉత్తర ప్రదేశ్ లో ఒక జంట. ఇద్దరు పిల్లలు. అతడు ట్రావెల్ ఏజెంట్. ఆమె గృహిణి. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఆమెకు ఇంట్లో పని ఒత్తిడి తగ్గి…తీరిక దొరికింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారూ ఈరోజుల్లో జేమ్స్ కెమెరాన్లకు, రాజమౌళులకు దర్శకత్వ కెమెరా యాంగిల్ పాఠాలు చెప్పగలరు. అది నవీన యుగధర్మం కాబట్టి...ఖాళీగా ఉండే బదులు క్రియేటివ్ గా ఏవయినా వీడియోలు, ఆడియోలు, వ్యాఖ్యలు చేయవచ్చు కదా! అని ఆమె అనుకుని సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించింది. భర్తకు కూడా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండడం ఇష్టం.
మొదట్లో అంతా బాగానే ఉంది. కొన్నేళ్లు గడిచే సరికి భార్యా- భర్తల మధ్య షేర్లు, లైకులు, కామెంట్లు, ఫాలోయర్లు, సబ్ స్క్రైబర్ల సంఖ్య పోటీ వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో భర్త కంటే భార్యకే ఫాలోయర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇద్దరి మధ్య ఈ విషయంలో వాగ్వాదాలు మొదలయ్యాయి. చివరికి ఇన్ స్టాలో భర్త ఫాలో కాకుండా భార్య బ్లాక్ చేసింది. దాంతో భార్యకు అక్రమ సంబంధం అంటగట్టాడు భర్త. అయినా భార్య సోషల్ మీడియాలో దిన దిన ప్రవర్ధమానమవుతోంది.
Ads
భార్య సోషల్ మీడియాలో సెలెబ్రిటీ కావడాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. తన కంటే తక్కువ ఫాలోయర్లు ఉన్నంతవరకు భార్యను సహించిన భర్త…తనను దాటి వెళ్లడంతో సహించలేకపోయాడు. మాటా మాట పెరిగింది. జుట్లు పట్టుకున్నారు. చివరికి కన్న పిల్లల కళ్లెదుటే భార్య గొంతు నులిమి చంపేశాడు తాళి కట్టిన భర్త.
తల్లి లేదు. తండ్రి జైలు పాలయ్యాడు. పిల్లలు అనాథలయ్యారు. ఇది లోకంలో వెలుగులోకి వచ్చిన వార్త. వెలుగులోకి రాక…సామాజిక మాధ్యమాల ఉచ్చులో చిక్కుకుని…పరస్పరం జుట్లు పట్టుకుంటున్న, గొంతులు పట్టుకుంటున్న, అసూయ ద్వేషాలతో రగిలిపోతున్న, కత్తులు దూసుకుంటున్న ఆదర్శ అభ్యుదయ డిజిటల్ వ్యామోహ దాంపత్యాలెన్నెన్ని ఉన్నాయో?
సంసారాల్లో డిజిటల్ చిచ్చు భగ్గున మండి…లైకులు, కామెంట్ల బూడిద మిగులుతోంది. మండే అగ్గిలోకి మరింత పెట్రోల్ పొసే ఫాలోయర్లకు కొదవలేదు.
ఇప్పుడు బతుకొక గూగుల్ గజిబిజి సాలె గూడు.
జ్ఞానమొక వాట్సాప్ యూనివర్సిటీ.
జీవన దృశ్యమొక ఎడతెగని యూట్యూబ్.
మనిషి పేస్ ఒక ఫేస్ బుక్.
ఇష్టమొక ఇన్ స్టా గ్రామ్.
అభిప్రాయమొక పొట్టి ట్విట్టర్.
బలమయిన ఆహారం లైకులు.
అంతులేని ఆవేదన కామెంట్లు.
తరగని ఆస్తి సబ్ స్క్రిప్షన్.
జీవన సర్వస్వమొక సోషల్ మీడియా వ్యసనం.
…చివరకు మిగిలేది వర్చువల్ బూడిద!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article