Ramesh Sharma Vuppala పోస్ట్ ఒకటి ఆసక్తికరంగా అనిపించింది… చెప్పాలంటే ఇది నిజమేనా అని కూడా అనిపించింది… ఒకసారి ఆ పోస్టు చదవండి యథాతథంగా…
ముఖే ముఖే సరస్వతీ అన్నారు పెద్దలు. పనికల్పించుకొని మాట్లాడితే ఎంతోకొంత కొత్త సమాచారం జ్ఞానం దొరుకుతుందని నమ్మిన వాడిని. రెండు రోజుల కింద ఆత్మీయులైన వందేమాతరం రవీంద్ర గారితో కొద్దిసేపు ఫోన్ ద్వారా మాట్లాడాను. మానవ సంబంధాల గురించి కొంతసేపు మాట్లాడారు. ఆమధ్య తను మాజీ ఎంపీ జయపాల్ రెడ్డీ గారి సమీప బంధువు ఇంటికి వెళ్లారట.
ఆ భవంతిలో ఒక మాతృశ్రీ ఫోటో మిగతా వాటికన్నా పెద్దగా ఉందిట. ఈ మధ్యే చనిపోయినట్టు ఫోటో తేజుగా ఉంది. ఆ పెద్దమనిషి ఎవరు సార్… అని అడిగారు. *ఒక్క క్షణం… ఆ మధ్య యండమూరి వీరేంద్ర నాథ్ వీళ్లనేం చేద్దాం అని ఒక పుస్తకం రాసారు. ఒక ఇరవై సార్లు చదివాను. ఒకతను చనిపోయాక దేవుడు అతన్ని మన్నించి పై మూడో తరం వారి ఫోటో మీ బంధువుల ఇళ్లలో ఉందో తెలుసుకొని వస్తే మళ్లీ వెనక్కి పంపిస్తానని చెప్పారట.
Ads
ఎక్కడ వెతికినా ఎవరింట్లో చూసినా ఆ ఫోటో లేదన్నది నవల సారాంశం. మళ్లీ ప్రస్తుతానికి వస్తే ఆ ఇంటి యజమాని చెప్పిన విషయం.. ఆ ఫోటో వాళ్ళ ఇంట్లో చాలాకాలం నుంచి పనిచేస్తున్న మహిళదట . ఇప్పటి యజమాని సహా ఆయన తోబుట్టువులు చాలామందిని చిన్నప్పటి నుంచి దగ్గరుండి పెంచిందట.
ముక్కు తుడుసుడు దగ్గరి నుంచి.. కాలకృత్యాలు తీర్చడం. దగ్గరుండి అన్నం తినిపించడం ఏడిస్తే ఎత్తుకోవడం, బడికి తీసుకెళ్లడం… ఇలా సకల పరిచర్యలు చేసిందట. ఇంత గొప్ప సేవలు చేసిన ఆ మహాతల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం. ఇలా ఫోటో పెట్టీ మా పిల్లలకు పరిచయం చేయాలనే ప్రయత్నం అని యజమాని చెప్పడంతో రవీంద్ర గారు అవాక్కయ్యరుట. నిజంగా గొప్ప ముచ్చట కదా…
అది యండమూరి నవల తనపై చూపించిన ప్రభావమే కావచ్చు, నిజంగానే ఆమె ఆ కుటుంబానికి చేసిన సేవలు కూడా గొప్పవి కావచ్చు… కానీ తమకు ఏమీ కాని ఓ మహిళ ఫోటోను పెద్దగా గోడపైకి ఎక్కించి, తరువాత తరాలకు ఆమె గురించి చెప్పడం, తలుచుకోవడం చాలా గొప్ప నివాళి, కృతజ్ఞతా ప్రకటన అనిపించింది… ఆ సహృదయానికి చప్పట్లు… నిజానికి ఇప్పటికీ ఇది చదువుతుంటే ‘నిజమేనా..?’ అనే సందేహం మనసులో పీకుతూనే ఉంది… (symbolic photo only)
Share this Article