Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వివక్షల అడ్డంకులు అధిగమించి… ఆకాశాన మహిళా జయకేతనాలు…

August 23, 2023 by M S R

Heights of Success: ఒకప్పుడు టీచర్ , బ్యాంకు ఉద్యోగాలకు అమ్మాయిలు పోటీ పడేవాళ్ళు. ఇప్పుడు సీన్ మారిపోయింది అంతా సాఫ్ట్ వేరే. కానీ అక్కడక్కడ విభిన్నమైన వృత్తి ఉద్యోగాలు ఎంచుకునేవారు ఉంటారు. రెండు మూడు దశాబ్దాల క్రితం అరుదైన రంగాల్లో మహిళలు రాణించడం ఘనతే. అదీ అంతగా ఇష్టపడని కష్టమైన పనుల్లో.  ముంబయి మెట్రో, ఓయన్జీసీ, ఐఓసీ, ఎల్ & టీ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ దూసుకు పోతున్న నలుగురు మహిళా మణుల కథనమిది.

ముంబై వాసుల నేస్తం
దశాబ్దాలుగా ముంబై మహిళలు లోకల్ ట్రైన్స్ మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు మెట్రో వారి అవసరాలకు మరింత ఉపయోగపడుతోంది. కీలకమైన ఈ ప్రాజెక్ట్ ఎండీగా అశ్వినీ భిడే(53) ప్రశంసనీయ పనితీరు కనబరుస్తున్నారు. ప్రస్తుతం 33.5 కి. మీ పొడవైన భూగర్భ రైలు మార్గం నిర్మించే బాధ్యతలో నిమగ్నులై ఉన్నారు. ముంబై మెట్రో లైన్ త్రీ గా పిలిచే ఈ ప్రాజెక్ట్ ఇండియాలోనే అతి పొడవైన రైల్వే మార్గం. ఈ ప్రాజెక్ట్ కోసం భిడే పడిన కష్టం, ఎదురైన సవాళ్లు ఎక్కువే. స్థలసేకరణ, నిర్మాణాలకు ఎక్కువ నష్టం జరగకుండా, ఇళ్ళు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడం ఆమె విజయమే. ముఖ్యంగా సంబంధిత కేసులు, ప్రాజెక్ట్ జాప్యం వల్ల ఖర్చు చాలా పెరిగింది. అయితేనేం, ప్రాజెక్ట్ ఎనభైశాతం పూర్తవడమే కాదు, మొదటి దశ 90 శాతం పూర్తయిందని గర్వంగా చెప్తారు అశ్విని. మహిళలకు మేలైన నేస్తంగా, ముంబైకి రెండో లైఫ్ లైన్ గా మెట్రోని ప్రశంసిస్తారు. ఐఏఎస్ ఆఫీసరుగా ఈమె అనేక మౌలికసదుపాయాల సంస్థల్లో, రోడ్ ప్రాజెక్టుల్లో పనిచేశారు. సాంగ్లీ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన అశ్విని ముంబై నగరవాసుల రోజువారీ ప్రయాణాన్ని సులభం చేశారనడం అతిశయోక్తి కాదు.

Ads

బుల్లెట్ మహిళ:
బుల్లెట్ ట్రైన్ అంటే అందరికీ క్రేజ్. భారత దేశంలో అటువంటి ప్రాజెక్ట్ వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. అటువంటిది ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్లో భాగంగా ఎల్ అండ్ టీ బృందానికి సారధ్యం వహిస్తున్న తెలుగు మహిళ కోనేరు భవాని ప్రస్థానం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి భవాని తో పాటు మరో ఆరుగురు అమ్మాయిలు ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకోగా తాను తప్ప మిగిలిన వారంతా అమెరికాలో ఉన్నారు. విద్యార్థిగా ఉన్నప్పటినుంచి వివక్ష మూలాలు చూస్తున్న భవాని తన కెరీర్లో చాలా కష్టపడ్డారు. మొదటినుంచి ఎల్ అండ్ టీ లో పనిచేస్తూ ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ సారధ్యం వహించారు. దేశంలోనే కాదు, మారిషస్, సౌదీ అరేబియా వంటి విదేశాల్లోనూ ఎల్ అండ్ టీ పలు నిర్మాణ పనులు చేపట్టింది. వీటన్నిటితో నిరంతరం బిజీ గా ఉండే భవాని జమ్మూ – ఉధంపూర్ మార్గంలో చాలా ఎత్తుగా నిర్మించిన రైల్ బ్రిడ్జి అనేక సవాళ్లు ఎదుర్కొని పూర్తిచేయడం సంతృప్తి కలిగించిందంటారు. లింగ వివక్ష ప్రతిభను అడ్డుకోరాదని నమ్మే 52 ఏళ్ళ భవాని నిజమైన మహిళా బుల్లెట్.

అవాంతరాలు దాటి…
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో రిఫైనరీస్ డైరెక్టర్ గా స్వదేశంలో, విదేశంలో తీరికలేకుండా ఉంటారు 58 ఏళ్ళ శుక్లా మిస్త్రీ. అయితే ఈ స్థాయికి చేరడం అంత సులువు కాదంటారీమె. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ఈమె స్వస్థలం. డాక్టర్ కావాలనుకున్నా దూరం పంపడానికి తండ్రి ఒప్పుకోక పోవడంతో ఇంజినీరింగ్ చదవాల్సి వచ్చింది. చదువు పూర్తవగానే ఇండియన్ ఆయిల్ లో ట్రైనీ గా జాయిన్ అయ్యారు. ఉద్యోగంలో భాగంగా కఠిన శిక్షణలో రాటు తేలానంటారీమె. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో ప్రదేశాల్లో రిఫైనరీ అధికారిగా పనిచేశారు. కార్మికులు, స్థానికుల కారణంగా వచ్చే సమస్యలను భయపడకుండా చక్కబెట్టడానికి ఏ సమయంలో నైనా వెళ్లేవారు. అందుకే ఆమెను పై అధికారి పని ప్రాంతంలో ఉన్న ‘ఒక్క మగాడు’ అనేవారట. ఇది ఆమెతో పనిచేసే పురుష ఉద్యోగులకు కంటగింపుగా ఉండేది. 35 ఏళ్ళ ఉద్యోగ జీవితంలో ఐ ఓ సీ కి చెందిన 10 రిఫైనరీ లు మిస్త్రీ నిర్వహించారు. తన బాధ్యతలు సంతృప్తిగానే నిర్వహించినా ముందుముందు మరిన్ని సవాళ్లు ఉన్నాయంటారు శుక్లా. ముఖ్యంగా రిఫైనరీ లను విస్తరించే ప్రణాళిక కష్టతరమంటారు. మహిళలు పురుషులకన్నా బాగా పనిచేయగలరని, అది నిరూపించడానికి మరింత కష్టపడాలని శుక్లా అభిప్రాయం.

ఆయిల్ బావుల వేట:
కొత్త కొత్త ప్రదేశాల్లో పనిచేయాలనే ఆసక్తి సుష్మా రావత్ ని జియాలజి చదివేలాచేస్తే, పనిచేయడానికి ఓఎన్జీసీ సంస్థ తలుపులు తెరచి ఆహ్వానించింది. అలా 24 ఏళ్ళ వయసులో అడుగుపెట్టిన సుష్మా 58 ఏళ్లకు ఓఎన్జీసీ డైరెక్టర్ గా ఎదిగారు. పురుషాధిపత్యం ఉండే రంగంలో ఎదగడానికి కారణం అటువంటి వాతావరణం కల్పించిన సంస్థేనని అంటారీమె. ప్రస్తుతం చమురు బావులు కనుగొనే టీం తొలి మహిళా సారధి సుష్మ. గతంలోనే నాలుగేళ్ళ వ్యవధిలో తన బృందంతో కలసి కృష్ణా , గోదావరి తీరంలో సహజవాయువు (11 బేసిన్లలో) కనుగొనే క్రమంలో విశేషంగా కృషి చేశారు. సుష్మా కృషి ఫలితంగా ఓఎన్జీసీ కొత్త సాంకేతికత అందిపుచ్చుకుంది. పాసివ్ సీస్మిక్ టోమోగ్రఫీ , ఎయిర్ బోర్న్ హైడ్రోకార్బన్ సెన్సింగ్ సర్వే వీటిలో ప్రధానమైనవి. 33 ఏళ్లుగా ఈ రంగంలో ప్రావీణ్యత సాధించి రావత్ తన బృందంతో మరో ఆవిష్కరణకు సిద్ధపడుతున్నారు. తద్వారా ఓఎన్జీసీతో పాటు దేశానికి కూడా ఉపయోగపడాలని ఆలోచిస్తున్నారు. తనకిది పెద్ద సవాలనే రావత్ సులభంగా మరో మైలురాయిని అందుకుంటారనడంలో సందేహం లేదు.

(ఇంగ్లిష్ వ్యాపార దినపత్రిక ఎకనమిక్ టైమ్స్ లో ప్రచురితమయిన ప్రత్యేక ప్రశంసాపూర్వక కథనం ఆధారంగా…)  Kuchi Sobhasree K Sobha Sree

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions