Spring Fans: దేశంలో ఐఐటీ అంటే చాలా గొప్పే. చాలా సులభంగా దొరికేది ఏదీ సృష్టిలో విలువైనది కాలేదు. కాదు కూడా. ఒకవేళ అత్యంత విలువయినది నిజంగా తేలికగా దొరికినా దాన్ని సహజంగా మనం గుర్తించం. అలా ఐఐటీల ప్రవేశ పరీక్ష శత్రు దుర్భేద్యమయిన, అనితరసాధ్యమయిన విద్యాయుద్ధ పరీక్ష. అలా ఎందుకయ్యిందో? అలా కావడం దేశానికి మంచిదా? కాదా? అంతటి ఐ ఐ టీ ల్లో బాగా చదివి, ఆ చదువుకు ఆవగింజంత అయినా సంబంధంలేని వేరే వృత్తుల్లోకి ఐఐటీ పట్టభద్రులు ఎందుకు వెళతారు? అంత కఠోర శ్రమతో చదివిన చదువు పేరుగొప్ప సర్టిఫికెట్ మెడలో తగిలించుకోవడానికి తప్ప ఎందుకూ పనిరాకపోతే…అది దేశానికి మంచా? చెడా? అన్నది మళ్ళెప్పుడయినా మాట్లాడుకుందాం.
ఆమధ్య చెన్నై ఐఐటీలో, ఈమధ్య హైదరాబాద్ ఐఐటీలో, ఇప్పుడు ఐఐటీ కోచింగ్ పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ అయిన రాజస్థాన్ కోటా కోచింగ్ కోటల్లో వరుస ఆత్మహత్యలు, ఆ ఆత్మహత్యల నివారణకు సాంకేతిక ఆవిష్కరణలకు పరిమితమవుదాం.
Ads
సీలింగ్ ఫ్యాన్ అయిదు వేగస్థాయుల్లో తిరుగుతూ గాలిని పంచడంవరకే అయితే ఈ ప్రస్తావనే అనవసరం. చీటికి మాటికి బతుకుమీద నిరాశ పుట్టిన ప్రతివారూ ఈ సీలింగ్ ఫ్యాన్లకు ఉరివేసుకుంటూ అసలు ఫ్యాన్ల గౌరవమర్యాదలకే భంగం కలిగిస్తున్నారు. చేతిలో పిస్టల్ ఉంటే కాల్చాలనిపిస్తుంది; కత్తి ఉంటే పొడవాలనిపిస్తుంది; సిగరెట్ ఉంటే తాగాలనిపిస్తుంది; మద్యం ఉంటే తాగాలనిపిస్తుంది- అని సైకాలజీలో ఓ దిక్కుమాలిన సిద్ధాంతమేదో ఉండి చచ్చింది. అలా సీలింగ్ ఫ్యాన్ కనపడగానే దానికి తాడు బిగించుకుని ప్రాణాలను తీసుకోవాలనిపిస్తోంది బలహీన మనస్కులకు. గాలిలో కలిసే ప్రాణాలకు- గాలివీచే ఫ్యాన్లకు ప్రాణాలను అర్పించడానికి తాత్వికంగా, మార్మికంగా గాలిసంబంధం ఏమయినా ఉందేమో!
సీలింగ్ ఫ్యాన్లకు ఉరివేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతుండడంతో – సిలబస్ లో భాగమయిన సాంకేతిక అంశాలు పక్కనపెట్టి ముందు సీలింగ్ ఫ్యాన్ల సంగతి తేల్చాల్సి వచ్చింది ఐఐటీ విద్యార్థులకు. కొంత శ్రమ, కొంత కల్పనా శక్తి జోడించడంతో ఐఐటీ బుర్రలకు అద్భుతమయిన ఐడియా తట్టింది. సీలింగ్ ఫ్యాన్ బిగించడానికి పై కప్పుకు ఒక రాడ్ వేలాడదీయాలి. ఆ రాడ్ ఎంత గట్టిగా, కదలకుండా ఉంటే ఫ్యాన్ అంత భద్రంగా, నిశ్శబ్దంగా తిరుగుతుంది. ఆ రాడ్ కు ఫ్యాన్ ను బిగించే చోట రాడ్ కు – ఫ్యాన్ కు మధ్యలో ఒక స్ప్రింగును బిగిస్తారు. ఎవరయినా ఆత్మహత్యాభిలాషులు ఉరి తాడును ఫ్యానుకు- మెడకు బిగించి కింద స్టూల్ ను తన్నగానే బరువుకు స్ప్రింగు సాగుతూ వారి ప్రాణం గాలిలో కలవకుండా కింద నేలమీదకు దించుతుంది. సాటి విద్యార్థులు ఫ్యానుపాలవుతుంటే ఇంకెవరూ ఇలా బతుకును బలితీసుకోకూడదని కొందరు ఐఐటీ విద్యార్థులు ప్రయత్నించి ఒక ఆవిష్కరణ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం.
రాజస్థాన్ కోటా కోచింగ్ సెంటర్లలో ఏటా ఫ్యాన్లకు ఉరివేసుకునే విద్యార్థులు పెరగడంతో- అక్కడి అన్ని హాస్టళ్లల్లో ఫ్యాన్లకు స్ప్రింగులు బిగించాల్సిందిగా జిల్లా మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం- ఫ్యాన్లను బిగిస్తున్నారు. వారాంతంలో క్లాసులు లేకుండా సెలవు ప్రకటిస్తున్నారు.
ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు తయారయ్యే, ప్రవేశం పొందిన విద్యార్ధులు ఒత్తిడిని ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అన్నది అసలు సమస్య. దేశవ్యాప్తంగా దాదాపు ఏటా పదిహేను లక్షల మంది పోటీ పడితే 12 వేల మంది సెలెక్ట్ అయ్యే మెరికల్లాంటి ఐఐటీ పిల్లలే ఇలా ఫ్యాను రెక్కకు, చెట్టు కొమ్మకు ఉరివేసుకుంటే- వారు బతికి ఉండి బాగుచేయాల్సిన సమాజం ఏమి కావాలి? వారు బతికి ఉండి ఆవిష్కరించాల్సిన అద్భుతాలు ఏమి కావాలి?
దేశమంతా కలిపి ఐ ఐ టీ ప్రవేశ పరీక్షల కోచింగ్ పరిశ్రమ విలువ ఏటా అక్షరాలా 30 వేల కోట్ల రూపాయలు.
ఇది అతి పెద్ద విద్యా మార్కెట్.
ఐఐటీ ఒక కాసుల గలగల;
ఐఐటీ ఒక అందమయిన కల;
ఐఐటీ ఒక చిక్కు విప్పుకోలేని వల.
ఎన్నో అడ్డంకుల కోటల కోటాలు దాటి చివరికి చదువులతల్లి ముద్దుబిడ్డలు ఇలా ఐఐటీ కలల వేటలో, ఐఐటీ బాటలో, ఐఐటీ బడి ఒడిలో ఊపిరి తీసుకోవడం సమాజానికే కడుపుకోత.
ఇది బతుకుపాఠం చెప్పని పోటీ చదువులు చంపే అంతులేని కథ. తీరని వ్యథ.
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article