‘‘ఇటీవల కన్నుమూసిన గద్దర్ విషయంలో కూడా కేసీఆర్ నిరంకుశంగానే వ్యవహరించారు. ప్రగతిభవన్ గేటు వద్ద పడిగాపులు పడినప్పటికీ ఆయనను లోపలకు అనుమతించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల వద్ద కూడా గద్దర్‌కు ఇలాంటి అవమానం జరిగి ఉండదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే గద్దర్ మద్దతుకోసం కేసీఆర్ పాకులాడారు. ఆమరణ నిరాహార దీక్ష పేరిట నిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేసీఆర్, తాను దీక్షను కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నానని, గద్దర్ వంటి వాళ్లు దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని నన్ను స్వయంగా కోరారు.
Ads
మరుసటి రోజు నేను గద్దర్‌తో మాట్లాడి నచ్చచెప్పడంతో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి దీక్ష విరమించాలని కోరడానికి ఆయన అంగీకరించారు. విలేకరుల సమావేశానికి ఏర్పాట్లు జరిగాయి. ఇంతలో ఆనాటి యుపీఏ ప్రభుత్వం నుంచి తెలంగాణకు సానుకూలంగా సంకేతాలు వచ్చాయి. కేసీఆర్ బిగుసుకుపోయారు. కేసీఆర్‌తో దీక్ష విరమించాలని కోరడానికి టీఆర్‌ఎస్ వద్ద నుంచి గద్దర్ వద్దకు ఎవరూ రాయబారం వెళ్లలేదు. దీంతో ‘చూసినవా రాధన్నా. కేసీఆర్ ఎలాంటోడో!’ అని గద్దర్ నాతో వాపోయారు. మానవతా దృక్పథంతో కేసీఆర్‌కు మద్దతుగా నిలవడానికి అంగీకరించిన గద్దర్ పట్ల తెలంగాణ ఏర్పడ్డాక ఇదే కేసీఆర్ ఎంత అమానవీయంగా వ్యవహరించారో మనం చూశాం…’’
……. ఈ వాక్యాలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకున్న కొత్త పలుకు వ్యాసంలోనివి… ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కేసీయార్‌కు గద్దర్ యాదికొచ్చాడు… భౌతికకాయం వద్దకు వెళ్లాడు, చేతులు జోడించాడు… అధికారిక అంత్యక్రియలకూ ఆదేశించాడు… అంతకుముందు ఇదే గద్దర్‌ను కలవకుండా, మాట్లాడకుండా అవమానించాడు… ప్రగతిభవన్ గేటు వద్ద గంటల తరబడీ కూర్చోబెట్టాడు… ఆయన అంతే… తన తత్వం తెలిసినవాళ్లకు పెద్దగా ఆశ్చర్యం అనిపించదు, అనేక ఉదాహరణలు కూడా కనిపిస్తాయి…
అవసరాన్ని బట్టి వ్యక్తులను చేరదీయడం, ఇక చాలు అనుకున్నప్పుడు వదిలేయడం నిజానికి చంద్రబాబు స్కూల్‌లో నేర్పించే ప్రథమపాఠం… మరి కేసీయార్ కూడా అనేక ఏళ్లపాటు చంద్రబాబు శిబిరమే కదా… సేమ్… ఈ పాఠం నేర్పించే స్పూర్తి ఏమిటంటే… జనం ఏమనుకుంటారనే సోయిరహితంగా ఉండటం..! గద్దర్ దేహంలోకి తూటాలు నింపిన ఆ చంద్రబాబే ఇప్పుడు గద్దర్‌కు నివాళి అర్పించి, గద్దర్ బాటే తన బాట, ఇద్దరి ఆశయాలూ ఒకటేనని వ్యాఖ్యానించడం… ఇలాంటి విషయాల్లో కేసీయార్‌ది శిష్యస్థానమే… చంద్రబాబే ఆదిగురువు…
ఉండొచ్చు, గద్దర్ మీద కోపం ఉండే ఉండవచ్చు కేసీయార్‌కు… తను పళ్లరసం తీసుకుని, తన నిరాహారదీక్షను ఓ ప్రహసనం చేసినప్పుడు, తెలంగాణ మొత్తం కేసీయార్ మీద కోపగించింది అప్పట్లో… ముందుగా ఓయూ విద్యార్థులు శవయాత్రలు చేశారు… గద్దర్ కూడా నెగెటివ్‌గా రియాక్టయ్యాడు… అనివార్యంగా కేసీయార్ దీక్షను కొనసాగిస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది… సరే, ఆ దీక్ష ఎలా సాగిందనేది మరో అధ్యాయం… అంతేకాదు, గద్దర్ వంటి ‘‘ప్రశ్నల’’కు చనువు ఇవ్వకూడదనే ఆంతర్యం కూడా కావచ్చు… విశ్లేషిస్తూ పోతే ‘‘ఒడవని ముచ్చట’’…
కేసీయార్ దీక్ష విరమించాలని గద్దర్ విజ్ఞప్తి చేయాలి… ప్రజాస్వామిక, తెలంగాణ శక్తుల ఒత్తిడి మేరకే దీక్ష విరమించినట్టు కేసీయార్ కవరింగు చేసుకోవాలి… ఇదీ ఆలోచన… ఆ కేసీయార్ కోరిక మేరకు రాధాకృష్ణ గద్దర్ వద్దకు రాయబారం తీసుకుపోయాడట… గద్దర్ ఓకే అన్నాడట… తీరా కేసీయార్ ఢిల్లీ సమాచారాలు విని, గద్దర్ వద్దకు మరెవరినీ పంపించలేదట… రాధాకృష్ణ చెబుతున్న ముచ్చట నిజమే కావచ్చు… కేసీయార్ గురించి తెలిసిందే కాబట్టి నమ్మవచ్చు… గద్దర్‌ను ఎప్పుడూ తేలికగా తీసిపారేసిన కేసీయార్ తను మరణించాక వెళ్లి అంజలి ఘటించడం ఏమిటో అర్థం చేసుకోగలిగితే చాలు… కేసీయార్ అంటే ఏమిటో అర్థమైపోతాడు…! రాధాకృష్ణ చెప్పదలుచుకున్నదీ అదే..!!
Share this Article