టీఎన్ శేషన్… 1990 చివరలో ఈ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యాడు… అత్యంత కీలకమైన కేబినెట్ సెక్రెటరీ ర్యాంకు దాకా ఎదిగిన ఉన్నతాధికారి… అధికార వ్యవస్థలో తెలియని కిటుకుల్లేవు… పైగా పెద్ద బుర్ర… ఎప్పుడయితే ఎన్నికల కమిషనర్ అయ్యాడో, ఇక పెద్ద కొరడా పట్టుకున్నాడు… ఎన్నికల అక్రమాలపై ఝలిపించడం ప్రారంభించాడు… ఎన్నికల సంఘం అనేది ఒకటి ఉంటుంది, తలుచుకుంటే అది తాట తీసి, దండెం మీద ఆరేస్తుంది అని ఆచరణలో చూపించాడు… అప్పటిదాకా కాగితాలు, చట్టాలకే పరిమితమైన అనేక నియమాలను బయటికి తీసి, ఒక్కొక్కరినీ పరుగులు పెట్టించాడు… ఎన్నికల్లో ధన ప్రవాహం, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, విద్వేష ప్రచారాలకు కళ్లెం వేయడమే కాదు… చివరకు వాల్ రైటింగుకు కూడా పర్మిషన్ తీసుకోవాలన్నాడు… అంటే, అంత సూక్ష్మ అంశాల దాకా వెళ్లాడు తను… పార్టీలు బెంబేలెత్తిపోయాయి…
చంద్రశేఖర్ అనే ప్రధాని వరకూ వోకే… తను ఒక టైం బీయింగ్ ప్రైమ్ మినిష్టర్… లక్కీగా కుర్చీ దొరికింది… అలాంటోళ్లకు శేషన్ చిక్కుతాడా…? శేషన్ తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలు అప్పట్లో ఓ విప్లవం… మెల్లిమెల్లిగా పీవీనరసింహారావుకూ ఆ సెగ తగలడం మొదలైంది… ఇది శేషన్‌ను మించిన బుర్ర… పైగా అత్యంత కీలకమైన రాజ్యాధికారాన్ని, రాజకీయాధికారాన్ని కలిగి ఉన్నవాడు… ఎందుకు ఊరుకుంటాడు… మెల్లిమెల్లిగా కత్తెర్లు పెట్టడం స్టార్టయింది… కేంద్ర ఎన్నికల అధికారి హోదాను తగ్గించడం దగ్గర్నుంచి, ఆఫీసులో స్టాఫ్ మీద చర్యలు తీసుకోవడం వరకూ… శేషన్ చుట్టూ మంట పెట్టసాగారు… ఇద్దరూ పంతాలకు వెళ్లారు… వ్యక్తిగతం కాదు, పరస్పరం తన్నుకునే దురుద్దేశాలు కాదు… వాళ్లు కూర్చున్న కుర్చీల ఆధిపత్యాన్ని కాపాడే ప్రయత్నాలే…
Ads
చివరకు ఓ దశలో పీవీ నరసింహారావు ఓపిక నశించింది… అకస్మాత్తుగా కేంద్ర ఎన్నికల సంఘంలో మరో ఇద్దరు సభ్యులు కూడా ఉండేలా ఆర్డినెన్స్ జారీ చేసి, మెజారిటీ నిర్ణయాలే అల్టిమేట్ అని నిర్దేశించారు… విధేయులైన ఇద్దరిని నియమించేశాడు… అంటే ఏమైంది..? శేషన్ అధికారాల్ని అడ్డంగా నరికేశాడు… ‘‘ఒక వ్యక్తి తను పంతాల కొద్ది గానీ, వేరే ప్రభావాల చేత గానీ, ఉద్దేశపూర్వకంగా గానీ నిర్ణయాలు తీసుకోగల పరిస్థితి’’ని పీవీ తొలగించాడు… శేషన్ గదిలో ఫర్నీచర్, ఫోన్, స్టాఫ్ సహా అన్నీ డిస్టర్బయ్యాయి… ఆ తరువాత శేషన్ ఓ శేషంలా మిగిలిపోయి.., చివరకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి, రాజకీయాల అసలు తత్వం బోధపడి… కార్యనిర్వాహక అధికారానికీ, రాజకీయాధికారానికీ తేడా అర్థమై… సన్యాసం స్వీకరించి, తమిళనాడు వెళ్లిపోయాడు… ఇక్కడ చెప్పుకునేది ఏమిటయ్యా అంటే..?
మన దేశమే కాదు, ఏ దేశమైనా సరే… రాజకీయాధికారమే అంతిమం… అది తనపైన ఎవరి సుప్రిమసీకి అంగీకరించదు… కాకపోతే దాన్ని సరిగ్గా వాడుకోగలగాలి… ఆ కిటుకులు, ఆ అనుభవం, ఆ చాణక్యం తెలిసినవాళ్లు పాలకుడి వెంట ఉండాలి, లేదా పాలకుడికే అవన్నీ ఉండాలి… నేనేదో సివిల్స్ పరీక్ష రాశాను, ఆ పెద్ద కుర్చీ దాకా ఎక్కాను… ఇక ఒక్కొక్కరి కథేమిటో తేలుస్తాను అంటే మన సిస్టంలో కుదరదు… ప్రతి దానికీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటయ్… కాకపోతే కీలెరిగి వాతపెట్టడం ఎలాగో పాలకుడికి తెలిసి ఉండాలి… అది ఇందిరమ్మకు తెలుసు, అది పీవీకి తెలుసు… కొందరు అది తెలియక బోల్తాకొడుతుంటారు… జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ఎపిసోడ్లు అనంతంగా సాగిపోతున్న సందర్భంగా ఎందుకో గానీ హఠాత్తుగా శేషన్ వర్సెస్ పీవీ ఎపిసోడ్ గుర్తొచ్చింది… పోలికల్లేవు… అస్సల్లేవు… వాళ్లెంత..? వీళ్లెంత..? కాకపోతే అప్పుడప్పుడు మనం కూడా చరిత్ర చదువుకోవాలి కదా…!
Share this Article